• facebook
  • whatsapp
  • telegram

ఆస్ట్రియాతో చెలిమి... ఇండియాకు కలిమి!



భారత్, ఆస్ట్రియా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, జలసంరక్షణ, పరిశోధన, అంకురాలకు అనువైన వాతావరణ కల్పన వంటి అంశాల్లో ఉభయ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఈ రంగాల్లో ఇండియాకు ఆస్ట్రియా ఎలాంటి సహకారం అందించగలదు?


ప్రధాని మోదీ తాజాగా ఆస్ట్రి యాలో పర్యటించారు. రాజధాని వియన్నాలో ఉభయదేశాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం మోదీతో పాటు ఆస్ట్రియా ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కోసం వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని నిర్ణయించినట్లు వారు ప్రకటించారు. ఇందుకు అవసరమైన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్న మోదీ- ఇది కేవలం ఆర్థిక సహకారం, పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాదన్నారు. పునరుత్పాదక ఇంధనాలు, హైడ్రోజన్, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ సాంకేతికతలు వంటి రంగాల్లోనూ ఉభయ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ భారతీయ, ఆస్ట్రియా సీఈఓలకు పిలుపిచ్చారు. ఆస్ట్రియాకు చెందిన 40దాకా కంపెనీలు భారత్‌లో సొరంగాలు, రైలు మార్గాల నిర్మాణం వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి.


వసతుల్లో మేటి

ఆస్ట్రియాలో హైస్పీడ్‌ హైవే(ఆటోబాన్‌)లతో పాటు జాతీయ, స్థానిక రహదారులు ఉన్నాయి. అత్యంత నాణ్యమైన, భద్రమైన రహదారి వ్యవస్థకు ఆస్ట్రియా పెట్టింది పేరు. ఆటోబాన్‌ వ్యవస్థ చాలా అధునాతనమైనది. దేశంలోని ముఖ్య ప్రాంతాలను పొరుగు దేశాలతో అనుసంధానించడంలో అది కీలకమవుతోంది. ప్రజల రాకపోకలు, వస్తు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐరోపాలోనే అత్యంత సౌకర్యవంతమైన ఆధునిక రైల్వే వ్యవస్థ ఆస్ట్రియా సొంతం. అక్కడ మొత్తం 6,123 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌లో 3,523 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేపట్టారు. రైల్‌జెట్‌ వంటి హైస్పీడ్‌ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాలను పొరుగు దేశాలతో అనుసంధానిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ మెట్రో రైళ్లు, బస్సులు సేవలు అందిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనాల విషయంలోనూ ఆస్ట్రియా అగ్రగామి దేశమే. జల విద్యుదుత్పత్తితో పాటు పవన, సౌర విద్యుత్, బయోమాస్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మొత్తం విద్యుత్తులో మూడొంతులకు పైగా పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సమకూరుతుండటం విశేషం. 2030నాటికి పూర్తిగా ఇటువంటి విద్యుత్తునే వినియోగించాలన్నది ఆస్ట్రియా లక్ష్యం. 2040 నాటికి ఆస్ట్రియా కర్బన ఉద్గారాల తటస్థత సాధిస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా. ఆ దిశగా ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా భవనాల్లో మార్పులు చేపడుతున్నారు. స్మార్ట్‌గ్రిడ్‌ వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు, వ్యర్థాల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నారు. వ్యర్థాలను వేరుచేయడం, పునశ్శుద్ధి, ఎరువుల తయారీ వంటి అంశాల్లో శ్రద్ధ కనబరుస్తున్నారు. గృహ, ఆహార, నిర్మాణ, పారిశ్రామిక, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాల నిర్వహణ కోసం దాదాపు 90రకాల చర్యలు చేపడుతున్నారు. పరికరాల జీవితకాలాన్ని, మన్నికను పెంచడానికి మరమ్మతులకు ప్రాధాన్యమివ్వడం విశేషం. తద్వారా వనరుల వినియోగం నియంత్రణలో ఉంటోంది. ప్రజలకు అత్యంత పరిశుభ్రమైన తాగునీటిని అందించడంతోపాటు జల వనరుల పరిరక్షణ, వ్యర్థ జలాల శుద్ధి పట్ల శ్రద్ధ పెడుతున్నారు. ఆస్ట్రియా జలవిధాన ప్రధాన లక్ష్యాలు- నీటి వనరులను పరిరక్షించడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, వరదలను నియంత్రించడం. అందులో భాగంగా- కనుమరుగైన జల వనరులను పునరుద్ధరిస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన సాంకేతికతల్లో పరిశోధన, అభివృద్ధికి వియన్నా పెద్దయెత్తున పెట్టుబడులు పెడుతూ... పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందిస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో 3.7శాతానికి పైగా పరిశోధనలకు వెచ్చించాలని నిర్ణయించింది. పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలు అత్యంత నాణ్యంగా ఉండటంవల్లే ఆస్ట్రియా వంటి ఐరోపా దేశాల్లో చాలా కంపెనీలు అంతర్జాతీయంగా గట్టిపోటీ ఇస్తున్నాయి. ఉపాధి కల్పనలోనూ ముందుంటున్నాయి.


మరింత ముందడుగు

ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రియా కార్మిక, ఆర్థిక వ్యవహారాల మంత్రి మార్టిన్‌ కొచెర్‌ భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఇండియా-ఆస్ట్రియా స్టార్టప్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు ఉభయ దేశాల్లోని అంకుర సంస్థలు, మదుపరులు, ఇతర భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడానికి దీన్ని లక్షించారు. ప్రధానంగా ఐటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో ఇది కీలక భూమిక పోషిస్తుందంటున్నారు. ఉభయ దేశాల ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలకు బలిమిని చేకూర్చగల ఈ స్టార్టప్‌ బ్రిడ్జ్‌- ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనతో మరింత జోరందుకుంటుందని ఆశిద్దాం.


- అరూణిమ్‌ భూయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫ్రాన్స్‌ దారెటు?

‣ విశాఖ ఉక్కు నిలదొక్కుకుంటుందా?

‣ సాంస్కృతిక వెలుగులో జనగణన

‣ పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని