• facebook
  • whatsapp
  • telegram

పొరుగుతో శాంతి నెలకొంటుందా?

ఉపఖండంలో తొలగని ఉద్రిక్తత

కొన్ని అంశాలు కష్టమే కాదు, అసాధ్యం కూడా! దాయాది దేశం పాకిస్థాన్‌తో సఖ్యత, స్నేహం విషయంలో భారత్‌ ఈ పరిస్థితినే ఎదుర్కొంటోంది. అలాగని సంబంధాల్ని పూర్తిగా తెంచుకుందామా అంటే, అది మరిన్ని కొత్త సమస్యలకు దారి తీస్తుంది. మనం దూరంపెట్టే కొద్దీ చైనాకు పాక్‌ దగ్గరవుతోంది. మొత్తంగా భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు మునుపెన్నడూ లేనంత అధ్వాన స్థితికి చేరుకొన్నాయి. రెండు దేశాలు తమ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్న ఈ సమయంలో ఇటీవల వాఘాకి ఇరువైపులా కొన్ని సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దులు దాటి ప్రజలు దగ్గరవుతున్నారు.

ప్రజల మధ్య అనుబంధం 

దేశ విభజన సమయంలో రీనావర్మ కుటుంబం పాకిస్థాన్‌లోని రావల్పిండిని వదిలి భారత్‌కు వచ్చింది. విశ్రాంత ఉపాధ్యాయురాలైన రీనా ప్రస్తుతం పుణెలో ఉంటున్నారు. 15 ఏళ్ల వయసులో రావల్పిండిలో తాను వదిలి వచ్చేసిన ఇంటిని చూడాలన్నది ఆమె చిరకాల కోరిక. చివరకు 75 ఏళ్ల తరవాత ఆమె వాఘా సరిహద్దు దాటి జులై 20న రావల్పిండి ‘ప్రేమ్‌ గల్లీ’లోని ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ వీధికి రీనా తండ్రి పేరే పెట్టారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న కుటుంబం, స్థానికులు రీనాకు ఘనస్వాగతం పలికారు. ఆ ఇంట్లో నివసిస్తున్న హుస్సేన్‌ కుటుంబం లూధియానా నుంచి అక్కడకు వలస వెళ్ళడం మరో ఆసక్తికరమైన విషయం. ‘ఇన్నాళ్లకు సొంత గూటికి చేరుకున్నా’ అంటూ భావోద్వేగంగా మాట్లాడిన రీనా- ఆ ఇంటిని, పరిసరాలను తనివితీరా చూసుకున్నారు. కొవిడ్‌ సమయంలో ఆమె తన జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. సజ్జద్‌ భాయ్‌ అనే రావల్పిండి వాసి ఆమెకు ఆ ఇంటి ఫొటోలు, ఆ వీధి వీడియోలు పంపారు. ఎంతో ఆనందించిన ఆమె నేరుగా అక్కడికే వెళ్ళి చూడాలనుకున్నారు. తన చిరకాల వాంఛను వివరిస్తూ రీనా తీసిన వీడియోను పాక్‌ మంత్రి హీనా రబ్బానీ చూశారు. వీసా విషయంలో ఆమెకు సాయపడ్డారు. దేశ విభజన సమయంలో ఎక్కువగా సిక్కుల్లోనే సంబంధాలు తెగిపోయాయి. పంజాబ్‌ రాష్ట్రం నిట్టనిలువునా ముక్కలైంది. ఆ పేరుతో రెండు దేశాల్లోనూ రాష్ట్రాలున్నాయి. కర్తార్‌పుర్‌ కారిడార్‌ వచ్చాక ఎందరో సిక్కులు రెండు దేశాల సరిహద్దులకు ఆవల ఉన్న తమ తోబుట్టువులను, రక్త సంబంధీకులను కలుసుకుంటున్నారు. వారికి పాకిస్థాన్‌కు చెందిన ‘పంజాబీ లెహర్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు నాసిర్‌ ధిల్లాన్‌ సాయపడుతున్నారు. నాలుగేళ్లలో నాసిర్‌ 200 కుటుంబాల్ని కలిపారు. ఈ ఛానెల్‌కు ఆరు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నాయి. నాసిర్‌ పూర్వీకులది భారత్‌లోని పంజాబ్‌ ప్రాంతం. పూర్వీకుల గ్రామం సందర్శించాలన్న తన తాత, తండ్రి కోరిక నెరవేరలేదు. అప్పుడే ప్రజల్ని కలిపేందుకు ఏదైనా చేయాలని వారు సలహా ఇచ్చారట. ఫేస్‌బుక్‌లో ఇమ్రాన్‌ విలియమ్‌ నిర్వహిస్తున్న ‘ఇండియా-పాకిస్థాన్‌ హెరిటేజ్‌ క్లబ్‌’ సరిహద్దులకు ఇరువైపులా ప్రజలు తమ చరిత్ర, సంప్రదాయాలను గుర్తుచేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ గ్రూప్‌లో 76వేల మంది ఉన్నారు. పాక్‌కు చెందిన అప్షీన్‌ గుల్‌ అనే అమ్మాయి మెడ వంకర తిరిగి ఇబ్బంది పడుతున్న విషయాన్ని పాక్‌ నటుడు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దిల్లీకి చెందిన వైద్యుడు రాజగోపాలన్‌ మానవతా దృక్పథంతో స్పందించి ఆమెకు ఇండియాలో ఉచిత శస్త్ర చికిత్స చేశారు. ప్రభుత్వాలకు ఆవల ప్రజల మధ్య అనుబంధాలు ఏర్పడుతున్నాయని అనడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో కనిపిస్తాయి.

దూరాన్ని దగ్గర చేసేలా... 

పొరుగున శ్రీలంక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇండియా పెద్ద మనసుతో సాయం అందించింది. భారత్‌ ఓ పెద్దన్నలా ఆదుకొందని అక్కడి మేధావులు, సామాన్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ విధానంలో భాగంగానే ఇండియా సాయం అందించి ఉండవచ్చు. కానీ, పొరుగున శాంతి, సుస్థిరత ఉంటే భారత్‌కూ మేలే! ఆ సాయం వల్ల ప్రభుత్వాన్ని దాటి శ్రీలంక ప్రజలతో భారత్‌కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలాంటి అనుబంధం దక్షిణాసియాలో మరికొన్ని దేశాలతోనూ భారత్‌కు ఉంది, ఒక్క పాక్‌తో తప్ప. నిజానికి ఇండియాకు దాయాది దేశం కన్నా చైనా నుంచే అధికంగా ముప్పు ఉంది. అయినా, డ్రాగన్‌ దేశంతో వాణిజ్య, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ‘క్వాడ్‌’ వంటి కూటమిలో భాగమవుతూనే బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో భారత్‌ కొనసాగుతోంది. చివరికి అఫ్గాన్‌లో తాలిబన్లతోనూ సంబంధాలు నెరపక తప్పడంలేదు. ఇవి 21వ శతాబ్దపు అవసరాలు కావచ్చు. 2016 ఉరీ ఉగ్ర దాడుల తరవాత సార్క్‌ సమావేశాలకు భారత్‌ దూరంగా ఉంది. దానివల్ల ఇండియా-పాక్‌లు చర్చించే వేదికే లేకుండా పోయింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సార్క్‌ దేశాధినేతలను ఆహ్వానించి సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ‘స్నేహితులను మార్చుకోగలం కానీ ఇరుగు పొరుగును మార్చలేము’ అన్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. విశ్వశాంతిని కాంక్షించే దేశం ఇండియా అన్నది జగమెరిగిన సత్యం. సుస్థిర ప్రభుత్వం, సమర్థ వ్యూహకర్తలు ఉన్న ఈ సమయంలోనే ఉపఖండంలో శాంతి, అభివృద్ధి దిశగా భారత్‌ ఆలోచించాలి. పాక్‌ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ముంగిట ఉంది. సత్సంబంధాల దిశగా మనం ఒక అడుగు వేస్తే... దాయాది దేశం రెండడుగులు ముందుకు వేస్తుందేమో! అది చైనాను ఆలోచనలో పడేసే అంశం కూడా!

ఐక్యతను తెలియజెప్పాలి

భారత్‌-పాక్‌లు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఇరు దేశాల ప్రభుత్వాలే ప్రజలను కలిపే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సింది. ఇస్లామాబాద్‌-న్యూదిల్లీ-ఢాకాలను ఒక వేదికపైకి తెచ్చేలా సంస్కృతిని, చరిత్రను, విశిష్ట వ్యక్తులను గుర్తు చేసుకొనే కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సింది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను వచ్చే ఏడాది ఆగస్టు దాకా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారత ఉపఖండంలో బస్సు, రైలు యాత్రలకు పచ్చ జెండా ఊపాలి. క్రీడా పోటీలను నిర్వహించాలి. తద్వారా అఖండ భారత్‌ 75 ఏళ్లుగా మాత్రమే విడిపోయింది, వేల సంవత్సరాలు అది కలిసే ఉందని చాటిచెప్పే ప్రయత్నం చేయాలి. అటు సింధు ఇటు గంగ నదులతో మన బంధం విడదీయలేనిదని గుర్తుచేసుకోవడానికి గొప్ప సందర్భమిది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే ఈ చర్యలు భారత్‌కే మేలు చేస్తాయి.

- సుంకరి చంద్రశేఖర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Posted Date: 06-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం