• facebook
  • whatsapp
  • telegram

మానవ అక్రమ రవాణా

ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజల హక్కులు, రక్షణలను అతిక్రమించి, అభీష్టానికి వ్యతిరేకంగా వారిని పీడించడమే మానవ అక్రమ రవాణా. ఏటా లక్షల మంది ఇలాంటి పీడనకు గురవుతూ సామాజిక మినహాయింపు / వెలి (సోషల్ ఎక్స్‌క్లూజన్) పరిధిలోకి చేరుతున్నారు. ఈ సామాజిక వైపరీత్యం వల్ల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనతోపాటు దేశం విలువైన మానవ వనరులను కూడా కోల్పోతోంది.

'అక్రమ' రూపాలు
1. బాలలు
దొంగిలించడం లేదా కొనుగోలు చేయడం ద్వారా నెలల వయసులోనే బాలలను సేకరిస్తారు. బాలికలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇలా అక్రమంగా తీసుకొచ్చిన బాలబాలికల ద్వారా అనేక రూపాల్లో ఆర్థిక ప్రయోజనం పొందుతుంటారు.
ఆర్థిక ప్రయోజన రూపాలు
* అడుక్కునేలా చేయడం
* గృహ పనులు
* యవ్వనంలో బాలికలతో వ్యభిచారం
* బలవంతపు చాకిరి
* బాలురతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు

2. యువతులు
దొంగిలించడం, కిడ్నాప్ చేయడం, కొనుగోలు చేయడం, దొంగ పెళ్లిళ్లు చేసుకోవడం, ఆకర్షించడం ద్వారా యువతులను సేకరిస్తారు.
ఆర్థిక ప్రయోజన రూపాలు
* బాల్యంలో గృహ పనులు
* కౌమార / యవ్వన దశలో వ్యభిచారం
* అదనపు భార్యలుగా ఉంచడం
* బలవంతపు చాకిరి
* మానవ అక్రమ రవాణాలో యజమానులుగా మారడం

3. పురుషులు
'ఉద్యోగ' ఆకర్షణతో సేకరిస్తారు.
ఆర్థిక ప్రయోజన రూపాలు
* బలవంతపు చాకిరి
* వ్యభిచారం
* అదనపు భర్తలుగా మారడం
* సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం

4. వృద్ధులు
సంపాదన శక్తి లేనివారికి జీవనోపాధి ఆకర్షణ చూపించడం
ఆర్థిక ప్రయోజన రూపాలు
* అడుక్కోవడం
* మానవ అక్రమ రవాణాను నిర్వహించడం
ఏటా 40 వేల మంది బాలల అదృశ్యం
భారతదేశంలో బలహీనవర్గాలకు చెందిన ప్రజలు, ప్రధానంగా మహిళలు మానవ అక్రమ రవాణాకు బలవుతున్నారు. ఏటా 40,000 మంది బాలలు అదృశ్యం అవుతున్నారు. అందులో 10 వేల మందికి పైగా శాశ్వతంగా దొరకడం లేదు.
పశ్చిమ్‌బంగ, తమిళనాడు, కర్ణాటక మానవ అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వేర్వేరు గణాంకాలు ఇంకా లభ్యం కానప్పటికీ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండేది.
దేశంలో మానవ అక్రమ రవాణాకు యాచకవృత్తి, వ్యభిచారం ప్రేరణలుగా నిలుస్తున్నాయి. ఆకర్షణీయ రంగు, రూపం ఉన్న బలహీన వర్గాలు / తెగల మహిళలను ఈ ఊబిలో దించుతున్నారు.
భారతదేశంలో మానవ అక్రమ రవాణాపై అధ్యయనం చేసిన జస్టిస్ వర్మ కమిటీ సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపించింది.

దోహదపడుతున్న అంశాలు
1. పేదరికం
దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 15% పైగా తీవ్ర పేదరికం ఉన్నట్లు తెలుస్తోంది. పేదరికాన్ని భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెట్టిచాకిరి, వ్యభిచారం, బలవంతపు చాకిరి వైపు పయనిస్తున్నారు. పిల్లలను పెంచలేని పరిస్థితి, కనీస జీవన అవకాశాల లేమి వారిని ఈ దిశగా ప్రేరేపిస్తున్నాయి.

2. దళారుల ప్రభావం
మానవ అక్రమ రవాణాలో క్రియాశీలక పాత్ర దళారులదే. ఆకర్షణీయ జీవితాన్ని ఊహించుకుని.. గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం దళారులు పన్నిన వలలో పడుతున్నారు. తమ హక్కులు, బాధ్యతలు కోల్పోయి ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. తీరా అక్కడికి చేరుకున్నాక బానిస బతుకులు బతకాల్సి వస్తోంది. నైపుణ్యం అంతగా లేని ఉద్యోగాల్లో ఈ అవస్థలు ఎక్కువ.
తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా దీనికి కారణం. తాము ఎలాగూ మంచి జీవితాన్ని చూడలేదని, కనీసం తమ పిల్లలైనా బాగుపడతారనే ఆశావాదంతో వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. వివాహం, ఒప్పందం రూపాల్లో వేరే ప్రాంతాలకు బదిలీ జరుగుతోంది. పిల్లలు కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదని దళారుల మాట నమ్మి బలవుతున్నారు. కొత్త ప్రాంతాల్లోకి వెళ్లిన తర్వాత బహుభార్యత్వం, బలవంతపు చాకిరి లాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హక్కులు, జీవన భద్రత లేకుండా నిస్సహాయ జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లల కొనుగోలులో కూడా ఈ దళారులదే కీలక పాత్ర. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పిల్లలను తరలిస్తున్నారు. డబ్బును ఎరగా చూపించడం వల్ల వారు నిస్సహాయలుగా మిగిలిపోతున్నారు.

3. సమస్య తీవ్రతను గుర్తించకపోవడం
సమాజం, ప్రభుత్వం ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. విలువైన మానవ వనరులు దోపిడీకి గురవుతున్నాయనే స్పృహ వారిలో కొరవడింది. మానవ అక్రమ రవాణా మూలాలు స్పష్టంగా వారికి తెలుస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

4. పేదరిక నిర్మూలన పథకాల వైఫల్యం
గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన పథకాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక గత్యంతరం లేక 'తప్పనిసరి నరకం'గా భరిస్తూ అక్రమ రవాణాకు వాహకాలుగా మారుతున్నారు.

5. సమాజంలో అవగాహన రాహిత్యం
అక్రమ రవాణా రూపాలు సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉంటున్నాయి. దీనివల్ల సమాజం నుంచి పెద్దగా ప్రతిఘటన రావడం లేదు. పేదరికంలో మగ్గుతున్న సమాజంలోని ప్రజలు వ్యభిచారం, బలవంతపు చాకిరీలను పెద్ద సమస్యలుగా భావించడం లేదు.

6. పట్టణీకరణ
పట్టణాల్లో పెరుగుతున్న జనాభా ఒత్తిడి కూడా మానవ అక్రమ రవాణాకు ఉపకరిస్తోంది. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన శ్రామికులు, కూలీలు, యువత మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. మహిళలను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించుతున్నారు. చేసిన నేరాలను కప్పిపుచ్చవచ్చనే హామీలతో వారిని ప్రేరేపిస్తున్నారు.

7. జంక్షన్ ప్రాంతాలు
కోల్‌కతా, ముంబయి, న్యూదిల్లీ లాంటి జంక్షన్ ప్రాంతాలు సీమాంతర అక్రమ రవాణాకు ఉపకరిస్తున్నాయి. విదేశీ మహిళలకు భారతదేశంలో బాగా డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా జరుగుతోంది. కాశ్మీర్ లాంటి సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్రవాద ముసుగులో బాలలను అక్రమంగా తరలిస్తున్నారు. నాగాలాండ్, మిజోరాం లాంటి ప్రాంతాల్లోనూ అక్రమ రవాణా ఎక్కువగా ఉంది.

శిక్షార్హం..
భారత్‌లోని అక్రమ రవాణాపై అధ్యయనం చేసిన జస్టిస్ వర్మ కమిటీ వివిధ కోణాల్లో ఈ విషయాన్ని స్పృశించింది. ఈమేరకు నేరాలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించవచ్చు. అవి..
1. ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 366 కింద కేసు నమోదు చేసి శిక్షించవచ్చు.
2. ది ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ - 1956, తదనంతర సవరణలు - 1986, 2006, 2014.
3. వెట్టి కార్మికుల నిషేధ చట్టం - 1976
4. బాల కార్మికుల నిషేధ చట్టం - 1986. 2015లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం 'గృహ, వృత్తి సంబంధిత సొంత పనుల్లో తప్ప మిగిలిన వేటిలోనూ బాలలను ఉపయోగించకూడదు' అని స్పష్టం చేశారు.
5. జువైవల్ జస్టిస్ చట్టం - 2000
6. గనుల చట్టం - 1958
7. ఫ్యాక్టరీల చట్టం - 1938
8. బాలకార్మిక హక్కులు - కమిషన్ చట్టం 2006

మానవ అక్రమ రవాణా
ఏ రూపంలో ఎంత శాతం?
1. లైంగిక వ్యాపారం 38%
2. గృహాల్లో బలవంతపు చాకిరి 28%
3. బాలల బలవంతపు చాకిరి 7%
4. ఇతర రూపాల్లో బలవంతపు చాకిరి 7%
5. ఆస్పత్రులు, హోటళ్లలో బలవంతపు చాకిరి 4%
6. బాలల ద్వారా లైంగిక వ్యాపారం 3%
7. వస్త్ర దుకాణాలు, ఆహార పదార్థాల తయారీలో బాలకార్మికులు 3%
8. ఇతరాలు 10%

ప్రపంచంలో మూడో 'వ్యాపారం'
మాదక ద్రవ్యాల సరఫరాను ప్రపంచంలోని అతిపెద్ద అక్రమ వ్యాపారంగా పేర్కొంటారు. తర్వాతి స్థానం ఆయుధాల అక్రమ రవాణాది కాగా మానవ అక్రమ రవాణా మూడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా విదేశాంగ శాఖ మానవ అక్రమ రవాణా నేరాలకు సంబంధించి ప్రపంచ దేశాలను 3 రకాలుగా వర్గీకరించింది.
టైర్-1: మానవ అక్రమ రవాణా తక్కువగా ఉన్న దేశాలు
టైర్-2: మానవ అక్రమ రవాణా మధ్యస్థంగా ఉన్న దేశాలు
టైర్-3: మానవ అక్రమ రవాణా ఎక్కువగా ఉన్న దేశాలు
భారతదేశం టైర్-2లో ఉంది. మలేసియా, థాయిలాండ్, వెనిజులా లాంటి దేశాలు టైర్-3లో ఉన్నాయి.
అమెరికా అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా ద్వారా ఏటా 10 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. మానవుల అక్రమ రవాణాను సంఘ వ్యతిరేక, అనైతిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఈ నేరాలు కొనసాగుతున్నాయి. పేదరికాన్ని రూపుమాపడం.. ఆచార సంప్రదాయాలు, సామాజిక నిర్మాణాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మానవ అక్రమ రవాణా అనే ఈ సామాజిక మినహాయింపును తొలగించడానికి వీలవుతుంది.

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌