• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

ఉదయం లేచిన వెంటనే ఇంట్లోపనులు చేసుకున్నంత సహజంగా.. ఆఫీసు, చదువు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, నగదు లావాదేవీలు.. ఇతర ముఖ్య కార్యకలాపాలన్నీ చరవాణులోనే చక్కబెట్టుకుంటున్న డిజిటల్‌ కాలమిది. ఇవన్నీ సజావుగా సాగేందుకు సంబంధిత మొబైల్‌ ఆప్లికేషన్లు(యాప్‌) ఫోన్‌లో ఉండటం ఆవశ్యకం. వీటిని రూపొందించే ‘మొబైల్‌ యాప్‌ డెవలపర్‌’లకు ఎంతో గిరాకీ! యాప్‌లను ఎలా రూపొందిస్తారు, అందులోని కెరియర్‌ అవకాశాలేమిటో చూద్దాం..

వేళ్ల మీద షాపింగ్‌లు చేస్తున్నాం, చిటికెలో లావాదేవీలు జరిపేస్తున్నాం, కోరుకున్నప్పుడల్లా తరగతులు వింటున్నాం. ఈ.మెయిళ్లు, సందేశాలు.. ఉద్దేశమేదైనా, కూర్చున్నచోటే అన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతున్నామంటే... అందుకు ఫోన్‌లోని యాప్‌లే కారణం. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సేవల్ని అందించేవి చలామణి అవుతున్నాయి. అటువంటి యాప్‌లను రూపొందించే యాప్‌ డెవలపర్‌లకు ఆన్‌లైన్‌ మార్కెట్లో గణనీయమైన డిమాండ్‌ ఉంది. సృజనాత్మకతతోపాటు, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలు, సాంకేతిక నైపుణ్యాల మీద మంచి పట్టుఉన్నవారు ఈ రంగంలో చక్కగా రాణించగలరు. 

ప్లేస్టోర్‌ తెరవగానే మనకు లక్షల యాప్‌లు తారసపడుతుంటాయి. కానీ అందులో పనికొచ్చేవి కొన్నే ఉంటాయి. త్వరగా లోడ్‌ అవ్వడం, త్వరితగతిన ఆప్షన్లలోకి వెళ్లడం, యాప్‌ను ఎలా వాడాలో, ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకునేందుకు సహాయం/ టిప్స్‌ అందివ్వడం, యాక్టివిటీ/ నోటిఫికేషన్ల విషయంలో యాప్‌ వినియోగం అత్యంత సులువుగా జరిగిపోవాలి. యాప్‌ను వాడిన ప్రతిసారీ మెరుగైన ఫలితాల్ని చవిచూసినప్పుడే అది విజయవంతం అయినట్లు లెక్క! అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, అన్ని అవసరాల్నీ తీర్చగలిగేవే ఎక్కువ వినియోగంలో ఉంటాయి. ఆ విధంగా యూజర్ల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సేవలను నిరంతరాయంగా అందించేందుకు తోడ్పడేవారే యాప్‌ డెవలపర్లు. 

యాప్‌లను రూపొందించాలంటే టెక్నికల్‌ పరిజ్ఞానంతోపాటు సృజనాత్మకత, అమితాసక్తి ఉండాలి. మన దేశంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, స్నాప్‌డీల్, పేటీఎంలు లక్షల కొద్దీ వినియోగదారులను సొంతం చేసుకున్నాయంటే కారణం.. అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వడంతో పాటు, కావాల్సిన వస్తువినిమయ సేవల్ని ఆకర్షణీయంగా, వినూత్నంగా అందించటమే! ఇందుకు ఎంతో ప్రావీణ్యం, అనుభవమున్న యాప్‌ డెవలపర్లు కావాల్సివస్తుంది. యాప్‌ స్టోర్‌/ ప్లేస్టోర్‌/ మార్కెట్‌ప్లేస్‌... మొదలైనవి వేదికగా చేసుకుని వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి ప్రముఖ వ్యాపారసంస్థలు.

ఏమేం ఉండాలి?

మొబైల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డిజైన్‌.. యాప్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌కూ, వినియోగదారునికీ మధ్య సంధానకర్తగా ఉంటుంది. ఇది వినియోగదారుల అవసరాల్ని లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా ఇష్టపడే/కోరుకునే అంశాలపై దృష్టిసారిస్తుంది. సాంకేతిక నైపుణ్యాలతోపాటు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ (జావా, సీ, సీప్లస్‌ ప్లస్‌)లపై పూర్తి పట్టు ఉండాలి. వెబ్‌ డెవలప్‌మెంట్‌ లాంగ్వేజీలైన హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లపై ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. ఆండ్రాయిడ్‌ వర్షన్‌లోని ఏపీఐ (అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌)ను సరిగా ఉపయోగించగలగాలి. బ్యాక్‌ఎండ్‌ టెక్నాలజీ తెలిసుండాలి. సొంతంగా యాప్‌ డెవలప్‌ చేయాలనుకునేవారికి టెక్నికల్‌ నైపుణ్యాలతోపాటు నాన్‌ టెక్నికల్‌ నైపుణ్యాలైన... కమ్యూనికేషన్‌ స్కిల్స్, బిజినెస్‌ స్కిల్స్, రైటింగ్, నెట్‌వర్కింగ్‌ నైపుణ్యాలలో ప్రావీణ్యం తప్పనిసరి. మొత్తానికి యాప్‌ డెవలపర్‌లుగా రాణించడానికి చదువు, అనుభవం ప్రామాణికం కాకున్నా, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలలో ప్రవేశం ఉండాలి. 

మొబైల్‌ను ఉపయోగించేవారిని బట్టే మొబైల్‌ అప్లికేషన్లను తీర్చిదిద్దే నిపుణుల అవసరం ఆధారపడి ఉంటుంది. ఆసక్తి, అభిరుచిని బట్టి విభిన్న రంగాల్లో వీరు పనిచేయొచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ ఇన్, పింటరెస్ట్, ట్విటర్‌ లాంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలను అనుసరించి సరికొత్త యాప్‌లను రూపొందించవచ్చు. వీరికి ఈ-కామర్స్‌లోనూ మంచి అవకాశాలున్నాయి. పూర్తిగా రూపొందని స్టార్టప్‌లు/ ఇదివరకే కొనసాగుతున్న స్టార్టప్‌లలో ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్‌ చేయడంతోపాటు సాంకేతికంగా ఏర్పడే అంతరాయాల్ని తొలగించడంలో వీరి పాత్రే కీలకం. 

ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే చాలా నష్టపోతాం. సులువుగా లావాదేవీలు జరపడమేకాక, పూర్తి సురక్షత హామీని ఇస్తూ, మిగతా టాస్క్‌లన్నింటినీ తీర్చిదిద్దాల్సిన బాధ్యత వీరిదే. పేటీఎం, పేపాల్, ఇతర బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ అప్లికేషన్లలోనూ వీరికి అవకాశాలు మెండు.

గేమింగ్‌ యాప్‌లు

మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్లు ఎక్కువశాతం గేమింగ్‌ యాప్‌లను రూపొందించడానికే ఇష్టపడుతుంటారు. ఇందుకు ఎంతో ఆసక్తి, సృజనాత్మకత, ఓపిక కావాలి. యాప్‌ సిద్ధమయ్యాక ఎవరికైనా చూడటానికి చాలా సులువు అనిపిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఉన్న వాటిల్లోకెల్లా భిన్నంగా కొత్తదనంతో యూజర్లను అలరించడం అంత సులభమేమీ కాదు. 

అవకాశాలు బోలెడు

యాప్‌ డెవలపర్‌లుగా కొన్ని సంస్థలకే పనిచేయాలని ఏంలేదు, నచ్చితే ఫ్రీలాన్సర్‌గానూ చేయొచ్చు. స్వీయ ఆలోచనల్ని నేరుగా యూజర్ల ముందుకు తీసుకురావచ్చు. విద్యాసంబంధమైన యాప్‌లు అనేవి ఎల్లప్పుడూ వినియోగంలో ఉంటాయి. విద్యార్థులకు వారు నేర్చుకున్న/ నేర్చుకోవాల్సిన విషయాలపట్ల ఎన్నో సందేహాలు, ప్రశ్నలు వస్తుంటాయి. వీటిని తీర్చగలిగేవే ఎక్కువకాలం మార్కెట్లో ఉంటాయి. పైగా ఈ యాప్‌లకు డిమాండ్‌ అధికం. ఐటీరంగంలోనే కాక షాపింగ్‌ సైట్లు, గేమింగ్‌ పరిశ్రమలో యాప్‌ డెవలపర్లకు అంతులేని అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుకునేందుకు నైపుణ్యాలు, పని అనుభవాలే సోపానాలవుతాయి. 

మొబైల్‌ యాప్‌ డెవలపర్‌లకు ప్రత్యామ్నాయ కెరియర్‌- మొబైల్‌ వెబ్‌ డెవలపర్‌. వీరు మొబైల్‌లో యాప్‌కు బదులుగా వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేస్తారు. ఈ రెండేకాక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ లీడర్, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్, హైబ్రిడ్‌ డెవలపర్‌లుగా చేయొచ్చు. ఏడాదికి సుమారుగా ప్రారంభంలో రూ. 5 లక్షల వరకు వేతనం అందుకునే అవకాశముంది.

కనీస విద్యార్హతలు

50 శాతం మార్కులతో ఇంటర్‌ పాసై, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివుంటేనే మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌లో డిప్లొమా పూర్తిచేయగలరు. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేయాలనుకున్నవారు సంబంధిత బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. బ్యాచిలర్‌ స్థాయిలోని అన్ని మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకోసం ప్లస్‌టూలో పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌)ను 60 శాతం ఉత్తీర్ణతతో చదివుండాలి. ఎంటెక్‌ (సీఎస్‌ఈ)/ఎంఈ లేదా ఎంఈ/ ఎంటెక్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ను చేయాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బీఈ/ బీటెక్‌ ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది.

అందుబాటులో కోర్సులు

బీఎస్సీ ఇన్‌ మొబైల్‌ డెవలప్‌మెంట్‌/ కంప్యూటర్‌ సైన్స్, డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్, బీటెక్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఎంటెక్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, బీవోక్‌ ఇన్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ మొబైల్‌ అప్లికేషన్స్‌/ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మాస్టర్స్‌ ఆఫ్‌ ఒకేషన్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.. ఇవి ఆఫ్‌లైన్‌ కోర్సులు, కోర్సెరా, యుడెమి లాంటి ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫాంలలో 6 నెలల నుంచి ఏడాది కాలవ్యవధితో సర్టిఫికెట్‌/ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Posted Date : 05-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌