• facebook
  • whatsapp
  • telegram

GATE: మెరుగైన స్కోరుకు మేలైన వ్యూహం!

గేట్‌ - 2022 తుది సన్నద్ధతకు నిపుణుల సూచనలు

ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) వివిధ విభాగాల్లో త్వరలో వరుసగా జరగబోతోంది. ఇప్పటివరకు శ్రద్ధగా సాగించిన సన్నద్ధత ఫలించేలా ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ర్యాంకు/ స్కోరు సాధించవచ్చు. ఇప్పటివరకు కొనసాగించిన సన్నద్ధత ఒక ఎత్తు... ఈ తుది సమయంలో వ్యూహాత్మకంగా మెరుగులు దిద్దుకోవడం మరో ఎత్తు! 

గేట్‌-2022 పరీక్ష వాయిదా పడుతుందని సామాజిక ప్రసార మాధ్యమాల్లో వదంతులు వినిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం ఇప్పటివరకు లేదు. దీని గురించి సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://gate.iitkgp.ac.in/ లో మాత్రమే చూడాలి/ పరిశీలించాలి. గేట్‌ అడ్మిట్‌ కార్డు విషయంలో జాప్యం జరిగినప్పటికీ జనవరి 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ గేట్‌ అడ్మిట్‌ కార్డు ఆధారంగా పరీక్ష తేదీలోగానీ, సమయంలోగానీ ఎలాంటి మార్పూ లేదు. ఒకవేళ కరోనా కారణంగా పరీక్ష నిర్వహణ వాయిదా పడినా, ముందే సూచించిన ప్రణాళిక ప్రకారం జరిగినా అభ్యర్థులు సన్నద్ధత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగాలి.

గేట్‌ స్కోరును బట్టే వివిధ ఐఐటీలూ, ఐఐఎస్‌టీ బెంగళూరు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నెలవారీ రూ.12,400 ఉపకారవేతనం ఓ ఆకర్షణ. ఇంకా వివిధ మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలకు కూడా గేట్‌ స్కోరే ఆధారం.

ఐఐటీల్లో ఎ.ఇ./ఎం.టెక్‌ సీటు అంటే నాణ్యమైన సాంకేతిక విద్య మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందగల సదవకాశం. ఈ బంగారు భవితను దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధంకావాలి. 

పునశ్చరణ తప్పనిసరి 

పరీక్షలోపు ఉన్న ఈ సమయాన్ని పునశ్చరణ (రివిజన్‌) సమయంగా పరిగణించాలి. చదివి గ్రహించిన విషయాలను పునశ్చరణ చేయాలి. 

10 నుంచి 20 శాతం సమయం ప్రాథమిక అంశాలకూ, 70 శాతం సమయం పరీక్షలోపు దృష్టి పెట్టాల్సిన అంశాలకూ, చివరి 10 శాతం సమయం కఠిన అంశాల సాధనకూ కేటాయించాలి. 

ప్రతిరోజూ 2, 3 సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ఫార్ములాలను అభ్యసించి వాటిని నోట్స్‌లాగా తయారుచేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రోజు త్వరిత పునశ్చరణకు ఉపయోగపడుతుంది. 

సన్నద్ధత సమయంలో తయారుచేసుకున్న చిన్న చిన్న పట్టికలు/ షార్ట్‌ నోట్స్‌ ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.

ప్రతి ఫార్ములాకూ సంబంధించి ఒకటి రెండు న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ను అభ్యాసం చేయాలి.

ఈ సమయంలో క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో నిర్వహించే నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) రాయడం వల్ల ప్రిపరేషన్‌ నాణ్యత అర్థం అవుతుంది. దీనివల్ల సమగ్ర అవగాహనలేని విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. 

75 శాతం ప్రశ్నలు సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉంటాయి. వీటి కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 

గతంలో ఎన్నడూ అడగని (అన్‌టాప్‌డ్‌) అంశాలపై తగిన దృష్టి సారించాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకు గేట్‌లో అడుగుతుంటారు. కాబట్టి వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి.

కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి.

కఠినమని కంగారు వద్దు 

నమూనా పరీక్షలు రాస్తున్నప్పుడే తగిన మెలకువలు అలవాటు చేసుకోవాలి. పరీక్షలో కఠిమైన ప్రశ్నలను చూసి ఆందోళనకు గురికాకూడదు. మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారుపడనవసరం లేదు. గేట్‌ స్కోర్‌ కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మరిచిపోకూడదు. పూర్వపు గేట్‌ పరీక్షలను పరిశీలిస్తే కొన్ని విభాగాల్లో 100కు 65 నుంచి 75 మార్కులు సాధించినవారికీ ఉత్తమ ర్యాంకులు వచ్చాయి; మంచి సంస్థల్లో ప్రవేశం పొందారు. 

న్యూమరికల్‌ ప్రశ్నలకు సరైన సమాధానం మౌస్, వర్చువల్‌ కీపాడ్‌ను ఉపయోగించి గుర్తించాలి. 

బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక ఫార్ములాను, మౌలికాంశాన్ని విద్యార్థి ఎన్ని విధాల తప్పు చేయవచ్చో, ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో ముందుగానే పేపరు సెట్టర్లు ఊహించి తదనుగుణంగా ఆప్షన్లు ఇస్తారు. మనకు వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒక్క క్షణం మిగతా ఆప్షన్లను కూడా పరిశీలించాలి.  

బహుళ ఎంపిక ప్రశ్నలు కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలుగానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటికంటే ఎక్కువ సరైన ఆప్షన్లు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి అన్ని సరైన ఆప్షన్‌లనూ గుర్తించాలి. ఉదాహరణకు ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లలో మూడు సరైనవైతే ఆ మూడింటినీ గుర్తించాలి. ఒకవేళ ఒకటో రెండో సరైన ఆప్షన్‌లు గుర్తించినా ఎలాంటి మార్కులూ ఇవ్వరు. 

ప్రతి అధ్యాయమూ చదవాలి

గేట్‌లో అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నింటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.

ఇప్పటివరకు ఎప్పుడూ చదవని కఠినమైన కొత్త విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

కఠినంగా ఉండే అధ్యాయాలను అర్థం చేసుకోడానికి చాలా సమయం పడుతుంది. సబ్జెక్టు మీద పూర్తిగా పట్టులేనివారు ఈ తరుణంలో ఇలాంటివాటికి ఎక్కువ సమయం కేటాయించకూడదు.  

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.

పూర్వం చదివిన అంశాలన్నీ గుర్తుంటాయని భావించకుండా.. చదివిన అన్ని అంశాలనూ పునశ్చరణ చేయాలి.

అభ్యర్థులు సాధారణంగా ప్రిపరేషన్‌ అనంతరం తమకు సులభంగా అనిపించిన అంశాల పునశ్చరణకు మాత్రమే ప్రయత్నిస్తారు. అలాకాకుండా పూర్వం చదివిన క్లిష్టమైన అంశాలనూ రివైజ్‌ చేయాలి.

పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయడం కష్టం. 3 గంటల వ్యవధిలో ఏయే ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమో నిర్ణయించుకోవాలి. సన్నద్ధమయ్యే సమయంలో కూడా అదే సూత్రం పాటించాలి. 

గత ప్రశ్నపత్రాలను బట్టి 25 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతాయి. వీటి కోసం 25 సంవత్సరాల ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రుణాత్మక మార్కులు

పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయని మర్చిపోకూడదు. కచ్చితంగా తెలిసిన సమాధానాలను మాత్రమే రాయాలి. అంచనా వేసి గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది. తప్పు సమాధానాలు రాస్తే ఒక మార్కు ప్రశ్నకు 1/3 మార్కులు, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 మార్కుల చొప్పున తగ్గిస్తారు. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.

ఈ తరుణంలో ఇవి ముఖ్యం

ఈ కీలక సమయంలో సమయాన్ని ఏమాత్రం వృథా చేయకూడదు. టీవీ, సినిమా, యూట్యూబ్‌ చూడటం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌ల్లో చాటింగులూ మానివేయడం ఎంతైనా మంచిది. వీలైతే సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేయడం మేలు.

సన్నద్ధతను వీలైనంత త్వరగా పూర్తిచేసి పునశ్చరణ చేయాలి.

వెయిటేజీ ఆధారంగా ముఖ్య ఫార్ములాలు, కీలకాంశాలను సాధన చేయాలి.

పాఠ్యపుస్తకాల్లో ఉండే సాల్వ్డ్, అన్‌సాల్వ్డ్‌ ప్రశ్నలను సాధన చేయాలి.

వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాయాలి. వీటిని రాసినప్పుడు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

పరీక్షా సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఒత్తిడి సహజం. ఇప్పటివరకు చేసిన సన్నద్ధత పరీక్ష రాయడానికి సరిపోతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి. సరిగా సిద్ధంకాలేదని గానీ, మరే కారణం వల్ల గానీ ఆందోళన చెందవద్దు. పరీక్ష రాయడానికి ముందు ప్రశాంతత ఎంతో ముఖ్యం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. 

అవకాశముంటే గేట్‌కు తయారవుతున్న స్నేహితులతో బృందాలుగా ఏర్పడి, చదివిన అంశాలను ఒకరికొకరు చర్చించుకోవాలి. దీనివల్ల కొన్ని సందేహాలు నివృత్తి అవుతాయి; కొత్త అంశాలపై అవగహన ఏర్పడుతుంది. 

అన్ని సబ్జెక్టుల ముఖ్య ఫార్ములాలను మననం చేయాలి.

పరీక్ష ముందురోజు ఏదైనా ప్రామాణికమైన ‘మోడల్‌ గేట్‌ పేపర్‌’ను నిర్దిష్ట సమయం పాటిస్తూ రాస్తే పరీక్ష రోజుకు ఉపయోగకరం.

పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాన్ని రాయడానికి ప్రయత్నించామనే దానికంటే.. ఎన్నింటికి సరైన సమాధానాలు రాశామనేదే ముఖ్యం.

వర్చువల్‌ కాలిక్యులేటర్‌తో జాగ్రత్త

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అయిన గేట్‌ పరీక్ష కేంద్రంలోకి సాంప్రదాయిక కాలిక్యులేటర్లను అనుమతించరు. వర్చువల్‌ కాలిక్యులేటర్‌తోనే సంఖ్యా సంబంధిత ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ కాలిక్యులేటర్‌తో కొన్ని హయ్యర్‌ ఆర్డర్‌ ఈక్వేషన్లు చేయలేము. అలాంటి ప్రశ్నలకు మెథడ్‌ ఆఫ్‌ సబ్‌స్టిట్యూట్‌ లేదా ఎలిమినేషన్‌ పద్ధతిలో వర్చువల్‌ కీప్యాడ్‌ ఉపయోగించాలి. అందుకని ఈ విషయంలో తగిన సాధన చేయాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే 4 లేదా 5 పూర్తి నమూనా ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా రాయాలి. 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌తో టెక్నీషియన్‌ ఉద్యోగం!

‣ విజ్ఞాన సంరక్షణలో విస్తరిస్తున్న కొలువులు

‣ బ్యాంకు, బీమా.. కేంద్ర కొలువుల ధీమా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌