‣ ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులో మొదటి స్థానం
మనదేశంలో అత్యంత ఆదరణ పొందుతోన్న కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యే ముందు వరుసలో ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలోనూ ఈ విద్యపై మక్కువ ఎక్కువ. ఐఐటీ-జేఈఈ, ఎంసెట్, ఈఏపీసెట్ కోసం పోటీ పడుతోన్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా ఇంజినీరింగ్ కళాశాలలు వివిధ బ్రాంచీల్లో కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో మేటి సంస్థల సమాచారం విద్యార్థుల ముందు ఉంచడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఏటా ర్యాంకులు ప్రకటిస్తోంది. ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది కూడా ఐఐటీ మద్రాసే మొదటి స్థానంలో నిలిచింది!
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో ఇంజినీరింగ్ విభాగంలో 2016 నుంచి 2022 వరకు ఏటా ఐఐటీ మద్రాసే మేటి సంస్థగా నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఓవరాల్ కేటగిరీ, ఇంజినీరింగ్ ఇలా రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానాన్ని పొందిన ఏకైక సంస్థగా ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్ అనగానే గుర్తుకువచ్చేవి ఐఐటీలే. మన దేశంలో ఈ చదువులకు ఇవే ట్రేడ్ మార్కు సంస్థలు. వీటి తర్వాతి స్థానంలో పాత ఎన్‌ఐటీలకు ప్రాధాన్యం ఉంది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చోటు పొందుతున్నాయి. మొదటి స్థానానికి పోటీ ఎప్పుడూ ఐఐటీల మధ్యే ఉంటోంది. అయినప్పటికీ ఏటా ఐఐటీ మద్రాసే మెరుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ-ఎంలో ఉన్న వివిధ ఇంజినీరింగ్ కోర్సుల వివరాలు చూద్దాం...
బీటెక్: ఏరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ బ్రాంచీల్లో నాలుగేళ్ల కోర్సులు ఉన్నాయి. ఏరోస్పేస్, బయలాజికల్, ఇంజినీరింగ్ డిజైన్ విభాగాల్లో ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్ టెక్నాలజీ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. సీట్లు ఐఐటీ-జేఈఈతో భర్తీ చేస్తారు.
ఎంటెక్: ఈ సంస్థలో ఎంటెక్‌లో బ్రాంచీలవారీ విస్తృత స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం గేట్‌లో చూపిన ప్రతిభతో లభిస్తుంది.
ర్యాంకుల కేటాయింపు: బోధన, అభ్యాసం, వనరులు; పరిశోధన, వృత్తి అభ్యాసం; సంస్థలో చదివిన విద్యార్థుల ప్రతిభ, సంస్థలో చేరుతోన్న విద్యార్థుల్లో వైవిధ్యం, అకడమిక్, పరిశ్రమలకు చెందిన నిపుణుల దృక్పథం పరామితులుగా తీసుకుని వీటి విలువలను మదింపు చేసి మొత్తం స్కోరు ద్వారా మేటి సంస్థలను ఎంపిక చేశారు. ఇంజినీరింగ్ విషయానికొచ్చేసరికి విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో లభించిన ఉన్నత విద్య అవకాశాలు, ప్లేస్‌మెంట్లు, మధ్యగత జీతం, విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఫలితాలు, పీహెచ్‌డీలో చేరడానికి అర్హత పొందినవారు...తదితరాంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు.
టాప్ టెన్ సంస్థలు
1. ఐఐటీ - మద్రాస్
2. ఐఐటీ - దిల్లీ
3. ఐఐటీ - ముంబై
4. ఐఐటీ - కాన్పూర్
5. ఐఐటీ - ఖరగ్‌పూర్
6. ఐఐటీ - రవుర్కెలా
7. ఐఐటీ - గువాహటి
8. ఎన్‌ఐటీ - తిరుచురాపల్లి
9. ఐఐటీ - హైదరాబాద్
10. ఎన్‌ఐటీ - సూరత్కల్
తెలుగు రాష్ట్రాల్లో
ఐఐటీ హైదరాబాద్ 9, ఎన్‌ఐటీ వరంగల్ 21, కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం 44, ఐఐటీ తిరుపతి 56, ఐఐఐటీ హైదరాబాద్ 62, జేఎన్‌టీయూ హైదరాబాద్ 76, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 77, ఎస్‌ఆర్ వరంగల్ 91, విజ్ఞాన్ గుంటూరు 99, గీతం విశాఖపట్నం 102, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి 113, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 117, జేఎన్‌టీయూ కాకినాడ 129, అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ 140, వీఆర్ సిద్ధార్థ విజయవాడ 141, గోకరాజు రంగరాజు హైదరాబాద్ 148, మహింద్రా యూనివర్సిటీ హైదరాబాద్ 154, వర్థమాన్ హైదరాబాద్ 162, శ్రీవిద్యానికేతన్ తిరుపతి 165, సీబీఐటీ హైదరాబాద్ 166, సీవీఆర్ హైదరాబాద్ 170, జీఎంఆర్ రాజాం 188, శ్రీవెంకటేశ్వర కాలేజ్ చిత్తూరు 198, విద్యాజ్యోతి హైదరాబాద్ 200 స్థానాల్లో నిలిచాయి.
201-250 బ్యాండ్‌లో
బీవీఆర్‌ఐటీ హైదరాబాద్, సీఎంఆర్ సంస్థలు హైదరాబాద్, గోదావరి రాజమండ్రి, ఏరోనాటికల్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్, జేఎన్‌టీయూ అనంతపురం, కాకతీయ వరంగల్, మల్లారెడ్డి హైదరాబాద్, పీవీ సిద్ధార్థ విజయవాడ, ఆర్‌వీఆర్ అండ్ జేసీ గుంటూరు, రాజీవ్ గాంధీ నంద్యాల, శ్రీవిష్ణు భీమవరం, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ కాకినాడ, విజ్ఞాన్ భువనగిరి మెరిశాయి.
251-300 బ్యాండ్‌లో
అనిల్ నీరుకొండ విశాఖపట్నం, సీఎంఆర్ రంగారెడ్డి, నారాయణమ్మ హైదరాబాద్, పుల్లారెడ్డి కర్నూలు, గాయత్రి విద్యాపరిషత్ విశాఖపట్నం, లక్కిరెడ్డి బాలిరెడ్డి మైలవరం, మదనపల్లె టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, ఎంజీఐటీ హైదరాబాద్, మల్లారెడ్డి అటానమస్ సికింద్రాబాద్, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్, నిట్ తాడేపల్లిగూడెం, క్యూఐఎస్ ఒంగోలు, ఎస్‌ఆర్‌కేరాజు భీమవరం, సిద్ధార్థ హైదరాబాద్, ఎస్‌వీ యూనివర్సిటీ తిరుపతి, వాసవి హైదరాబాద్ నిలిచాయి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు