• facebook
  • whatsapp
  • telegram

సమాజ నిర్మితి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌లో చెప్పుకోదగ్గ విలక్షణమైన, అత్యంత కీలకమైన అంశం సమాజ నిర్మితి. మన దేశంలోని వైవిధ్య సమాజ తీరుతెన్నులతో పాటు సామాజిక సమస్యలు, ఉద్యమాలు, వాటి నేపథ్యాలు.. వాటికి ప్రభుత్వ పరిష్కారాలు, ప్రణాళికలు, పథకాల రూపంలో అభ్యర్థులకు యావత్ భారత్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. 

సమస్యలు.. సంప్రదాయాలు
ఏ శాఖలో ఉద్యోగి అయినా సమాజాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. ఇలాంటి అవగాహన మెండుగా ఉన్నవారికి సమస్యల పరిష్కారం సులువవుతుంది. లేదంటే సమర్థంగా పనిచేయలేరు. ఇంతవరకు పోటీపరీక్షల్లో ఈ అంశం లేకపోవడమనేది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని సరిదిద్దారు. భారతీయ సమాజానికి, తెలంగాణ సమాజానికి సంబంధించిన పేపర్ ఇది. ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలనుకునే వ్యక్తికి గ్రామీణ, నగర, గిరిజన ప్రాంతాల్లోని సమాజాలపైనా, సమస్యలపైనా, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు, పథకాలపైన మంచి అవగాహన ఉండాలి.

వైవిధ్య భారతం
ఇతర కొన్ని సమాజాల్లాగా భారతీయ సమాజం సజాతీయమైంది(హోమోజీనియస్) కాదు. మనది వైవిధ్యమైన సమాజం. రకరకాల మతాలు, జాతులు, కులాలు, సంస్కృతులు, వర్గాలు భారతీయ సమాజంలో భాగం. మన సంస్కృతి వివిధ మతాల సమ్మేళనంపై నిర్మితమైంది. ఈ నేపథ్యంలో ముందు వివిధ మతాల మూలాంశాలు, వాటి పాత్ర, ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు.. హిందూ మతం - ఏ ధార్మిక ప్రాతిపదికలపై ఆధారపడింది? వర్ణవ్యవస్థ అంటే ఏంటి? వర్ణవ్యవస్థకున్న లక్షణాలేంటి? తెలుసుకోవాలి. అందులోంచి వచ్చిందే కులవ్యవస్థ. అలాగే ఆశ్రమ వ్యవస్థ - బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం.. అంటే హిందూ జీవన విధానాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టడానికి నైతిక వ్యవస్థ రూపొందింది. వీటితోపాటు హిందూ విశ్వాసాల గురించి కూడా కనీస అవగాహన పెంచుకోవాలి. అలాగే ఇస్లాం మతం తీసుకుంటే దీని ప్రభావం భారతీయ సమాజంపై చాలా ఉంది. ఈ మతం భారత సమాజంలో సమ్మిళితమై పోయింది. ఇస్లాంలోని పంచసూత్రాలేంటో, వాటి ప్రాధాన్యమేంటో తెలుసుకోవాలి. అలాగే క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కుల గురించి కూడా. బౌద్ధం ఆవిర్భావం.. దాని ప్రభావం భారత సమాజంపై ఎలా ఉంది? ఏ నూతన సంస్కృతులు దీనివల్ల భారత సంస్కృతిలోకి ప్రవేశించాయి? తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ప్రధాన మతగ్రంథాలు, సూత్రాల గురించి తెలుసుకోవాలి. మొత్తం మీద మతాల గురించిన ప్రాథమిక అవగాహన పొందినప్పుడే భారతీయ సమాజం అర్థమవుతుంది.

వ్యవస్థల సమ్మిళితం
భారతీయ సమాజ నిర్మితిలో రకరకాల వ్యవస్థలున్నాయి. వీటన్నింటి సమ్మిళితమే భారత సమాజం. నగర, గ్రామీణ, గిరిజన సమాజాలు.. ఈ మూడింటిలో ప్రతిదానికీ ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కులవ్యవస్థ. భారత సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. పాలనలో ప్రతిచోటా వచ్చే చాలా సమస్యలు కులంతో ముడిపడినవే. ఇటీవల గుజరాత్‌లో తలెత్తిన పటేళ్ల సమస్య అలాంటిదే. కాబట్టి కులమంటే ఏంటి? కులానికున్న సాంప్రదాయిక లక్షణాలేంటి? కులవ్యవస్థలో ఈ లక్షణాలు యథాతథంగా కొనసాగుతున్నాయా? మారుతున్నాయా? మారితే ఎందుకు మారుతున్నాయి? కారణాలేమిటి?.. ఇలాంటివి తెలుసుకుంటూ కులవ్యవస్థపై అవగాహన పెంచుకోవడం చాలా కీలకం. కులంతోపాటు ప్రధానంగా వచ్చేవి - వివాహం, కుటుంబం. భారతీయ దృక్కోణంలో దేన్ని వివాహమంటారు? వివాహానికి సంబంధించి సంప్రదాయబద్ధమైన కొన్ని నిబంధనలుంటాయి. అంతర్వివాహం, బహిర్వివాహాల గురించి తెలుసుకోవాలి. వివాహ వ్యవస్థ లక్షణాలు, రకాలు (ఏకవివాహం, బహువివాహం, బహుభార్యత్వం, బహుభర్తుత్వం).. ఇవి ఎక్కడెక్కడ అమల్లో ఉన్నాయి... లాంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే విశాలమైన భారతదేశంలో ప్రతిచోటా భిన్నమైన వివాహ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ లక్షణాల్లో మార్పులొస్తున్నాయి. ఇన్నాళ్లూ కులం అంతర్వివాహ సమూహంగా ఉండేది. ఇప్పుడు కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వాటికి సంబంధించిన చట్టాలపై కూడా అవగాహన ఉండాలి. కులాంతర వివాహాలను ఏ చట్టం ప్రకారం సమ్మతిస్తారో తెలుసుకోవాలి.

కుటుంబ పరిణామం
అలాగే కుటుంబం.. అసలు కుటుంబమంటే ఏంటి? భారతీయ సమాజంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలున్నాయో తెలుసుకోవాలి. ఉమ్మడి కుటుంబం అనేది భారతీయ సమాజ ప్రత్యేకత. మరి ఆ ఉమ్మడి వ్యవస్థ ప్రధాన లక్షణాలేంటి? వాటిలో ఏమేం మార్పులొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? చిన్నచిన్న కుటుంబాలెందుకు ఏర్పడుతున్నాయి? వాటి లక్షణాలేంటి? అవగాహన పెంచుకోవాలి. కుటుంబమనేది కొన్ని ప్రత్యేక ప్రకార్యాలు నిర్వర్తించేది. వాటిలోనూ మార్పులొచ్చాయి. ఉదాహరణకు చిన్నపిల్లల్ని పెంచడం, పోషించడం వారి సాంఘికీకరణ కుటుంబ బాధ్యతగా ఉండేది. ఇప్పుడు శిశుసంరక్షణ కేంద్రాలకు అప్పగించడం లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అలాగే వృద్ధుల సంరక్షణ కూడా కుటుంబమే చూసుకునేది. ఇప్పుడు వృద్ధాశ్రమాలు వెలిశాయి. అంటే ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థలు కుటుంబ పాత్రను పోషిస్తున్నాయి. ఇలా వివాహం, కుటుంబ వ్యవస్థ లక్షణాలు, విధులు, వాటిలో వస్తున్న మార్పులు, అందుకు కారణాలు.. ధోరణులను విశ్లేషించుకోగలగాలి. భారతీయ సమాజంలో కులం వేరు.. తెగ వేరు.. భారత్‌లో ఎన్ని తెగలున్నాయి? దేన్ని తెగ అంటారు? తెగకుండే లక్షణాలేంటి? తెలంగాణ నేపథ్యంలో ఉన్న తెగలేంటి? లాంటివాటిపై మెరుగైన అవగాహన సాధించాలి. భారతీయ సమాజం మొత్తంలో కుటుంబ, వివాహ సంస్కృతులెలా ఉన్నాయో చూసుకోవాలి.

వైమనస్యత కోణం
అసమానతలు, సామాజిక పరాధీనత లేదా సామాజిక వైమనస్యత (సోషల్ ఎక్స్‌క్లూజన్). సమాజంలో ఉండాల్సిన హక్కులు లేకపోవడం పరాధీనత. ఒక్కో సమాజంలో ఒక్కో ప్రాతిపదికపై కొన్ని సామాజిక సమూహాలను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచడం లాంటివి చోటు చేసుకున్నాయి. ఈ వివక్ష వల్ల వచ్చేది వైమనస్యత. అలాగే ఒక వ్యక్తికి ఉండాల్సిన ప్రాధాన్యం లేకపోవడం(అప్రాధాన్యం), ఉండాల్సిన హక్కులుండకపోవడం, వాటి లోటు.. సమాజం ప్రసాదించిన హక్కులు లేకుండా పోవడం, వైమనస్యత ఎక్కడుంటే ఇవన్నీ అక్కడుంటాయి. వీటివల్ల సమాజంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాదు. అమెరికా, యూరప్‌ల్లోనూ ఉంది. ఒక్కోచోట ఒక్కో ప్రాతిపదిక ఉంటుంది. ఉన్నత కులాలు, మతాలకు గౌరవ మర్యాదలు, హోదాలుంటాయి. నిమ్న కులాలు, జాతులకు వారిపై సామాజిక ఆంక్షలుంటాయి. ఉదాహరణకు కొందరిని గుడికి రానివ్వకపోవడం, అమెరికాలో తెల్లవారికంటే నల్లవారిని చులకనగా చూడటం లాంటివి. అసలు అసమానత ఎందుకు ఏర్పడుతుందనేది చూడాలి. ఇవి రెండు రకాలు - ఒకటి జన్యు పరమైంది. స్త్రీ పురుషులనేది జన్యు పరంగా ఉండే అసమానత. సమాజంలో మనుషులు సృష్టించుకునే అసమానతలు రెండోరకం. వీటిని సాంఘిక అసమానతలంటాం. సమాజమనేది ప్రయత్నపూర్వకంగానే అసమానతలను సృష్టించి సమాజంలో కొనసాగేలా చేసింది. దానికి తోడ్పడే వ్యవస్థల్లో కులవ్యవస్థ ఒకటి. ఈ వైమనస్యతకు మన దేశంలో ప్రధానంగా కులపరమైన కారణాలున్నా, దానికి మరికొన్ని కోణాలు కూడా ఉన్నాయి. జాతి, లింగ వివక్ష, జాతి సమూహాలు (ఎథినిక్ గ్రూప్స్) లాంటివి. పితృస్వామ్య వ్యవస్థలో పురుషాధిక్యత ఎక్కువ కాబట్టి మహిళలు లింగవివక్షకు గురవుతుంటారు.

సమస్యల పరిష్కారం
ఈ సామాజిక వైమనస్యతలో ఎక్కువ ప్రభావితులు అవుతున్నవారినే బలహీనవర్గాలంటాం. తరతరాలుగా ఆయా వర్గాలను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచి అభివృద్ధి ఫలాలు వారికి అందకుండా చేయడం జరిగింది. తద్వారా బలహీనవర్గాలు వచ్చాయి. వారినే భారత్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళలు, శారీరక / మానసిక వైకల్యం గలవారిగా వర్గీకరించాం. వీరందరి అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే సమ్మిళిత (ఇంక్లూజివ్) పథకాలు. వైమనస్యత వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ సమ్మిళిత పథకాలను తీసుకొచ్చారు. 11, 12 పంచవర్ష ప్రణాళికల్లో సమ్మిళిత ప్రణాళికలు, అభివృద్ధిలాంటివి ప్రవేశపెట్టారు. ఈ వర్గాలకు ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తే వారుకూడా మిగిలిన వారితో కలసి ఎదిగేలా చేయడం లాంటివి. అంటే సామాజిక, ఆర్థిక సమానత్వం ఏర్పడటానికే ఇవన్నీ. అసమానతలు అంటే ఏంటి? అవి ఎందుకు ఏర్పడ్డాయనేది అభ్యర్థులు తెలుసుకోవాలి.

సమగ్ర అధ్యయనం
సిలబస్‌లో అనేక సమస్యల గురించి ప్రస్తావించారు. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వంతోపాటు మహిళలపై జరిగే హింస, బాలకార్మిక వ్యవస్థ, బలవంతంగా మహిళలను వ్యభిచారవృత్తిలోకి దించడం, వృద్ధాప్య సమస్య, శారీరక / మానసిక వైకల్యాలను చూడాలి. గ్రూప్-1 కైతే వీటితోపాటు నిరుద్యోగం, పేదరికం, కుల సంఘర్షణలు (బిహార్, యూపీ, తమిళనాడు లాంటిచోట్ల..) వాటి కారణాలు, పర్యవసనాలు, లౌకికవాదం తదితరాలను కూడా అధ్యయనం చేయాలి. ఈ సమస్యలకు కారణమేంటి? ప్రభావితులవుతున్న వారెవరు? పరిణామాలేంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? (పథకాలు, చట్టాలు, ప్రణాళికలు) తెలుసుకోవాలి. బాలకార్మిక వ్యవస్థను తీసుకుంటే దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, బాలకార్మికులను తగ్గించడానికి తీసుకొచ్చిన పథకాలు తెలుసుకోవాలి. అలాగే నగరీకరణ - ఇదెంతగా మనకు అవసరం? మనదగ్గరెలా జరుగుతోంది. దీనివల్ల సమస్యలేంటి? (మురికివాడలు ఏర్పడటం, పర్యావరణ సమస్య, ఆరోగ్యకరమైన సమస్య, నిరుద్యోగ సమస్య తదితరాలు) ప్రభుత్వం ఏం చేస్తోంది? లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు, పునరావాసం, చట్టాలు, వాటి అమలు గురించి తెలుసుకోవాలి. జనాభా విస్ఫోటం మనకు మంచిదా? చెడ్డదా? జనాభాను సంపదగా వినియోగించుకోగలుగుతామా? గణాంకాలపరంగా అవగాహన పెంచుకోవాలి.

ఉద్యమాల ప్రభావం
భారతదేశంలో స్వాతంత్య్రానంతర కాలంలో సామాజిక ఉద్యమాలకు, ప్రభుత్వ పథకాలకు అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు రైతు ఉద్యమాలు. ఇవి బ్రిటిష్‌వారి కాలంలోనే ప్రారంభమయ్యాయి. కానీ స్వాతంత్య్రానంతరం వచ్చిన రైతు ఉద్యమాలేంటి? వాటిలో ప్రధానంగా లేవనెత్తిన సమస్యలు? ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలుసుకోవాలి. ఉదాహరణకు భూసంస్కరణలు, పంటలకు మద్దతు ధర, రైతులకు సబ్సిడీలు అనేవి రైతు ఉద్యమాల ఫలితంగా వచ్చినవే. గిరిజన ఉద్యమాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, నాగా, బోడో ఉద్యమాలన్నీ గిరిజన ఉద్యమాలే. అలాగే వెనకబడిన తరగతులు, దళితుల ఉద్యమాలు లేవనెత్తుతున్న అంశాలేంటి? అంటరానితనం, రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు.. వీటి ప్రధాన డిమాండ్లు. అలాగే పర్యావరణ ఉద్యమాలు - చిప్కో, నర్మదా బచావో ఆందోళన్ లాంటివి. అంతర్జాతీయంగా ఈ మధ్య గ్రీన్‌పీస్ ఉద్యమం వస్తోంది. అలాగే మహిళలకు సంబంధించిన ఉద్యమాలు.. స్వాతంత్య్రానికి ముందు వచ్చిన ఉద్యమాల(సతి, బాల్యవివాహాల రద్దు)తో పాటు, తర్వాత కాలంలో సమాన హక్కుల కోసం, ధరల పెంపుపై, కార్యాలయాల్లో లైంగికహింస తదితరాలపై ఫెమినిస్టు, సంస్కరణల ఉద్యమాలున్నాయి. నిర్భయ చట్టం వాటి ఫలితంగా వచ్చిందే. వీటన్నింటికి తోడు చిన్నరాష్ట్రాల కోసం, స్వయంప్రతిపత్తి కోసం జరుగుతున్న ఉద్యమాలు. ఎందుకు ఈ చిన్నరాష్ట్రాల కోసం ఉద్యమాలొస్తున్నాయో అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమమే కొత్తది కాదు. అంతకుముందు ద్రవిడియన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ప్రత్యేక విదర్భలాంటివి చూడాలి.

పథకాల పఠనం
ఇది చాలా కీలకమైన అంశం. సామాజిక సమస్యలను అధిగమించడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లుగా కొన్ని పథకాలను రూపొందించాయి. అవేంటో అర్థం చేసుకోవాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బాలకార్మికులు, వృద్ధులు, శారీరక మానసిక వైకల్యం ఉన్న వర్గాలకు ఉద్దేశించిన జాతీయ, రాష్ట్రీయ పథకాలేంటో చూడాలి. గ్రూప్-2లో ఇవి మాత్రమే ఉన్నాయి. అదే గ్రూప్-1కు వచ్చేసరికి పర్యావరణ, జనాభా, విద్య విధానాలను కూడా చూడాలి. ప్రణాళికలను పూర్తిగా చదవడం కాదు. ఎవరెవరి కోసం ప్రణాళికలున్నాయి? వాటి ముఖ్యాంశాలేంటి? లక్ష్యాలేంటి? అమలుకు వ్యూహం ఏంటి? తెలుసుకుంటే చాలు. ఈ ప్రణాళికలకు అనుబంధంగా వచ్చినవే వివిధ సంక్షేమ పథకాలు. పథకాలనేవి ప్రణాళికలు, విధానాల్లో భాగం! ఉదాహరణకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ఉపాధి పథకాలు. భారత్ నిర్మాణ్ (మౌలిక సదుపాయాల పెంపు కోసం ఉద్దేశించింది) ఎన్ఆర్ఈజీఎస్, ఎస్‌జీఎస్‌వై ఉపాధికి సంబంధించినవి. ఐసీడీఎస్ లాంటివి మహిళలు, పిల్లలకు సంబంధించినవి. స్టెప్, రాష్ట్రీయ మహిళా కోశ్ వంటివి.. ఎస్సీ, ఎస్టీ, వృద్ధులు, బాలకార్మికులకు సంబంధించిన పథకాల గురించి చూసుకోవాలి. ప్రభుత్వ విధానాలు, వాటికి అనుబంధంగా ఏర్పడిన చట్టాలు, పథకాలు కూడా అత్యంత కీలకం.

తెలంగాణ సమాజం
తెలంగాణలో ప్రధానంగా కొన్ని సమస్యలున్నాయి. తెలంగాణ సమాజం చారిత్రకంగా కాస్త భిన్నమైంది. ఎందుకంటే - భౌగోళికంగా ఇది దక్కన్ పీఠభూమి. రెండోది - పాలనా పరంగా ఇది నిజాం కింద ఉండేది. దాదాపు ఇది ప్రత్యేక ప్రాంతంగా కొనసాగింది. ముస్లిం మతం ప్రభావం ఈ సమాజంపై ఎక్కువ. ఇక్కడున్న సామాజిక, ఆర్థిక పరిస్థుతుల నేపథ్యంలో కొన్ని సమస్యలొచ్చాయి. అందులో ఒకటి వెట్టిచాకిరి. ఇక్కడున్న సామాజిక నిర్మితిలో ఉన్నత కులాలకు చెందినవారు ముఖ్యంగా భూస్వామ్య కులాలు (ప్రాబల్య కులాలు) ఇతర నిమ్నకులాల వారిని వివిధ రకాలైన వృత్తులు, పనుల కోసం ఉపయోగించేవారు. దానికి ప్రతిఫలంగా ఇంతమొత్తం ఇవ్వాలని ఎక్కడా లేదు. ఉచితంగా చేయించుకునేవారు. వెట్టి అంటే వట్టిగా, బలవంతంగా చేయించుకోవడం. ఇది శ్రమదోపిడీ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రావడానికి వివిధ కారణాల్లో వెట్టి ప్రధాన కారణం. అలాగే మహిళలను పరోక్షంగా వ్యభిచార వృత్తిలోకి దించే సంప్రదాయాలు దక్షిణభారతంలో ఉన్నాయి. అలాంటి వ్యవస్థే తెలంగాణలోని జోగిని లేదంటే దేవదాసి. ఆంధ్రలోనూ ఈ దేవదాసి వ్యవస్థ ఉంది. మహిళలు తమకుతాము భగవంతుడికి అర్పించుకోవడం జోగిని వ్యవస్థ. దేవాలయానికి తమను అర్పించుకోవడం. కానీ దైవకార్యానికి బదులు వాళ్లను పడుపు వృత్తిలోకి దించడం జరిగింది. దీనివల్ల చాలా సమస్యలు తలెత్తాయి. ఈ ప్రక్రియంతటిపై అవగాహన పెంచుకోవాలి.
బాలకార్మిక వ్యవస్థ - దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య తెలంగాణలో ఎక్కువ. ఏ వర్గాల పిల్లలు ఎక్కువగా ఉన్నారనేది కీలకం. తెలంగాణ సామాజిక కోణంలో చూస్తే భూమి ప్రధాన జీవనోపాధి. ఇది ప్రాబల్య కులాల చేతుల్లో ఎక్కువగా ఉండేది. మధ్య, నిమ్న కులాలకు సంబంధించిన వారంతా భూమిలేని కూలీలే. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కుటుంబాల్లోని పిల్లలు బాలకార్మికులుగా పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే విధంగా ఉపాధి అవకాశాలు లేక వలసలు కూడా ఎక్కువగా జరిగాయి. ఇందులో భాగంగా పిల్లల్ని కూడా పనిలోకి పెట్టారు. అలాగే ఫ్లోరోసిస్ సమస్య గురించి కూడా సిలబస్‌లో ఉంది. ఫ్లోరోసిస్‌ను కేవలం ఆరోగ్య సమస్యగానే కాకుండా ఆర్థిక సమస్యగా కూడా చూడాలి. అనారోగ్యం వల్ల కుటుంబంపై పడే ఆర్థిక భారం, దీని నివారణకు ప్రభుత్వం తీసుకున్న పథకాలపై అవగాహన పెంచుకోవాలి.

వలస జీవనం
తెలంగాణలోని మరో ముఖ్య సమస్య వలసలు. ఇక్కడి వలసలకు ఓ ప్రత్యేకత ఉంది. వలసంటే కేవలం ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లడం కాదు. ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరీతిలో వెళతారు. భారతదేశంలోని చాలా నిర్మాణాల్లో పాలమూరు ప్రజల శ్రమ కనిపిస్తుంది. అలాగే కరీంనగర్, నల్గొండల్లోని కొన్నిప్రాంతాల చేనేత వృత్తుల వారు దేశంలోని వలసల్లో ఉన్నారు. మెదక్ నుంచి వలస వెళ్లినవారంతా వ్యవసాయ కూలీలు. ఆ దృష్టితో వలసలను అర్థం చేసుకోవాలి. ఏ కారణాలవల్ల, ఏ వృత్తుల్లో, ఏ ప్రాంతాల్లో వలసల ప్రభావం ఉందో చూడాలి. ఆత్మహత్యల్లోనూ రైతులు, చేనేత వృత్తుల వారే ఎక్కువ. వీరు చాలామటుకు ఈ వృత్తులతో సాంస్కృతికంగా మమేకమైపోయారు. వేరే పని చేయలేరు. హరిత విప్లవం తర్వాత వాణిజ్యపంటల పట్ల మొగ్గు పెరిగింది. కానీ ఇక్కడ కచ్చితమైన సాగునీటి వ్యవస్థ లేదు. వర్షాధారం, లేదంటే భూగర్భజలాలపై ఆధారం ఎక్కువ. దీంతో నష్టం ఎక్కువవుతోంది. ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌