• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ ఆశలపై వాన్స్‌ నీళ్లు?


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా 39 ఏళ్ల జేడీ వాన్స్‌ను ఎంపిక చేయడం సంచలనంగా మారింది. ఒహైయో రాష్ట్ర సెనెటర్‌ అయిన వాన్స్‌ తెలుగు మూలాలున్న చిలుకూరి ఉషను ప్రేమించి పెళ్లాడారనే సంగతి ఆసక్తి రేపింది. ట్రంప్‌-వాన్స్‌ జోడీ విజయం సాధిస్తే భారత ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?



మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో రిపబ్లికన్‌ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యానికి పట్టం కట్టింది. రీగన్‌ విధానాల వల్ల ప్రపంచీకరణ బలం పుంజుకుని అమెరికా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోయాయని, అది కార్మికవర్గ ప్రయోజనాలను దెబ్బతీసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పరిశ్రమలను స్వదేశానికి రప్పించి, అక్రమ వలసలను నిరోధించి అమెరికాను మహత్తర దేశంగా తీర్చిదిద్దాలనే ట్రంప్‌ నినాదంతో వాన్స్‌ ఏకీభవిస్తున్నారు. స్వయంగా కార్మిక వర్గ నేపథ్యం కలిగిన వాన్స్‌ తెల్లజాతి కార్మికుల ప్రయోజనాల రక్షణకు అగ్ర ప్రాధాన్యమిస్తారు. యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆయన న్యాయవిద్యను అభ్యసించారు. పీటర్‌ ఠీల్, ఎలాన్‌ మస్క్‌ వంటి మితవాదుల మద్దతును వాన్స్‌ చూరగొన్నారు. విధానాల పరంగా అవసరమైతే వామపక్ష ఉదారవాదులతో చేతులు కలపడానికీ వెనకాడరు. ఆలోచనాపరునిగా పేరుతెచ్చుకున్న వాన్స్‌ రిపబ్లికన్‌ పార్టీనీ, అమెరికా ప్రజాస్వామ్యాన్నీ కొత్త మలుపు తిప్పగలరనే అంచనాలు బలంగానే వినిపిస్తున్నాయి. యువనేత వాన్స్‌ ఎంపిక ద్వారా ట్రంప్‌ తమ పార్టీ భవిష్యత్తు గురించి స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. బైడెన్‌ తడబాట్ల వల్ల పాలక డెమోక్రటిక్‌ పార్టీ పరిస్థితి అయోమయంలోకి జారిపోయిన సమయంలో ట్రంప్‌-వాన్స్‌ ద్వయానికి విజయావకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్న వారికి కొదవ లేదు. 


ఆర్థిక జాతీయవాదం

చైనా దూకుడుతో ప్రపంచీకరణపై అమెరికాలో పునరాలోచన మొదలైంది. చవకగా కార్మిక శక్తి లభిస్తుందని ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికా పరిశ్రమలను తిరిగి స్వదేశానికి రప్పించాలనే ఆర్థిక జాతీయవాదానికి వాన్స్‌ బలమైన మద్దతుదారు. అమెరికా ధనాన్నీ, అమెరికన్ల రక్తాన్నీ విదేశీ యుద్ధాలలో ధారపోయడాన్ని ఆయన ప్రశ్నిస్తారు. అమెరికా సరిహద్దులను అక్రమంగా దాటి వస్తున్న వలసదారులనూ, మాదక ద్రవ్యాల దొంగరవాణానూ నిరసిస్తారు. ఈ అవాంఛనీయ ధోరణుల కట్టడికి బలమైన విధానాలను అనుసరించాలన్నది వాన్స్‌ ఆలోచన. విదేశాంగ విధానానికి వస్తే వాన్స్‌ చైనాకు బద్ధ వ్యతిరేకి. ట్రంప్‌ మాదిరిగానే వాన్స్‌ కూడా రక్షణ వ్యయమంతా అమెరికా నెత్తినే వేసుకోకుండా, నాటో (ఐరోపా) సభ్య దేశాలు తమ వంతుగా రక్షణ బడ్జెట్లను పెంచాలనుకునే వ్యక్తి. తూర్పు ఆసియాలోని మిత్ర దేశాలకు అమెరికా అండగా నిలవాలన్నది వాన్స్‌ అభిమతం. డాలర్‌ విలువను తగ్గించడం ద్వారా అమెరికా సరకులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడగలిగేలా చేయాలంటారు. అమెరికా స్వీయ వాణిజ్య రక్షణ విధానాలను అవలంబించాలని గట్టిగా వాదిస్తారు. ఉక్రెయిన్‌ సమస్యకు ఆయన చూపే పరిష్కారం- రష్యాతో ఇప్పుడున్న సరిహద్దులను యథాతథంగా ఆమోదించి, ఉక్రెయిన్‌ భద్రతకు భరోసా ఇవ్వడం. తైవాన్‌పై చైనా దండయాత్ర చేయకుండా నిలువరించాలని, అందుకు కావలసిన ఆయుధ సంపత్తిని తైవాన్‌కు సమకూర్చాలని వాన్స్‌ ప్రతిపాదిస్తున్నారు. ఇజ్రాయెల్‌ను గట్టిగా సమర్థిస్తూ ఇరాన్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తారు. ట్రంప్‌ మాదిరిగానే పశ్చిమాసియా సంఘర్షణల్లో అమెరికా అనవసరంగా తలదూర్చకూడదని వాదిస్తారు. ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల మధ్య సయోధ్య కుదరాలన్నది వాన్స్‌ ఆకాంక్ష. ఈ విధంగా కొంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తారు. అంతిమంగా పశ్చిమాసియాలో అమెరికా ఆధిక్యాన్ని నిలబెట్టడానికే ప్రాధాన్యమిస్తారు. 


ఏ మలుపు తిరుగుతుందో...

నవంబరు ఎన్నికల్లో ట్రంప్, వాన్స్‌లు గెలిస్తే వారి ప్రభుత్వం అనుసరించబోయే విదేశాంగ విధానం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ చపలచిత్త ధోరణి స్థిరమైన విధానాలకు అడ్డువస్తుంది. అలాంటప్పుడు వాన్స్‌ తన పిన్నవయసు ఉత్సాహంతో, సాలోచనగా విధానాలను రూపొందించి, అమలు చేయడానికి చొరవ తీసుకుంటారని భావిస్తున్నారు. తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ చైనా సముద్రాలపై ట్రంప్‌-వాన్స్‌ సర్కారు దృష్టి కేంద్రీకరించవచ్చు. ఇక్కడ చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని దృఢ సంకల్పం ప్రదర్శించే అవకాశముంది. భారత్‌ దాన్ని సహజంగానే స్వాగతిస్తుంది. అమెరికా-భారత్‌ల మధ్య వ్యూహపరంగా మరింత సన్నిహిత సహకారం వృద్ధి చెందవచ్చు. కానీ, వాన్స్‌ అమెరికా డాలర్‌ విలువను తగ్గించి ఎగుమతులు పెంచుకోవాలనడం, విదేశాలకు తరలిపోయిన పరిశ్రమలు, వ్యాపారాలను వెనక్కు రప్పించాలని, విదేశీ ఎగుమతులపై సుంకాలు పెంచాలని ప్రతిపాదించడం భారత్‌కు రుచించని వ్యవహారమే. చైనా నుంచి పరిశ్రమలను భారత్‌కు తరలిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న దిల్లీకి వాన్స్‌ విధానం ఆశాభంగం కలిగించవచ్చు. ఆర్థిక రంగంలో భారత్‌- అమెరికా సహకారం ఏ మలుపు తిరుగుతుందనేది కీలకంగా మారింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో రెండు దేశాల మధ్య సంయుక్త కృషిని ట్రంప్‌-వాన్స్‌ ద్వయం కొనసాగిస్తుందా అన్నదీ ముఖ్య ప్రశ్నే.


- వివేక్‌ మిశ్రా

(అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు)
 

-------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిరాయింపుల ప్రజాస్వామ్యం!

‣ పెను ప్రమాదంలో జీవ వైవిధ్యం

‣ ఆస్ట్రియాతో చెలిమి... ఇండియాకు కలిమి!

‣ ఉపాధి వృద్ధికి మేలిమి మార్గం
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని