• facebook
  • whatsapp
  • telegram

సత్వర న్యాయం సాకారమవుతుందా?వలస పాలన కాలం నాటి నేర న్యాయ చట్టాలు ఆధునిక సమాజ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను రూపొందించింది. నేటి నుంచి అవి అమలులోకి రానున్నాయి. కొత్త చట్టాల ప్రత్యేకత ఏమిటి? వాటి మూలంగా నేర న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?


భారతదేశంలో క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి 1860నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ), 1872నాటి భారత సాక్ష్యాధారాల చట్టం, 1973 నాటి భారత నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) ప్రాతిపదికగా నిలిచాయి. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ పాలనా కాలంలో ఈ చట్టాలు రూపుదిద్దుకొన్నాయి. ఇవి భారతదేశాన్ని వలస పాలకులు తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి లక్షించినవే తప్ప మన పౌరులకు న్యాయం చేయడానికి ఉద్దేశించినవి కావు. పైగా, ఆ చట్టాలు ఆధునిక భారతదేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వాటిని కాలానుగుణంగా మార్చాలని గుర్తించి 2020లో క్రిమినల్‌ చట్టాల సంస్కరణల సంఘాన్ని నెలకొల్పారు. ఆ సంఘ సిఫార్సులపై పాత చట్టాల స్థానంలో కొత్త వాటిని రూపొందించారు. 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా భారత న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత పేరుతో కొత్త చట్టాలు ఈ ఏడాది జులై ఒకటి నుంచి అమలులోకి వస్తున్నాయి. వలస పాలనలో దండ సంహితగా ఉన్న చట్టాలు ఇప్పుడు న్యాయ సంహితగా మారాయి.  


ఎలెక్ట్రానిక్‌ సాక్ష్యాలకు అనుమతి

వలస పాలన యుగంలో ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో న్యాయవ్యవస్థను సమూలంగా మార్చేసింది. బ్రిటిష్‌ తరహా కోర్టులను, హైకోర్టును నెలకొల్పింది. 1860 నుంచి వివిధ శిక్షాస్మృతులు అమలులోకి వచ్చాయి. నేరస్థులను శిక్షించి, పౌరులను రక్షించాల్సిన ఆ చట్టాలు సామాన్యులను వేధించే సాధనాలుగా తయారయ్యాయని విమర్శలు పెరిగాయి. కాలంచెల్లిన ఆ స్మృతుల స్థానంలో రూపొందించిన కొత్త బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు, ఆపైన రాష్ట్రపతి ఆమోదించడంతో అవి నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. సీఆర్పీసీ స్థానంలో వస్తున్న భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత- నేరాల దర్యాప్తు పూర్తికావడానికి గడువులు విధిస్తోంది. ఏడేళ్లు, అంతకుమించి శిక్షలు పడే నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ నిపుణులు నేర స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించాలని ఈ సంహితలోని 176వ సెక్షన్‌ నిర్దేశిస్తోంది. 173వ సెక్షన్‌ నేరాల దర్యాప్తు, విచారణలకు డిజిటల్‌ పద్ధతులను అనుమతిస్తోంది. అధునాతన సాంకేతికతల సాయంతో శీఘ్రంగా న్యాయసాధనకు వీలు కల్పిస్తోంది. ఈ సంహిత జీరో ఎఫ్‌ఐఆర్‌ అనే విప్లవాత్మక పద్ధతిని అమలులోకి తెస్తోంది. శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు  ఏ పోలీసు ఠాణాలో అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవచ్చు. దాన్ని 15రోజుల్లోగా నేర స్థలంలోని పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేయాలని 173వ సెక్షన్‌ నిర్దేశిస్తోంది. నేరాలు, నేరస్థుల ట్రాకింగ్‌ వ్యవస్థ సైతం అమలులోకి రానుంది. భారతీయ సాక్ష్య అధినియమ్‌- 1872నాటి సాక్ష్యాధారాల చట్టం స్థానంలో అమలవుతుంది. ఈ డిజిటల్‌ యుగానికి తగినట్లు ఎలెక్ట్రానిక్‌ సాక్ష్యాలనూ అది అనుమతిస్తోంది. ఈ అధినియమ్‌లోని 57వ సెక్షన్‌ ఎలెక్ట్రానిక్‌ రికార్డులను ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరిస్తోంది. మౌఖిక సాక్ష్యాన్నీ ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలో సమర్పించడాన్ని అనుమతిస్తుంది. 


ఒకే గాటన కట్టకుండా...

క్రిమినల్‌ చట్టాల మాదిరిగా పౌరులపై విస్తృత ప్రభావం చూపేవి మరేవీ ఉండవు. అందువల్ల, నూతన చట్టాలు మన సమాజాన్ని కొత్తమలుపు తిప్పబోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. క్రిమినల్‌ చట్టాలు నైతిక ప్రమాణాల పాటింపునకు బాటలువేసే మాట నిజమే కానీ, అవి పౌర హక్కులను హరించకుండా జాగ్రత్తపడాలి. చిన్న నేరాలను, తీవ్రమైన ఘోరాలను ఒకే గాటన కట్టే పద్ధతి కొత్త చట్టాలవల్ల మారుతుందనే ఆశాభావాన్ని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యక్తం చేశారు. భారతదేశంలో మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకొచ్చారు. బాధితులకు వేగంగా న్యాయం చేయాలనే గ్రహింపును అవి ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలనే చైతన్యం పెరిగింది. న్యాయ సాధన మార్గంలో అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యతా మనపై ఉంది. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అపరిష్కృత కేసులు కొండల్లా పేరుకుపోవడం సత్వర న్యాయాన్ని అసాధ్యం చేస్తోంది. దేశంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంతో పాటు అపరిష్కృత కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. కేసులు వేగంగా పరిష్కారం కాకపోవడంవల్ల విచారణ ఖైదీల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలోని మొత్తం ఖైదీల్లో 67.2శాతం విచారణ పూర్తికావడానికి సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వస్తోంది. శీఘ్ర విచారణ జరగాలంటే కోర్టుల్లో మౌలిక వసతుల కొరతను తీర్చాలి. సుశిక్షిత ఫోరెన్సిక్‌ సిబ్బందిని తయారుచేసుకోవాలి. వ్యవస్థలో పేరుకుపోయిన ఇలాంటి లోపాలను తొలగించడానికి కొత్త చట్టాలు తోడ్పడాలి. 


తప్పని ఆందోళన

కొత్త చట్టాలలో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత పోలీసు కస్టడీ సమయాన్ని 15 రోజుల నుంచి 60-90 రోజుల వరకు పొడిగించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇది పౌర హక్కులకు భంగకరమని అభ్యంతరం వ్యక్తమవుతోంది. భారతీయ న్యాయసంహిత దేశ భద్రతకు సంబంధించి కొన్ని నేరాలను నిర్వచిస్తోంది. రాజద్రోహం అనే పదాన్ని చట్టం నుంచి తొలగించడం బాగానే ఉన్నా- దేశ సమైక్యత, సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హంగా ప్రకటించారు. ఇందులో కొంత సందిగ్ధత నెలకొందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సంఘటిత నేరాలు, ఉగ్రవాద చర్యలకు ఇచ్చిన నిర్వచనం మరీ విస్తృతంగా ఉండటంతో అవి దుర్వినియోగం కావచ్చనే ఆందోళన నెలకొంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జన విస్ఫోటం... సమస్యలకు మూలం!

‣ ఆయుధ స్వావలంబన కోసం...

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

‣ ఎగుమతుల కలిమి... సేద్యానికి బలిమి!

‣ వేడెక్కుతున్న భూగర్భ జలాలు

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

Posted Date: 08-07-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని