• facebook
  • whatsapp
  • telegram

Agniveer Scheme: దేశ భద్రత... అగ్నివీరుల భవిత... జంటగా సంస్కరణలు!

ఏటా 60 - 65 వేల వరకు కొత్త సైనికుల నియామకం


భారత్‌ తన పరిమాణం, జనాభాను బట్టే కాకుండా జగడాలమారి పొరుగు దేశాలను దృష్టిలో పెట్టుకొనీ అనివార్యంగా భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొంది. దానికయ్యే ఖర్చూ ఎక్కువగానే ఉంటోంది. సువిశాల దేశ అభివృద్ధికి, సాయుధ బలగాల అవసరాలకు మధ్య సమతూకం పాటిస్తూ నిధులను వెచ్చించక తప్పదు. తదనుగుణంగా భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం చేపట్టిన అగ్నివీర్‌ పథకానికి తాజాగా కొన్ని మార్పుచేర్పులు తలపెట్టింది. పలు కమిటీలు, నిపుణులు గతంలో చేసిన సూచనలను ఈ సందర్భంగా పరిగణనలో తీసుకోవడం మంచిది.


త్రివిధ సాయుధ బలగాల అధికారుల కేడర్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని అజయ్‌ విక్రం సింగ్‌ కమిటీ 2004లో సిఫార్సు చేసింది. శాశ్వత క్యాడర్‌ అధికారులకూ, స్వల్వ వ్యవధికి నియుక్తులయ్యే సహాయ అధికారులకు (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) మధ్య 1:1.1 నిష్పత్తిని పాటించాలని సూచించింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద యువ అధికారులను తీసుకుని, వారిలో మెరికల్లాంటివారికి క్రమంగా పర్మనెంట్‌ క్యాడర్‌గా పదోన్నతి సాధించే అవకాశం కల్పించాలంది. సాయుధ బలగాల్లోకి రాచమార్గంలో ప్రవేశం కల్పించడంతోపాటు అంతే రాచఠీవితో నిష్క్రమించే వెసులుబాటూ ఉండాలని సూచించింది. ఆ కమిటీ సిఫార్సులు కాగితం మీదే మిగిలిపోయాయి. సైన్యంలో ఇప్పటికీ ప్రతి నలుగురు రెగ్యులర్‌ (పర్మనెంట్‌) సిబ్బందికి ఒక్క సహాయ (షార్ట్‌ సర్వీస్‌) అధికారి చొప్పునే ఉన్నారు. సర్వీసు పూర్తయిన తరవాత సహాయ అధికారులు హుందాగా నిష్క్రమించే ఏర్పాట్లు చేయాలని అయిదో, ఆరో వేతన సంఘాలు చేసిన సిఫార్సులూ అమలుకు నోచుకోలేదు. విక్రం సింగ్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం సైన్యం, వాయు, నావికా దళాలకు కలిపి యాభై వేల మంది అధికారులు ఉండాలి. ఆ కమిటీ ఏర్పడి 20 ఏళ్లు గడచిపోయినా ఈ సిఫార్సు అమలులోకి రాలేదు. అగ్నిపథ్‌ కార్యక్రమం సైతం ఈ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. దానికి కారణాలను శోధించే పనిని ఇప్పటికైనా ప్రభుత్వం చేపట్టడాన్ని స్వాగతించాలి.



శిక్షణపై ప్రభావం

ప్రస్తుతం సాయుధ బలగాలకు, సీఆర్‌పీఎఫ్‌ వంటి పారామిలిటరీ దళాలకు వేర్వేరు నియామక విధానాలు, శిక్షణ పద్ధతులు ఉన్నాయి. ఆంతరంగిక భద్రతా విధులను నిర్వర్తించే పారామిలిటరీ దళాల సంఖ్యాబలమూ నానాటికీ పెరుగుతోంది. సైనిక, పారామిలిటరీ బలగాలకు పెరుగుతున్న ఖర్చును హేతుబద్ధ రీతుల్లో ఆదా చేయడానికి కేంద్ర హోం, రక్షణ శాఖలు కలిసి పరిశీలన జరపాలని ఆరో వేతన సంఘం సూచించింది. ఇకనుంచి సైనిక, పారామిలిటరీ దళాల నియామకాలను కేంద్రీకరించాలని, సైన్యంలో నాలుగు నుంచి పదేళ్లపాటు పనిచేసిన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికపై పారామిలిటరీ దళాల్లో నియమించాలని సిఫార్సు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక మిగులుతో పాటు పారామిలిటరీ దళాలకు సుశిక్షిత, అనుభవజ్ఞ సిబ్బంది లభిస్తారు. అయితే, పలు కారణాల వల్ల ఈ సిఫార్సు అమలుకు నోచుకోలేదు. సదరు అడ్డంకులను తొలగించాల్సిన సమయం వచ్చింది.


సైన్యంలో ఏటా అరవై వేల నుంచి అరవై అయిదు వేల వరకు కొత్త సైనికులను నియమిస్తారు. గత రెండేళ్ల నుంచి రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవడంతో సైన్యానికి 1.2 లక్షల నుంచి 1.3 లక్షల వరకు సిబ్బంది కొరత ఏర్పడింది. వచ్చే నాలుగేళ్లలో సైన్యం నుంచి జరగబోయే ఉద్యోగ విరమణలను దృష్టిలో ఉంచుకుంటే మరెన్నో లక్షల కొత్త సిబ్బంది అవసరపడతారు. ఈ కొరతను భర్తీ చేయడానికి వచ్చే నాలుగేళ్లలో ఏటా చాలా మందిని రిక్రూట్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కసారే భారీగా నియామకాలు చేపట్టడం వల్ల శిక్షణ దెబ్బతింటుంది. అది సిబ్బంది పనితీరు నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పదోన్నతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలను నివారించడానికి నియామకాలు, ఉద్యోగ విరమణల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ప్రస్తుతం త్రివిధ సాయుధ బలగాలు ఏడాదికి దాదాపు 65,000 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలవు. దీన్ని మహా అయితే 30శాతం మేర పెంచవచ్చు. శిక్షకులు, శిక్షణ సౌకర్యాలను అదనంగా ఏర్పాటు చేయడమనేది ఉన్నపళాన జరిగే వ్యవహారం కాదని గమనించాలి. రాబోయే సంవత్సరాల్లో ఇప్పుడున్న దానికన్నా రెట్టింపు సిబ్బందికి- అంటే దాదాపు 1.30 లక్షల మందికి తర్ఫీదు ఇవ్వడానికి అవసరమైన అదనపు శిక్షకులను, వసతులను సమకూర్చుకోవాలి. తద్వారా శిక్షణలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యత తగ్గకుండా జాగ్రత్తపడాలి. రానున్న 8-10 సంవత్సరాల్లో సాయుధ బలగాల్లో దిగువ స్థాయి సిబ్బంది, ఉన్నత స్థాయి అధికారుల సంఖ్యలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడవచ్చు. ఉన్నత ర్యాంకుల అధికారులు సరిపడా సంఖ్యలో ఉన్నా మధ్యశ్రేణి సైన్యాధికారులకు కొరత తలెత్తనుంది. ఈ అంతరాన్ని సరిదిద్దడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలి.


నాణ్యతపై రాజీ... ప్రమాదకరం

సైన్యం నుంచి బయటికొచ్చే అగ్నివీరులకు అవకాశాలు కల్పిస్తామని వివిధ పారామిలిటరీ దళాల డైరెక్టర్‌ జనరళ్లు వాగ్దానాలు చేశారు. అయితే, అగ్నిపథ్‌ పథకం అమలులోకి వచ్చిన గత రెండేళ్లలో ఇలాంటి రిక్రూట్‌మెంట్లకు గెజెట్‌ నోటిఫికేషన్‌ ఏదీ విడుదలైన దాఖలా లేదు. మొదటి బ్యాచి అగ్నివీరులు ఇంకా సైన్యం నుంచి బయటకు రావాల్సి ఉండటమే దీనికి కారణం కావచ్చు. వారు బయటకు వచ్చినప్పటి నుంచి పారామిలిటరీ దళాల్లోకి ప్రవేశాల కోసం సాధికార ప్రకటనలను విడుదల చేయాలి. దాదాపు 150 సంస్థల్లో అగ్నివీరులకు అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరినవారికి సెలవులను 30 రోజులకే పరిమితం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. సాధారణ సైనికులకు ఇచ్చే సెలవులను వీరికీ వర్తింపజేయాలి. అగ్నివీరుల విషయంలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమే. అయితే, మార్పును నేర్పుగా తీసుకురావడం ముఖ్యమని గ్రహించాలి. జాతీయ భద్రతకు కీలకమైన సిబ్బంది విషయంలో నాణ్యతపై రాజీ పడకూడదు.


ప్రతిపాదిత మార్పులు

అగ్నివీరులుగా నియమితులయ్యే సిబ్బంది నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. ఈ కాల వ్యవధిని ఎనిమిదేళ్లకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఇది అగ్నివీరులకు, సైన్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రస్తుతం అగ్నివీరుల్లో 25శాతమే శాశ్వత నియామకాలకు అర్హులు. దీన్ని 70-75 శాతానికి పెంచాలనే ప్రతిపాదన కేంద్రం పరిశీలనకు వచ్చింది. అధికారుల క్యాడర్‌కు వర్తింపజేస్తున్న ఈ సూత్రాన్ని సైనికులకూ అన్వయించడం మంచిదనే భావన వ్యక్తమవుతోంది.

శాంతి కాలంలో, యుద్ధ కాలంలో అగ్నివీరులకు ఇచ్చే జీతభత్యాలు, ఇతర పారితోషికాలను ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే విధంగా నిర్ణయించాలి.

నిర్దేశిత కాల సర్వీసు తరవాత సైన్యం నుంచి బయటికొచ్చే అగ్నివీరులను తీసుకోవడానికి ఇతర సర్వీసుల్లో తగిన ఖాళీలను సృష్టించాలి. వాటిని గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించి, సక్రమంగా భర్తీ చేయాలి.

అగ్నివీరులకు శిక్షణ కాలాన్ని పెంచాలి. కొన్ని సాంకేతిక ఉద్యోగాలకు కాలానుగుణమైన మార్పులు చేయాలి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమున్నత ఆశయాల యువభారతం

‣ నైపుణ్య యుక్తితో యువ‘శక్తి’!

‣ జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?

‣ చైనా విస్త‘రణం’... శాంతికి అవరోధం

Posted Date: 19-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని