• facebook
  • whatsapp
  • telegram

జన విస్ఫోటం... సమస్యలకు మూలం!



జన సంఖ్య పరంగా ఇండియా ఇప్పటికే చైనాను అధిగమించింది. జనాభా నియంత్రణ పట్ల దేశీయంగా ప్రభుత్వాలు సరైన దృష్టి సారించలేదు. జన సంఖ్య పెరుగుదల వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు పాటుపడాలి. 


ఇండియా జనాభా ప్రస్తుతం 144 కోట్లకు పైబడింది. త్వరలోనే ఇది 150 కోట్లకు చేరనుంది. జనాభా నియంత్రణపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి దేశీయంగా రాజకీయ పార్టీలు సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. వాస్తవానికి, ఇది చాలా సున్నితమైన అంశం. అప్పట్లో ఇందిర హయాములో సంజయ్‌ గాంధీ అమలు చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, నాటి సర్కారు తీవ్ర అపఖ్యాతి మూటగట్టుకుంది. శీఘ్ర జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. సంబంధిత సవాళ్ల పరిష్కారానికి ఈ కమిటీ సిఫార్సులు చేస్తుందని వెల్లడించారు.  


ప్రత్యక్ష నరకం

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుంటే ఆర్థిక పురోగతి మందగిస్తుంది. దేశం ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేగంగా జనాభా పెరగడం వల్ల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ముందస్తు అంచనాలు తారుమారు అవుతాయి. ముఖ్యంగా, పెరిగే జన సంఖ్యకు సమాంతరంగా దేశీయంగా ఆహార ఉత్పత్తి పుంజుకోవాలి. లేకుంటే, ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. దేశీయంగా కొన్ని రాష్ట్రాలు జననాల రేటును తగ్గించడంలో ప్రగతి సాధించడం హర్షణీయం. ఈ విషయంలో విఫలమైన ఇతర రాష్ట్రాలపై పాలకులు దృష్టి సారించాలి. తక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు తమకు వచ్చే ఆదాయాలతో సంతానాన్ని ఎలా తీర్చిదిద్దవచ్చో తల్లిదండ్రులకు వివరించి చెప్పగలగాలి. 


జనాభా పెరిగేకొద్దీ ఆహారం, నిరుద్యోగం తదితర సమస్యలు చుట్టుముడతాయి. పెరిగే జనాభాకు అనుగుణంగా ఏ దేశం అయినా ఆహార వనరులు, ఉత్పాదకతను పెంచుకోవాలి. దీనికి వ్యవసాయమే ఆధారం. ఇండియాలో సగానికి పైగా జనాభా నేటికీ సాగురంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. అయితే, దేశీయంగా వ్యవసాయం కొన్నేళ్లుగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఎడతెగని నష్టాల వల్ల రైతుల జీవితాల్లో అంధకారం అలముకుంటోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపార వర్గాలు సాగు భూములను ప్లాట్లుగా మార్చేసి విక్రయిస్తున్నాయి. దీనివల్ల పంట భూములు నానాటికీ తరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆహార భద్రతకు ముప్పు తప్పదు. దీన్ని నివారించాలంటే- భూమిని నమ్ముకున్న రైతులకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. వారికి సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలి. సాగు రంగం సంక్షోభం వల్ల పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు పోటెత్తుతున్నాయి. దీనికి తగినట్లుగా వాటిలో మౌలిక వసతులు లేకపోవడంతో పట్టణ జీవితం నరకప్రాయంగా మారుతోంది. మురికివాడలు పెరుగుతున్నాయి. జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆవాస సదుపాయాలు కల్పించడం లేదు. దాంతో ఎంతోమంది కొండలు, గుట్టలు, కాలువల గట్ల పక్కన తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. జనాభా పెరుగుదల వల్ల ప్రకృతి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. పర్యావరణ కాలుష్యమూ పెచ్చరిల్లుతోంది. మురికివాడల్లో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంవల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వైరస్‌ కారక వ్యాధులు విజృంభిస్తున్నాయి. నగరాల్లో ఉండటానికి గూడు లేక చాలామంది ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, పార్కులు, రైల్వేస్టేషన్లు, బస్టాండులు, బస్‌ షెల్టర్లు, శ్మశాన వాటికలు తదితరాల్లో కాలం వెళ్ళదీస్తున్నారు. మగపిల్లవాడి కోసం కొందరు ఎక్కువ సంతానాన్ని కంటున్నారు. ఆ తరవాత వారికి చదువు చెప్పించే స్థోమత లేక పనులకు పంపిస్తున్నారు. దానివల్ల బాలకార్మిక సమస్య నిరాఘాటంగా కొనసాగుతోంది. 


అవగాహన కీలకం 

నిరుద్యోగ సమస్యకు జనాభా పెరుగుదలా ఒక కారణం. వాస్తవానికి దేశీయంగా ఉన్న యువతకు వారికి ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను ఒంటపట్టిస్తే మేలిమి మానవ వనరులుగా రూపుదిద్దుకొంటారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా నిలుస్తారు. పరిశ్రమ అవసరాలు, చదువులకు మధ్య లంకె తెగిపోయినందువల్ల చాలామందికి పనికి అవసరమైన నైపుణ్యాలు ఉండటంలేదు. దాంతో, ఉపాధి వేటలో వెనకబడుతున్నారు. మన యువతకు మెరుగైన నైపుణ్యాలు మప్పేందుకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు సైతం ఇలాంటి జనచేతన కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలి. 


- నిమ్మగడ్డ లలితాప్రసాద్‌

(ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌) 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆయుధ స్వావలంబన కోసం...

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

‣ ఎగుమతుల కలిమి... సేద్యానికి బలిమి!

‣ వేడెక్కుతున్న భూగర్భ జలాలు

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

Posted Date: 29-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం