• facebook
  • whatsapp
  • telegram

స్వల్ప వ్యయం సత్వర న్యాయం



ఏదైనా సమస్య వచ్చి న్యాయస్థానాలకు వెళ్తే వివాదం తేలేసరికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ఈ విపరీత జాప్యం వల్ల కక్షిదారులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. కోర్టులంటే భయపడి చాలామంది పేదలు వాటి గడప తొక్కడానికే జంకుతున్నారు. ఈ సమస్యలకు లోక్‌ అదాలత్‌లు పరిష్కారంగా నిలుస్తున్నాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ అంచెల్లోని కోర్టుల్లో కోట్ల సంఖ్యలో కేసులు పోగుపడ్డాయి. దీనివల్ల కక్షిదారులకు సకాలంలో న్యాయం అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులపై పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు సామాన్యులకు సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో లోక్‌ అదాలత్‌ వ్యవస్థ రూపుదిద్దుకొంది. వీటిని రాజీ కోర్టులనీ అంటారు. ఈ ఏడాదికి సంబంధించి తాజాగా జరిగిన తొలివిడత లోక్‌ అదాలత్‌లలో కోటికి పైగా కేసులు పరిష్కారమైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న లేదా వ్యాజ్యానికి పూర్వ దశలో ఉన్న కేసులను ఎలాంటి ఖర్చు లేకుండా ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో లోక్‌ అదాలత్‌లలో పరిష్కరించుకోవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను ఒక కొలిక్కి తేవడం లోక్‌ అదాలత్‌ల ప్రత్యేకత. 


పరస్పర అంగీకారంతో..

పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజ్యాంగంలోని అధికరణ 39ఎ చెబుతోంది. ఈ క్రమంలో జాతీయ న్యాయసేవల ప్రాధికార చట్టం- 1987లో భాగంగా రూపొందిన నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లు ఏర్పాటయ్యాయి. వీటి నిర్ణయాలను సివిల్‌ కోర్టు తీర్పులతో సమానంగా పరిగణిస్తారు. లోక్‌ అదాలత్‌ల తీర్పులపై ఎలాంటి అప్పీలుకు అవకాశం ఉండదు. ఒకవేళ లోక్‌ అదాలత్‌లో ఎంత ప్రయత్నించినా రాజీ కుదరని పక్షంలో ఆ కేసును ట్రయల్‌ కోర్టుకు తీసుకెళ్ళవచ్చు. సాధారణ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇద్దరు కక్షిదారుల పరస్పర అంగీకారంతో లోక్‌ అదాలత్‌కు బదిలీ చేయించుకోవచ్చు. నేరుగానూ లోక్‌ అదాలత్‌లో కేసును నమోదు చేసుకోవచ్చు. సివిల్‌, క్రిమినల్‌, రెవిన్యూ విషయాలతోపాటు మోటారు వాహన ప్రమాద పరిహారం, ఆస్తి విభజన, నష్టపరిహారం, వివాహ, కుటుంబ, భూ తగాదాలు, బ్యాంకు రుణాలు తదితర కేసులను లోక్‌ అదాలత్‌లలో విచారణ చేస్తారు. వీటితో పాటు విమాన సర్వీసులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవల విషయంలో తలెత్తే వివాదాలనూ ఖర్చులేకుండా తక్కువ సమయంలో పరిష్కరించుకోవచ్చు.


లోక్‌ అదాలత్‌లు తొలిసారిగా 1982 మార్చిలో గుజరాత్‌లోని జునాగఢ్‌లో మొదలయ్యాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాయి. సాధారణంగా నిర్వహించే లోక్‌ అదాలత్‌లు కాకుండా, మూడు నెలలకోసారి దేశవ్యాప్తంగా మెగా లోక్‌ అదాలత్‌లు జరుపుతారు. జిల్లాస్థాయి లోక్‌ అదాలత్‌లో జిల్లా జడ్జి హోదా కలిగిన ఒక ఛైర్మన్‌తో పాటు ఒక విశ్రాంత జుడీషియల్‌ అధికారి, ఒక సామాజిక కార్యకర్త, లేదా రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి సభ్యులుగా ఉంటారు. సామాజిక కార్యకర్తల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. లోక్‌ అదాలత్‌లు తాలుకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పనిచేస్తుంటాయి. గ్రామాలు, మురికి వాడలు, పారిశ్రామిక వాడలు తదితర ప్రదేశాల్లో అవకాశాన్నిబట్టి ప్రత్యేక లోక్‌ అదాలత్‌లు నిర్వహించి సామాన్యులకు న్యాయసేవలను చేరువ చేస్తున్నారు.


చేరువయ్యే మార్గమిదే..

వనరుల కొరత, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేమి, ప్రజల్లో అవగాహన కొరవడటం వల్ల లోక్‌ అదాలత్‌లు ఆశించిన స్థాయిలో సామాన్యులకు చేరువ కాలేకపోతున్నాయి. సాధారణ కోర్టుల్లో దాఖలైన కేసులను లోక్‌ అదాలత్‌లకు బదిలీచేసుకొని వివాదాలను పరిష్కరించుకుంటే, కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి పొందే అవకాశముంది. ఈ విషయం తెలియక చాలామంది లోక్‌ అదాలత్‌వైపు చూడటం లేదు. కేసులను త్వరగా తేల్చాలనే ఉద్దేశంతో ఇరువర్గాలపై తెస్తున్న ఒత్తిడీ లోక్‌ అదాలత్‌ పనితీరుపై ప్రభావం చూపుతోంది. లోక్‌ అదాలత్‌లు సమర్థంగా పనిచేయాలంటే- వాటి గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అనుభవజ్ఞులైన సిబ్బందితో వాటిలోకి ఖాళీలను భర్తీ చేయాలి. నిర్వహణకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు సమకూర్చడం తప్పనిసరి. కక్షిదారులపై ఒత్తిడి తేకుండా కౌన్సెలింగ్‌ ద్వారా రాజీకి ప్రయత్నించాలి. న్యాయవాదులు సైతం కక్షిదారుల సమస్యలను అర్థంచేసుకొని వారికి ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం సైతం ఒక అడుగు ముందుకు వేసి న్యాయవాదులకు చెల్లించే పారితోషికాలను పెంచి వారిని ప్రోత్సహించాలి. ఈ చర్యల వల్ల లోక్‌ అదాలత్‌ల పనితీరు మెరుగుపడి, అవి మరింతగా ప్రజలకు చేరువవుతాయి.


- డాక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌ 

(విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

‣ దేశంలో పేదరికం లెక్కలేనంత!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

Posted Date: 22-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం