• facebook
  • whatsapp
  • telegram

మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు

మెరుగైన సమాజం దిశగా మానవాళి సాగించే పయనంలో మీడియా పాత్ర ఎంతో కీలకం. ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే ఈ బాధ్యతాయుతమైన వృత్తిలో సామాజిక స్పృహ కలిగిన యువత చక్కగా రాణించే వీలుంది. ఈ ఆసక్తి ఉన్న విద్యార్థులకు అన్నివిధాలా తర్ఫీదునిచ్చేందుకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రవేశాలు జరుగుతున్నందున, ఇంటర్‌ తర్వాత డిగ్రీ, డిప్లొమాగా చేసే బీఎంఎం ( బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా) కోర్సు పూర్తి వివరాలు, ఉద్యోగావకాశాల గురించి సమాచారం మీకోసం...

మాస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో రాణించేందుకు బీఎంఎం కోర్సు తొలిమెట్టు. ఇందులో జర్నలిజం, అడ్వర్టైజింగ్, పబ్లిక్‌ రిలేషన్స్‌ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సులో భాగంగా మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రాథమిక అంశాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, సోషియాలజీ ప్రాథమిక అంశాలు, మేనేజ్‌మెంట్‌ - మార్కెటింగ్‌లో ప్రధానాంశాలు, సృజనాత్మకంగా రాయడం, అనువాదం, పబ్లిక్‌ రిలేషన్స్, ప్రెస్‌ లా అండ్‌ ఎథిక్స్, కంప్యూటర్‌ బేసిక్స్, దేశంలో వివిధ రకాల మీడియా, సినిమా గురించి ప్రాథమికంగా నేర్చుకుంటారు.

దీని ద్వారా ప్రింట్‌ మీడియా, టెలివిజన్, డిజిటల్‌ మీడియా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్, మల్టీ   మీడియా, అడ్వర్టైజింగ్, ఇతర విభాగాల్లో ప్రవేశించవచ్చు. ఎడిటర్, కాలమిస్ట్, జర్నలిస్ట్, పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్, కమ్యూనికేషన్స్‌ మేనేజర్, న్యూస్‌ యాంకర్, ప్రూఫ్‌ రీడర్, కంటెంట్‌ రైటర్‌ లాంటి పోస్టుల్లో కొలువుదీరవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, అనురాగ్‌ యూనివర్సిటీ, మహీంద్రా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, లయోలా కాలేజ్, ఇతర కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దేశంలో ముంబై యూనివర్సిటీ, సావిత్రిబాయ్‌ పూలే యూనివర్సిటీ (పూణె), అమిటీ స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (నోయిడా), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (నోయిడా), చిత్కార యూనివర్సిటీ (పటియాలా) వంటి విద్యాసంస్థల్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్‌ ఉంది. చాలా కళాశాలల్లో ఇంటర్న్‌షిప్‌తోపాటు ప్లేస్‌మెంట్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివినవారైనా బీఎంఎంలో చేరే వీలుంది. కొన్ని కాలేజీల్లో నేరుగా ప్లస్‌టూ అర్హతతో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరికొన్నింటికి మాత్రం ప్రవేశపరీక్ష రాయాలి. ఎంచుకున్న కాలేజీని బట్టి ఫీజు ఉంటుంది. సగటున ఏడాదికి రూ.25వేల నుంచి రూ.లక్షన్నర వరకూ ఉంటుంది. 

కొత్తగా ఆలోచించడం, లోతుగా అధ్యయనం చేయడం, బాగా మాట్లాడే నైపుణ్యం, ఒక అంశాన్ని అన్నికోణాల్లోనూ విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించడం, పరిచయాలు పెంచుకునే నేర్పు, నిబద్ధత ఉన్న వారికి ఇది సరైన రంగం. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వార్తా సంస్థలు, వినోద చానెళ్లు, న్యూస్‌ వెబ్‌సైట్‌లు, పలు ఇతర సంస్థల్లో అవకాశాలుంటాయి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పైతాన్‌తో కెరియర్‌ పరుగులు!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

Posted Date: 09-08-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌