• facebook
  • whatsapp
  • telegram

అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ



మానవాళి మనుగడ కోసం భూమిని పునరుద్ధరించడం, ఎడారీకరణను నిరోధించడం, కరవును తట్టుకొనే శక్తిని పెంపొందించడం అత్యావశ్యకం. ఈ మూడు లక్ష్యాలతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని ఐక్యరాజ్య సమితి పిలుపిచ్చింది.


ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ (యూఎన్‌ఈపీ) విభాగం 1973 నుంచి ఏటా జూన్‌ అయిదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తోంది. అనాలోచిత మానవ చర్యలవల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న అనర్థాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు పెద్దయెత్తున సామాన్యులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆధునిక జీవనశైలికి తోడు మానవాళి అవసరాల కోసం చేపడుతున్న చర్యలు భూమి, నీరు, గాలి, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇటువంటి చర్యలను కట్టడి చేయడంతో పాటు పర్యావరణ హితకరమైన సేద్య విధానాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముంది.


మానవాళికి ప్రాణాధారం

సేద్యంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అంతకంతకు పెరుగుతున్న తరుణంలో భూసారాన్ని కాపాడుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. సారం కోల్పోయిన, బీడువారిన భూములను పునరుద్ధరించుకోవడాన్ని ప్రభుత్వాలు తక్షణ కర్తవ్యంగా భావించాలి. సేంద్రియ సాగు విధానాలను అనుసరించడం, సంప్రదాయ వంగడాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను జోరెత్తించాలి. చాలామంది రైతులు అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, హానికరమైన పురుగు మందులను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. వాటివల్ల భూమి తీవ్రస్థాయిలో కలుషితమవుతోంది. మరోవైపు ఆవాసం, తవ్వకాల కోసం అడవులను పెద్దయెత్తున ధ్వంసం చేస్తున్నారు. దాంతో బంజరు భూములు పెరుగుతున్నాయి. పర్యవసానంగా ప్రకృతి ప్రసాదించే స్వచ్ఛమైన గాలి, నీరు, పండ్లు, మూలికలు వంటి అటవీ ఉత్పత్తులు పోనుపోను భావితరాలకు అందకుండా పోతున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలి.


చాలామంది పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటి వదిలేస్తున్నారు. అయితే, వాటి సంరక్షణ ముఖ్యం. ఆ మొక్కలు భారీ వృక్షాలుగా ఎదిగేలా పర్యవేక్షించాలి. గాలి, నీరు మానవాళికి ప్రాణాధారం. వాటిని వినియోగించే ప్రతి వ్యక్తీ తన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు విత్తనాలు సేకరించడం, వాటిని నాటించడం, మొక్కలు పెంచడం, సంరక్షించడం వంటి పనులు నేర్పించాలి. నీటిని పొదుపుగా వాడుకోవడం పట్లా అవగాహన కలిగించాలి. అప్పుడే, పర్యావరణ పరిరక్షణ దిశగా సమాజంలో మంచి మార్పు కనిపిస్తుంది.


దేశంలో సుమారు 40 కోట్ల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. రెక్కాడితేగాని డొక్కాడని అనేక జాతులవారు గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అడవులు బ్యాంకులో దాచిన సొమ్ము లాంటివి. అసలు మీద వచ్చిన వడ్డీని అనుభవించినంత కాలం ఏ ఇబ్బందీ ఉండదు. దాచుకున్న డబ్బులను కూడా ఖర్చుచేయడం మొదలుపెడితే నిల్వలు తగ్గిపోతాయి. అడవులకూ ఇదే వర్తిస్తుంది. తగిన ఆదాయ వనరులు లేకపోవడం వల్ల గిరిజన తెగలు అడవులమీద అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వాలు వారిని ప్రత్యామ్నాయ ఉపాధుల వైపు మళ్ళించడంతో పాటు అటవీ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలి.


మానవాళి మనుగడ కోసం..

ప్రపంచవ్యాప్తంగా ప్రజల రవాణా అవసరాలు, ఆదాయాలు పెరుగుతుండటంతో వాహనాల వినియోగం అధికమవుతోంది. పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాలను మండించడంవల్ల పెద్దయెత్తున కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి. పరిశ్రమల నుంచి విష వాయువులు, రసాయన వ్యర్థాలు భారీగా విడుదల అవుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడంవల్ల మీథేన్‌ వంటి వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇవన్నీ భూతాపం పెరుగుదలకు దారితీస్తున్నాయి. కొంతకాలంగా ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో మంచు జోరుగా కరుగుతోంది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కరవు తరహా పరిస్థితులు తలెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు దేశదేశాలు తీసుకుంటున్న చర్యలేవీ ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. ప్రభుత్వాలకు తోడు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేయాలి. సమయం మించిపోకముందే ప్రకృతిని పరిరక్షించుకోవాలి!


- దెందులూరి నళినీ మోహన్‌ 

(విశ్రాంత ఐ.ఎఫ్‌.ఎస్‌.అధికారి)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అగ్రరాజ్యం.. మారుతున్న వ్యూహం!

‣ భూగోళానికి వడదెబ్బ!

‣ ఓటరు తీర్పులో ఒదిగిన సందేశం

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

Posted Date: 05-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం