‣ 2022, 2023 పరీక్షల వ్యూహం
ఉన్నత విద్యకూ, ఉపాధికీ తోడ్పడే ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి పోటీ పరీక్ష... గేట్! దీన్ని 2022లో, 2023లో రాసి మెరుగైన స్కోరు సాధించాలనే లక్ష్యంతో ఎందరో అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొవిడ్ పరిణామాల నేపథ్యంలో వీరి సన్నద్ధత ప్రణాళిక ఏ విధంగా ఉండాలి?
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖల తరపున ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు, 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది.
గేట్ స్కోరు ఆధారంగా వివిధ ఐఐటీలు, ఐఐఎస్‌సి బెంగుళూరు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. దీనికి తోడు రూ.12,400 ఉపకార వేతనం ఓ ఆకర్షణ. మహారత్న, మినీరత్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలకు కూడా ఈ గేట్ స్కోరే ఆధారం.
కొత్త పేపర్లు
ప్రాధాన్యం ఆధారంగా.. గేట్లో ఎప్పటికప్పుడు కొత్త పేపర్లను చేరుస్తూ వస్తున్నారు. గేట్-2022లో కొత్తగా రెండు పేపర్లను చేర్చి మొత్తం 29 పేపర్‌లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అదనంగా చేర్చబోయే రెండు పేపర్లు:
‣ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్: వస్తు రవాణాలో ప్రధానమైనది జల రవాణా మార్గం. దీనికి పెరుగుతోన్న ప్రాధాన్యం కారణంగా సాంకేతిపరంగా కొత్త మార్పులు చోటు చేసుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో సాంకేతిక నిపుణుల ప్రాధాన్యమూ పెరిగింది. అందువల్ల ఈ నిపుణుల కొరతను భర్తీ చేయడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనపై గేట్‌లో నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్‌ను చేర్చారు.
‣ జియోమాటిక్స్ ఇంజినీరింగ్: ఇది సర్వేయింగ్‌లో ఒక భాగం. ముఖ్యంగా ఇది రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జీపీ‡ఎస్, ల్యాండ్ సర్వేయింగ్‌ల కోసం ఉపయోగపడుతుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ జియోమాటిక్స్ ఇంజినీరింగ్ ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సుగా ఉంది. ఇప్పుడు జియోమాటిక్స్ ఇంజినీరింగ్‌ను గేట్‌లో పేపర్‌గా చేర్చడం వల్ల దీనికి ప్రాధాన్యం పెరిగింది. ఇది సివిల్ ఇంజినీరింగ్‌కు సంబంధించినందున ఈ విభాగం విద్యార్థులకు ప్రయోజనకరం. గేట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రధాన పేపర్‌గా రాసేవారితో పోలిస్తే జియోమాటిక్స్ ఇంజినీరింగ్‌లో పోటీ తక్కువగా ఉండవచ్చు.
గేట్-2021 నుంచి ఈ పరీక్షను రెండు పేపర్లలో రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయనవసరం లేదు. విద్యార్థులు తమ ఇష్ట ప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు.
గేట్-2022 కోసం..

గేట్ పరీక్ష సాధారణంగా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. అంటే గేట్-2022 పరీక్షకు దాదాపుగా 8 నెలల సమయం ఉంది. అందుబాటులో ఉన్న ఈ సమయంలో తగిన ప్రణాళికతో అభ్యర్థులు సన్నద్ధత ప్రారంభించాలి.
‣ మొదటగా అభ్యర్థులు సొంత అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇది వారి సొంత అభిరుచికి తగినట్లు ఉంటుంది కాబట్టి మంచి మార్గాన్ని సూచిస్తుంది. అదే విధంగా గేట్‌లో ఉత్తమమైన ర్యాంకు/ మార్కులు సాధించడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువల్ల ఇతరుల ప్రణాళికను అనుకరించకపోవడం మంచిది.
‣ అభ్యర్థులు తమ స్థాయిని బట్టి సొంతంగా తయారవాలా, కోచింగ్ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ కోచింగ్ అవసరమైతే అందుబాటులో ఉన్న మౌఖిక తరగతులను గానీ ఆన్‌లైన్ తరగతులను గానీ ఎంచుకోవాలి.
‣ పరీక్ష సిలబస్‌ను వీలైనన్ని సార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌ని బట్టి ఏ అంశాల్లో బలంగా ఉన్నారో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో గ్రహించి దానికి అనుగుణంగా చదవటం ప్రారంభించాలి.
‣ గత సంవత్సరపు ప్రశ్నపత్రాల్లో ఒక ప్రశ్నపత్రానికి పరీక్షకు కేటాయించిన నిర్దిష్ట సమయంలోనే సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే అభ్యర్థులకు తాము ఏ స్థాయిలో ఉన్నారో అర్థం అవుతుంది.
‣ ఇప్పటి నుంచే రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటల సమయాన్ని ఈ పరీక్ష ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
‣ ఈ 8 నెలల సమయంలో పరీక్ష సిలబస్‌లోని సబ్జెక్టుల వెయిటేజి ఆధారంగా ఏ అంశాలు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకుని చదవాలి.
గేట్-2023 కోసం..
‣ సన్నద్ధత ఎంత త్వరగా మొదలుపెడితే అంత ఎక్కువగా విజయం సాధించే అవకాశాలుంటాయి.
‣ గేట్-2023 పరీక్షకు ఇప్పటి నుంచి దాదాపు 20 నెలల సుదీర్ఘ సమయం ఉంది. ఈ సమయం పరిపూర్ణంగా సరిపోతుంది.
‣ గేట్-2023 రాయదలిచిన అభ్యర్థులు సాధారణంగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరం చదువుతుంటారు. కాబట్టి ఈ పోటీ పరీక్షకు అనుగుణంగా తమ కళాశాల చదువును కొనసాగించాలి.
‣ అభ్యర్థులు ఈ 20 నెలల వ్యవధిని బట్టి అధ్యయన ప్రణాళిను సొంతంగా రూపొందించుకోవాలి.
‣ ఈ ప్రణాళికను రూపొందించేటప్పుడు కళాశాలలు నిర్వహించే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆ పరీక్షల సన్నద్ధతకు కూడా సమయం కేటాయించుకోవాలి.
‣ ఇప్పటినుంచే ప్రతిరోజూ కనీసం మూడు గంటల సమయాన్ని ఈ పరీక్ష కోసం కేటాయించాలి.
‣ ప్రణాళికాపరమైన సన్నద్ధతలో ఏమైనా అధ్యాయాలు మిగిలిపోతే వాటిని సెలవుల్లో ముందుగా పూర్తిచేసి పునశ్చరణ చేయాలి.
‣ అభ్యర్థులు కోచింగ్ తమకు అవసరమని భావిస్తే.. వీలును బట్టి అందుబాటులో ఉన్న మౌఖిక / ఆన్‌లైన్ తరగతులను ఎంచుకోవాలి.
‣ ఈ అభ్యర్థులు కళాశాలలు నిర్వహించే తరగతులకు తప్పనిసరిగా హాజరు కావలసినందున గేట్ సస్నద్ధతకు ఆన్‌లైన్ రికార్డెడ్ తరగతులు వీరికి చాలా ఉపయోగకరం. ముందుగా రికార్డు చేసిన తరగతులైతే అన్ని పాఠ్యాంశాలూ దాదాపు ఒకేసారి అందుబాటులో ఉంటాయి. అలాంటప్పడు మీకంటూ ఓ స్టడీ క్యాలెండర్‌ను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోజూ నిర్దేశించుకున్న అనుకూల సమయం ప్రకారం చదువుకోవచ్చు.
ఏ సంవత్సరం పరీక్ష రాసినా...
‣ గేట్-2022, గేట్-2023 పరీక్షల అభ్యర్థులు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు/స్టడీ మెటీరియల్‌ని ఎంచుకోవడం ప్రధానం.
‣ ముందుగా ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా చదివి సరైన అవగాహన వచ్చాక కఠినమైన అంశాలను చదవాలి.
‣ క్లిష్టమైన, సాధారణ, అతి సాధారణమైన అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
‣ ఏ రోజు చదివిన అంశాలను అదే రోజు పూర్తిచేయాలి.
‣ ఎన్‌టీపీఎల్ పాఠాలు ప్రాథమిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ ఉపయోగపడతాయి.
‣ క్రమంగా ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలపై చిన్నచిన్న పట్టికలను సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి.
‣ ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థలు అందించే ఆన్‌లైన్ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మాక్ టెస్టులు రాయాలి. దీనివల్ల తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
‣ గత గేట్, ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీని వల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందో తెలుస్తుంది.
‣ చాప్టర్ వారీ, మాక్ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాల సాధనలో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్నీ సవరించుకుని వాటిపై శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష సమయంలో ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా ఉంటాయి.
‣ చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ప్రిపరేషన్ సమయంలో తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలను పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.
న్యూమరికల్ ప్రశ్నలు: ఈ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే సమాధానంలో పక్కన యూనిట్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దగ్గర స్థాయిలో ఇవ్వవచ్చు. ఉదాహరణకు సరైన సమాధానం 90.64 అనుకుందాం. 90.63 నుంచి 90.65 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు. ఈ న్యూమరికల్ ప్రశ్నలకు ఆప్షన్‌లు ఉండవు. మౌస్, వర్చువల్ కీప్యాడ్ ఉపయోగించి సమాధానం రాయాలి.
బహుళ ఎంపిక ప్రశ్నలు: గేట్-2021 నుంచి బహుళ ఎంపిక ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నల్లానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటి కంటే ఎక్కువ సరైన ఆప్షన్‌లుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం రాయడానికి అన్ని సరైన ఆప్షన్‌లనూ గుర్తించాలి. ఉదాహరణకు ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లలో మూడు సరైనవైతే ఆ సరైన మూడు ఆప్షన్‌లూ గుర్తించాలి. ఒకవేళ ఒకటి లేదా రెండు సరైన ఆప్షన్‌లు గుర్తిస్తే ఎలాంటి మార్కులూ ఇవ్వరు.
నెగెటివ్ మార్కులు: గేట్‌లో ఒక తప్పు సమాధానానికి 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 చొప్పున మార్కులు తగ్గిస్తారు. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.
ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్ శిక్షణ

కరోనా పరిస్థితుల్లో గేట్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్ శిక్షణ తరగతులు బాసటగా ఉన్నాయి. ప్రభుత్వాల అనుమతి మేరకు మౌఖిక తరగతులకూ అవకాశం ఉంది. ఆన్‌లైన్ పద్ధతిలో- రికార్డెడ్, లైవ్ తరగతులుగా ఉంటున్నాయి.
1) ఆన్‌లైన్ రికార్డెడ్ తరగతులు: అధ్యాపకులు ముందుగా స్టూడియోలో పాఠాలను రికార్డు చేస్తారు. వీటిలో అత్యుత్తమ టెక్నాలజీ వాడే అవకాశం ఉంటుంది. గ్లాస్‌బోర్డు, డిజిటల్ స్మార్ట్ బోర్డు లాంటివి వాడతారు. చెప్పినవాటిని ఎడిట్ చేసి యాప్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అప్‌లోడ్ చేస్తారు.
2) ఆన్‌లైన్ లైవ్ తరగతులు: అధ్యాపకులు తమ ఇంటి నుంచో, విద్యా సంస్థ నుంచో పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు ఇంటి నుంచి ప్రత్యక్షంగా పాఠాలు వింటారు. ఇక్కడ సాధారణంగా అధ్యాపకులు వేకమ్ లేదా ట్యాబ్ లాంటి సాధనాలు వాడతారు.
ఆన్‌లైన్ తరగతుల సద్వినియోగానికి..
1. ల్యాప్‌టాప్/ ట్యాబ్/ స్మార్ట్‌ఫోన్: స్పెసిఫికేషన్స్‌ను అధ్యాపకులు ముందుగా తెలియజేస్తారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మొదలైనవాటికి¨, గ్రాఫిక్స్ ఎక్కువగా వాడితేనూ చాలా హయ్యర్ ఎండ్ కావలసి ఉంటుంది. మామూలు తరగతులకు సాధారణ పరికరాలు సరిపోతాయి.
2. ఎంత డేటా: ఇది అధ్యాపకులు వాడే టెక్నాలజీని బట్టీ, తరగతుల సమయం బట్టీ ఉంటుంది. స్మార్ట్‌బోర్డ్ వాడితే ఎక్కువ డేటా అవసరమవుతుంది.
3. ఏకాగ్రత కోల్పోకుండా: మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరానికి వాట్సాప్, మెయిల్స్, ఇతర మెసేజ్‌లు రాకుండా నిరోధించాలి. లేకపోతే అవి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠాలు వినేటప్పుడు స్నేహితులూ, బంధువులూ మన చుట్టుపక్కలకు రాకుండా చూసుకోవాలి. దగ్గరలో టీవీ లేకుండా చూసుకోవాలి. హెడ్‌ఫోన్స్‌ను వాడటం మంచిది.
4. ప్రత్యేకమైన స్టడీ స్పేస్: ఇంట్లో సరైన గాలీ, వెలుతురు ఉండే, ఏకాగ్రతకు భంగం కలగని స్థలాన్ని ఎంచుకోవాలి. సౌకర్యంగా ఉండే టేబుల్, కుర్చీలుండాలి. రైటింగ్ ప్యాడ్, కాలిక్యులేటర్, నోట్‌బుక్‌లు, పెన్సిళ్లు, పెన్నులు, హైలైటర్, తెల్లకాగితాలను ఉంచుకోవాలి.
5. సందేహ నివృత్తి: లైవ్ చాట్‌బాక్స్ ద్వారా సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. ఈమెయిల్, వాట్సాప్‌ల ద్వారానూ సందేహ నివృత్తి సాధ్యమే.