• facebook
  • whatsapp
  • telegram

ఉపాధి వృద్ధికి మేలిమి మార్గం



ఇండియా అతి త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రభుత్వ వర్గాలు ఘనంగా చెబుతున్నాయి. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరగకుండా, నిరుద్యోగ సమస్య తీరకుండా జీడీపీ ఎంత వృద్ధి చెందితే ఏమిటి ప్రయోజనం? యువతకు సరైన ఉపాధి అవకాశాలు చూపగలిగితేనే ఇండియా నిజంగా అభివృద్ధి చెందిన దేశమవుతుంది.  


సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు కొరవడటం, సరైన జీతభత్యాలు లభించకపోవడం భారతదేశాన్ని పీడిస్తున్న సమస్యలు. 2022-23లో దేశీయంగా కార్మిక భాగస్వామ్య రేటు 50.6 శాతమని, మహిళా కార్మిక భాగస్వామ్యం 31.6శాతమేనని నియతకాల శ్రామిక శక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తెలిపింది. 2022-23లో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగిత 12.9శాతం. దీనివల్ల ప్రపంచంలోనే అధికంగా యువత ఇండియాలోనే ఉన్నా, దేశానికి ఆర్థిక లబ్ధి చేకూరడం లేదు. ఎగుమతుల వృద్ధి ఉపాధి కల్పనకు రాచబాట వేస్తుందని పలు దేశాల అనుభవం చాటిచెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత జపాన్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియాలు తమ ఆర్థిక వ్యవస్థలను ఎగుమతుల ప్రాధాన్యంగా మలచుకొని పూర్తి ఉద్యోగితను, అధిక వృద్ధిరేట్లను సాధించాయి. అలాంటి చిన్న దేశాలు అనుసరించిన ఎగుమతుల ఆర్థిక నమూనా భారత్‌ వంటి సువిశాల దేశానికి పనికిరాదని, స్వదేశీ గిరాకీపైనే భారత్‌ ఆధారపడి అభివృద్ధి సాధించాలని ఆర్థికవేత్తలు సూత్రీకరిస్తూ వచ్చారు. అయితే, ఇండియా జనాభా ఎంత పెద్దదైనా తలసరి ఆదాయాలు తక్కువగా ఉన్నందువల్ల వివిధ రకాల వస్తుసేవలను విరివిగా కొనుగోలు చేసే స్థోమత ప్రజలకు ఉండదు. గిరాకీ తక్కువైతే పారిశ్రామిక ఉత్పత్తీ కుంటువడి ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించవు. అందువల్ల ఎగుమతులను జోరెత్తించడం ద్వారానే ఉపాధిని పెంచగల వీలుంది.


కేరళ ఆదర్శం

యువతకు సరైన ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించకుండా ఉచితంగా నగదు, ఆహార ధాన్యాలు అందిస్తే సరిపోదు. ఉచిత బియ్యం ఇచ్చినంత మాత్రాన ప్రజలకు దుస్తులు, నివాస వసతి, విద్యా వైద్యాలు లభించవు. ఉపాధి లేక ప్రజల చేతిలో డబ్బు ఆడకపోవడంతో గత అయిదేళ్లలో వ్యక్తిగత వినియోగం చాలా తక్కువగా నమోదైంది. జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతమైతే వ్యక్తిగత వినియోగంలో వృద్ధి కేవలం4.6శాతం. ఈ పరిస్థితి మారాలంటే పరిశ్రమలను విరివిగా స్థాపించి, ఎగుమతులను పెంచాలి. తద్వారా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి కార్మికులను తరలించాలి. యువతకు విశేషంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇదే సరైన దారి. ఐటీ, పర్యటకం వంటి సేవలను విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చు. అయితే, అది పారిశ్రామిక రంగ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం కాబోదు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయి. అందువల్ల జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఎగుమతుల వృద్ధికి పకడ్బందీ వ్యూహాలను చేపట్టాలి.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై కేరళ ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీని నుంచి మిగిలిన రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రైతులు అదనపు విలువ జోడించిన తమ వ్యవసాయ సరకులను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేరళ సహకార శాఖ అన్నివిధాలుగా సాయపడుతోంది. దీనికి 30 వ్యవసాయ సహకార సంఘాలను ఎంపిక చేసింది. 12 టన్నుల దాకా శుద్ధి చేసిన వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేయడానికి ఒక మార్కెటింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. వరప్పెట్టి, కక్కూర్, తంగమణి సహకార సంఘాలు తయారు చేసే కర్రపెండలం ఉత్పత్తులు, అరటి చిప్స్, ఎండు పనస ముక్కలు, తేయాకు పొడి తదితరాలను మొదటి విడతలో అమెరికాకు ఎగుమతి చేశారు. రెండో విడత కింద మరిన్ని సహకార సంఘాలు శుద్ధి చేసిన వ్యవసాయ సరకులను జులైలో ఎగుమతి చేస్తున్నారు. కొచ్చిలో ఏర్పాటుచేసిన సహకార మార్ట్‌ రాష్ట్రంలోని సహకార సంఘాల కోసం ఎగుమతి లైసెన్సులు సంపాదిస్తోంది. అరటి చిప్స్‌ తదితరాల తయారీ కోసం అవసరమైన యంత్ర వ్యవస్థలను మలేసియా నుంచి దిగుమతి చేసుకున్నారు. మసాలా కర్ర పెండలం చిప్స్‌ తయారీ ఫార్ములాను విదేశాల నుంచి కొనుగోలు చేశారు. కేరళ వ్యవసాయోత్పత్తులకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కువైట్‌ దేశాల్లో ఆదరణ పెరిగింది.


సొంత కాళ్లపై నిలబడేలా...

చిన్నతరహా తేయాకు రైతులకు అండగా రూ.12 కోట్ల పెట్టుబడితో కేరళలో తంగమణి సహకార తేయాకు ఫ్యాక్టరీని 2017లో ప్రారంభించారు. దీనికి తేయాకు బోర్డు రూ.1.5 కోట్ల గ్రాంటు ఇచ్చింది. ఈ కర్మాగారానికి రోజుకు 15,000 టన్నుల తేయాకును శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. తంగమణి సొసైటీ రైతుల నుంచి కిలో తేయాకును రూ.12కు కొనుగోలు చేయడంతో మిగతా కొనుగోలుదారులూ ధరను పెంచి ఇవ్వకతప్పలేదు. తంగమణి సొసైటీ గత నాలుగేళ్లుగా సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఖతర్‌ దేశాలకు ఏటా 25 టన్నుల తేయాకును ఎగుమతి చేస్తోంది. స్వరాష్ట్రంలో సహ్యా బ్రాండు పేరుతో తేయాకు విక్రయిస్తోంది. తంగమణి ఫ్యాక్టరీ రైతులకు గిట్టుబాటు ధరలిస్తూనే గత మూడేళ్లుగా లాభాలు కళ్లజూస్తోంది. ఇతర సహకార సంఘాల వల్ల కేరళ గ్రామీణ యువజనులకు స్వయం ఉపాధితో మంచి ఆదాయం లభిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి ఉత్పాదక కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలి. గ్రామీణ యువత తమ కాళ్లపై తాము నిలిచేలా తోడ్పడాలి. నైపుణ్య గణన ద్వారా సమాచారాన్ని సేకరించి యువతకు స్వయం ఉపాధి, జీతభత్యాలతో కూడిన ఉపాధి మార్గాలను రూపొందించాలి.


వ్యవసాయ కూలీలుగా...

ఇండియాలో ఉపాధి అవకాశాలు తగినంతగా లేకపోవడం వల్ల యువత చిన్నాచితకా వ్యాపారాలు చేసుకోక తప్పడం లేదు. అందుకే 2020-21లో స్వయం ఉపాధి పొందినవారు 55.6శాతం ఉంటే, 2022-23లో వారి సంఖ్య 57శాతానికి పెరిగింది. చాలామంది విషయంలో స్వయం ఉపాధి అనేది నిరుద్యోగానికి ఒక ముసుగు మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్నామని జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఓ)లో చెప్పినవారిలో 18శాతం- కుటుంబ వ్యాపారాల్లో సహాయకులుగా పనిచేస్తున్నారు. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లనే వారు స్వయం ఉపాధి చూసుకోవలసి వస్తోంది. పట్టణాల్లోని పరిశ్రమల్లో, అంటే- సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దక్కక చాలామంది వ్యవసాయ కూలీలుగా బతుకువెళ్ళదీస్తున్నారు. అందుకే గడచిన అయిదేళ్లలో వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫ్రాన్స్‌ దారెటు?

‣ విశాఖ ఉక్కు నిలదొక్కుకుంటుందా?

‣ సాంస్కృతిక వెలుగులో జనగణన

‣ పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని