• facebook
  • whatsapp
  • telegram

చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడిప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం. భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పనిచేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించిపోతున్నాయి.


జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి 64శాతం మేర అంతరించిపోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్‌లోని రామ్సార్‌లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరవాతి నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈ ఏడాది లక్ష్యం.


ఎన్నో ప్రయోజనాలు

సముద్ర, నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పునీటి సరస్సులు, తంపర, బీల భూములు, పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19 రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీతీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని, అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాన్ని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాటిల్లే దుష్ప్రభావాలను గణనీయంగా నియంత్రిస్తాయి. అరుదైన మత్స్య, వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతో పాటు దేశ, విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి. ఈ నేలలు పరి సర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు, కాలుష్య తీవ్రతను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి. చిత్తడి నేలలు సాగు, తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి. ఈ నేలల్లో లభించే చేపల్లో పోషకాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధనలు తేల్చాయి. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్తడి నేలలు- పర్యటక ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్‌ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు. వీటిలో అత్యధికంగా 175 వరకు యూకేలోనే ఉన్నాయి. 142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది. భారత్‌ 1982లో రామ్సార్‌ ఒప్పందంలో చేరి చిత్తడి నేలల గుర్తింపును మొదలుపెట్టింది. 1982-2013 మధ్య కాలంలో 26 ప్రదేశాలను, 2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల 13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు, పులికాట్‌ సరస్సులు ఇలా గుర్తింపు పొందినవే.


రామ్సార్‌ ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్ర తాత్సారం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ, నేచురల్‌ హిస్టరీ (సాకాన్‌) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశాలకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించాలని సూచించింది. వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవిగా సాకాన్‌ పేర్కొంది. సోంపేట, నౌపడ, వాకలపూడి, బద్వేలు, కంభం, విశాఖపట్నం జిల్లాలోని కొండకర్ల ఆవ, తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని, వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది. కొల్లేరు, కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ, వాటి సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు, విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని, అక్కడి నేలలను పునరుద్ధరించడంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతున్నాయి.


సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్‌పుర్‌లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవ రూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌, కాగ్‌ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి. జాతీయ అటవీ కమిషన్‌ 2006లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శకాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలున్నాయి.


బహుముఖ చర్యలు కీలకం

కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యావరణ, అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి. చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్‌ ధరోహర్‌’ పథకాన్ని రామ్సార్‌ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు. దాన్ని మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయుక్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమూహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే- చిత్తడి నేలల విధ్వంసం నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది!


కొరవడిన సంకల్పం

చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి పరిరక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్‌హాగెన్‌ వంటి ప్రపంచస్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దురదృష్టకరం. జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రామిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు. పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కాటేస్తున్న కాంతి కాలుష్యం

‣ ముందుచూపుతో తప్పిన ముప్పు

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

Posted Date: 07-02-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని