• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

నైపుణ్యాల మెరుగుకు మంచి అవకాశం

ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ప్లాట్‌ఫాం ‘ఇంటర్న్‌శాల’లో ఆరేళ్లక్రితం ఒక ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 వేలు. ఏడాది క్రితం ఆ సంఖ్య... 35 లక్షలు! గతంలో ప్రత్యేకంగా కొన్నిరకాలైన కోర్సులు చదివేవారు మాత్రమే ఇంటర్న్‌షిప్‌లు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, ఫార్మసీˆ, ఆర్కిటెక్చర్, లా... ఇలా ఏ స్ట్రీమ్‌ విద్యార్థులైనా ఎంతోకొంత కాలం ఇంటర్న్‌లుగా పనిచేసి అనుభవం సంపాదించాలని భావిస్తున్నారు. మరి ఈ సమయంలో పూర్తిస్థాయిలో నైపుణ్యాలకు మెరుగులద్దుకుని పరిశ్రమకు సిద్ధం కావాలంటే... ఇంటర్న్‌లుగా ఏ అంశాలపై దృష్టి పెట్టాలో చూద్దామా!

కొత్తగా కెరియర్‌లోకి అడుగుపెట్టేవారికి ఇంటర్న్‌షిప్‌ ఒక శిక్షణ లాంటిది. అప్పటివరకూ విద్యార్థి జీవితంలో ఉన్న వారికి... వృత్తిలోకి వెళ్లాక ఎలా మసులుకోవాలి, సంస్థలో ఎలా ఒదిగిపోవాలనే విషయాలను అనుభవపూర్వకంగా చెప్పే ఇంటర్న్‌షిప్‌లు మామూలు అభ్యర్థులను బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా మలచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే వాటిలో చేరేటప్పుడే ఏయే అంశాలు నేర్చుకోవాలనే దానిపై అభ్యర్థికి అవగాహన ఉండాలి.

పరిచయాలు

ఇంటర్న్‌గా వెళ్లిన సంస్థలో వీలైనంత మంది ఉద్యోగులను పరిచయం చేసుకోవాలి. వారి పనేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందులో మీకేదైనా ఉపయోగపడుతుందా, ఆసక్తిగా అనిపిస్తుందా అన్నది గమనించాలి. ఆ కంపెనీలో పూర్తికాలం పనిచేయకపోయినా వారి నుంచి వచ్చే సిఫార్సు మీ కెరియర్‌కు ఉపయోగపడుతుంది. చక్కటి పరిచయాలు ఉండటం వల్ల అందరికీ మీపైన సదభిప్రాయం ఏర్పడటమే కాకుండా, మెరుగైన రికమెండేషన్‌ లభిస్తుంది. 

లక్ష్యసాధన

ఇంటర్న్‌షిప్‌ మొదలుకాగానే తొలుత మీ పై  అధికారితో మాట్లాడి సంస్థ మీనుంచి ఏం ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారి అంచనాలు అందుకునేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అలాగే మీరు సరైన దారిలో వెళ్తున్నారో లేదో తెలుసుకునేలా ఎప్పటికప్పుడు వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేనాటికి మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఒక జాబితా రాసుకుని ఆ ప్రకారం లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.

పరిశీలన

కొత్తగా ఒకచోట పని మొదలుపెట్టినప్పుడు సంస్థలో వాతావరణం ఎలా ఉంటుందో, ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో పరిశీలించడం అవసరం. దాన్నుంచి మీరేం నేర్చుకోగలరో గమనించాలి. అవసరమైనప్పుడు సహోద్యోగుల సలహాలు, సాయం తీసుకోవాలి. సంస్థ పాలసీలు, విధివిధానాల గురించి చదివి అవగాహన పెంచుకోవాలి. ప్రవేశానికి అనుమతి ఉంటే సమావేశాలకు హాజరుకావడం, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం లాంటివి చేయాలి.

ప్రవర్తన

పనిచేసే చోట అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. వస్త్రధారణ కూడా చేసే పనికి తగ్గట్టుగా ఉండాలి. మర్యాదగా వ్యవహరించడం, సౌమ్యంగా మాట్లాడటం, డాక్యుమెంటేషన్‌ చేయడం వంటివి తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆఫీసు వాతావరణంలో పూర్తిగా ఇమిడిపోతున్నామో లేదో తెలుసుకుని దానికి తగిన విధంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. 

నిగమ్నం కావడం..

కొత్తగా వచ్చాం, ఇక్కడే ఉండిపోం కదా... అనేధోరణిలో ఆలోచించడం వల్ల కొందరు అంతగా పనిలో నిమగ్నం కాలేరు. కానీ అది సరికాదు. పని నేర్చుకోవడంలో నిర్లిప్తత కూడదు. నేరుగా మీకు టాస్క్‌లు ఇవ్వకపోతే ఇతరులకు సాయం చేయొచ్చేమో అడిగి తెలుసుకోవాలి. అలాగే ఏవైనా కొత్త ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించాలి. ఉత్సాహం చూపడం ద్వారా పని నేర్చుకోవడం మాత్రమే కాదు, కంపెనీలో పూర్తిస్థాయి ఉద్యోగం పొందే అవకాశం కూడా లభించవచ్చు!

పద్ధతి

ఏ సమావేశాలకు హాజరైనా, ఏ కొత్త విషయం తెలుసుకున్నా ఒకచోట రాసుకోవాలి. ఆర్గనైజ్డ్‌గా ఉండటం ఒక అలవాటులా సాధన చేయాలి. పనిచేసే చోటు శుభ్రంగా, పద్ధతిగా ఉండేలా చూసుకోవాలి.

సమయపాలన 

ఇచ్చిన పని గడువులోగా పూర్తిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అలాగే ఆ టాస్క్‌ పూర్తికాగానే వెంటనే వేరేది అడిగి తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పనులు వచ్చినట్లయితే సమయాన్ని ఎలా విభజించుకోవాలో పైఅధికారులను అడిగి తెలుసుకోవాలి. ఉద్యోగ జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ప్రధానమైన అంశం. అది ఇంటర్న్‌గా ఉన్నప్పటి నుంచే సాధన చేయాలి.

విజయాలు

ఈ ఇంటర్న్‌షిప్‌ కాలంలో మీరు పూర్తిచేసిన పనులను, సాధించిన విజయాలను జాబితాగా రాసుకోండి. మిమ్మల్ని మీరు అంచనా వేసుకునేందుకు అది ఉపయోగపడుతుంది. అలాగే రెజ్యూమెలో ఈ విజయాల గురించి రాయవచ్చు. వేరేచోట ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు చెప్పడానికీ ఈ విషయాలు పనికొస్తాయి. అదే సమయంలో కొన్ని వివరాలు తీసుకునేటప్పుడు, బయటకు చెప్పేటప్పుడు సంస్థ గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తపడాలి. సంస్థ, పని... నచ్చినా, నచ్చకపోయినా అనుభవం మాత్రం ఎంతో విలువైనది. అందువల్ల వృత్తిపరమైన జీవితంలోకి అడుగుపెట్టే సమయంలో ఇంటర్న్‌షిప్‌ నుంచి మీరు ఎంతవరకూ నేర్చుకోగలుగుతారో అంతా ప్రయత్నించాలి.

వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌లో...

గత రెండేళ్లుగా మారిన పరిణామాలతో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ చేసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దానికి తగినట్టే అవకాశాలూ లభిస్తున్నాయి. ఇలా ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలో కమ్యూనికేషన్‌ కొంచెం కష్టంతో కూడుకున్న పని. అసలే కొత్త... అందులోనూ నేరుగా అందుబాటులోని లేని సమయంలో ప్రతిదీ ఫోన్, ఇతర మాధ్యమాల ద్వారా అడిగి తెలుసుకోవాలి దీంతో కాస్త మొహమాటం, తెలియని భయం ఉండటం సహజం. అయితే దాన్ని వీలైనంత త్వరగా అధిగమించి పనిలో నిమగ్నం కావాలి. ఏ సందేహాలు ఉన్నా పైఅధికారులను పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. చక్కగా నేర్చుకున్నప్పుడే ఇంటర్న్‌షిప్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించుకున్న వారమవుతామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

Posted Date : 09-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌