• facebook
  • whatsapp
  • telegram

దేశంలో పేదరికం లెక్కలేనంత!దేశంలో గడచిన తొమ్మిదేళ్లలో బహుముఖ పేదరికం నుంచి 25 కోట్ల మంది విముక్తులయ్యారని నీతిఆయోగ్‌ ఇటీవలి చర్చాపత్రం పేర్కొంది. తమ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నిపుణులు విశ్లేషకులు మాత్రం నీతి ఆయోగ్‌ నివేదిక అసత్యమంటూ కొట్టిపారేశారు.


భారత్‌లో పాతిక కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారన్న చర్చాపత్రాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌, సీనియర్‌ సలహాదారు యోగేశ్‌ సూరి రూపొందించారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ విధాన, మానవాభివృద్ధి సంస్థలు నివేదించిన కొన్ని అంశాల ఆధారంగా వారు విశ్లేషణ చేపట్టారు. 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడటాన్ని కేవలం గణాంకాల రూపంలో చూడకూడదని, పేదరికం నుంచి విముక్తమైన ప్రతి భారతీయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయానికి ప్రతీక అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపి, నాలుగో స్థానానికి పరుగు తీస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ బహుముఖ పేదరిక సూచీ (ఎన్‌ఎంపీఐ)ని అంచనా వేయడానికి అనుసరించిన పద్ధతులు ప్రామాణికమైనవేనా? ఆకలి, పేదరికం లేని వికసిత భారతం 2047కల్లా నిజంగానే సాకారమవుతుందా?


అసమగ్ర సమాచారంతో లెక్కలు

ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనకబాటును బహుముఖ పేదరికం(ఎండీపీ)గా పరిగణిస్తారు. 2030కల్లా బహుముఖ పేదరికాన్ని సగానికి సగం తగ్గించాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్‌డీజీ1.2) అందుకొనే దిశగా భారత్‌ వేగంగా పురోగమిస్తోందని 2005-06 నుంచి నీతి ఆయోగ్‌ వెలువరిస్తున్న నివేదికలు చాటుతున్నాయి. పోషణ్‌ పథకం, రక్తహీనత సమస్యల్లేని భారత్‌, ఉజ్జ్వల యోజన వంటి వాటివల్ల బహుముఖ పేదరికం తగ్గిందని నీతిఆయోగ్‌ చర్చాపత్రం తెలిపింది. 2013-14లో భారత్‌లో బహుముఖ పేదరికం (ఎండీపీ) 29.17శాతం. 2022-23లో అది 11.28శాతానికి దిగివచ్చినట్లు ఆ నివేదిక వెల్లడించింది. చిరకాలం నుంచి సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన బిమారు (బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌) రాష్టాల్లో ఎండీపీ అత్యధికంగా తగ్గిందని అది పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 5.91 కోట్ల మంది, బిహార్‌లో 3.77 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 2.30 కోట్లు, రాజస్థాన్‌లో 1.87కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి విముక్తులయ్యారని వివరించింది. పేద రాష్ట్రాల్లో ఎండీపీ వేగంగా క్షీణించి, ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషించింది. అయితే, జాతీయ బహుముఖ పేదరిక సూచీపై, నీతి ఆయోగ్‌ చర్చాపత్రం ప్రామాణికతపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేదరిక అంచనాకు ఈ సూచీని వినియోగించడం సరికాదని, దీనివల్ల ఫలితాలు సరిగ్గా ఉండవని ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ వ్యాఖ్యానించారు. పేదల కొనుగోలుశక్తిలో స్వల్పకాలిక మార్పులనూ ఈ సూచీ కచ్చితంగా అంచనా వేయలేదు. దేశంలో వాస్తవిక ఆదాయాలు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నప్పుడు, దాన్ని కాదని పేదల కొనుగోలుశక్తి పెరిగినట్లు ఎలా లెక్కించగలమని ఆయన ప్రశ్నించారు. 2014-22 మధ్య దేశ ప్రజల వినియోగ వ్యయంపై సర్వేలే జరపలేదు. అలాంటప్పుడు బహుముఖ పేదరికం తగ్గినట్లు ఎలా నిర్ధారణకు రాగలమని ఆయన నిలదీశారు. దీనికి తోడు అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్‌ స్థానం ఇటీవలి కాలంలో ఎందుకు దిగజారిందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. నిరుడు 125 దేశాల ఆకలి సూచీలో భారత్‌ 111వ స్థానంలో నిలిచింది. ఇండియా కన్నా దిగనాసిగా ఉన్నది అఫ్ఘానిస్థాన్‌, సోమాలియా, లైబీరియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ వంటి నిరుపేద దేశాలు మాత్రమే. ఈ విషయంలో భారత్‌ ర్యాంకు అంతకంతకు దిగజారుతోంది.


భారత్‌లో చివరి జనగణన 2011లో జరిగింది. తదుపరి జనగణనను 2024-25లో చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2011 తరవాత పేదరికంపై కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అసమగ్ర సమాచారం ఆధారంగానే రకరకాల లెక్కలు వెలువరిస్తున్నారు. పూర్తిస్థాయిలో మళ్ళీ జనగణన జరిపితేనే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు వెల్లడవుతాయి. 2017-18లో జాతీయ నమూనా సర్వే సంస్థ జరిపిన వినియోగ వ్యయ సర్వే ఫలితాలనూ ప్రభుత్వం విడుదల చేయలేదు. దాంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా అనేది తేలడం లేదు. అరకొర సమాచారం ఆధారంగా పేదరికం తగ్గిందని నిర్ధారించలేమని, దారిద్య్ర నిర్మూలనకు పటిష్ఠ పథకాలనూ రూపొందించలేమని 2019లో ఆర్థిక శాస్త్ర నోబెల్‌ సాధించిన అభిజిత్‌ బెనర్జీ, ఎస్తర్‌ డఫ్లో విశ్లేషించారు.


ఉద్ధృతమవుతున్న అసమానతలు

రోజువారీ సంపాదన కనీసం రూ.180 (2.15 డాలర్లు) అయినా లేనివారిని పేదలుగా పరిగణిస్తున్నారు. భారత్‌లో ఇంతకన్నా ఎక్కువ సంపాదన ఉన్నవారి సంఖ్య పెరిగిందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) తెలిపింది. ఈ లెక్కన 2015-16లో భారత జనాభాలో 25శాతంగా ఉన్న పేదల సంఖ్య 2019-20నాటికి 15శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశ జనాభాలో కేవలం అయిదు శాతం ప్రజల వద్ద 60శాతానికి పైగా దేశ సంపద పోగుపడిందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. దిగువ శ్రేణిలోని 50శాతం భారతీయుల వద్ద కేవలం మూడు శాతం సంపదే ఉంది. 2022లో 10,000 డాలర్లకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న భారతీయుల సంఖ్య కేవలం ఆరు కోట్లేనని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సంస్థ వెల్లడించింది. 72 కోట్ల మంది కేవలం 1500 డాలర్ల వార్షికాదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఆదాయాల్లో ఉంటున్న తీవ్ర వ్యత్యాసాలు భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.


స్పష్టత కరవు

ప్రపంచ దేశాలు అన్ని విధాలుగా పేదరికాన్ని నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితి ప్రథమ సుస్థిరాభివృద్ధి లక్ష్యం నిర్దేశిస్తోంది. భారత్‌లో 57శాతం జనాభాకు, అంటే 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయాల్సి వస్తోంది. కొవిడ్‌-19 దరిమిలా 2020 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకానికి పెద్దమొత్తంలో ఖర్చు అవుతోంది. ఇప్పుడు దీన్ని 2028 వరకు పొడిగించారు. 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు- దేశంలో పేదరికం తగ్గిందని ఎలా చెప్పగలం? గరీబ్‌ కల్యాణ్‌ యోజన ఉచిత వరమా లేక పేదరిక నిర్మూలన కార్యక్రమమా అనే అంశంపై స్పష్టత లేదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

‣ కాటేస్తున్న కాంతి కాలుష్యం

‣ ముందుచూపుతో తప్పిన ముప్పు

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

Posted Date: 07-02-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని