పర్యావరణం

student

ఉగ్ర గంగతో పెనుముప్పు

భారతదేశంలోని దాదాపు 50 కోట్ల ప్రజలకు గంగానది జీవనాధారం. తీవ్రస్థాయి కాలుష్యంతో పాటు రెండు దశాబ్దాలుగా నదికి పెరుగుతున్న వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని పెంచుతూ జనజీవితాల్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.  * కోర చాస్తున్న వరద సమస్య భారతదేశంలోని దాదాపు 50 కోట్ల ప్రజలకు గంగానది జీవనాధారం. తీవ్రస్థాయి కాలుష్యంతో పాటు రెండు దశాబ్దాలుగా నదికి పెరుగుతున్న వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని పెంచుతూ జనజీవితాల్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మట్టిపెళ్ళలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు తరచూ సంభవిస్తూ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మరింతగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంగా తీరంలో అడ్డగోలుగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు నది ప్రవాహరీతిని దెబ్బతీస్తూ వరదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. భూతాపం పెరగడం వల్ల నది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత దశాబ్ద కాలంలో నదీ పరివాహక ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగిన కారణంగా ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరుగుతున్నట్లు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కారణాలన్నీ కలగలిసి వరద ముప్పును పెంచుతున్నట్లు చెబుతున్నారు. కాలుష్యంతో అనర్థాలు సమీప ప్రాంతాల్లోంచి వెల్లువెత్తుతున్న పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వ్యర్థాలు గంగానదిలోకే వెళ్తున్నాయి. కాన్పుర్‌లో పెద్దసంఖ్యలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లోకి వదులుతున్నారు. నదిలోకి కలుషిత పదార్థాలను వదిలే 764 పరిశ్రమల్లో 487 కాన్పుర్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా చక్కెర కర్మాగారాలు, డిస్టిలరీలు, కాగితం పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఎక్కువగా కలుస్తున్నాయి. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వ్యర్థాలు గంగలో కలవకుండా నిరోధించడం, కలుషితంగా మారిన జలాల్ని ప్రక్షాళన చేయడం లాంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. మురుగు శుద్ధికి ప్లాంట్ల ఏర్పాటు, నదీ ఉపరితలం ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాలపై నిఘా, జీవవైవిధ్య సంరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, సమీప ప్రాంతాల్లో అడవుల పెంపకం వంటి కార్యక్రమాలను చేపట్టారు. 2014లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలను అయిదేళ్లలో, దీర్ఘకాలిక లక్ష్యాలను పదేళ్ల వ్యవధిలో సాధించాలని నిర్దేశించారు. గంగానదిని కాలుష్య రహితంగా, సమూలంగా ప్రక్షాళన చేయడానికి ముందుగా ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 1,674 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో మొత్తంగా 15.27 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని నిర్దేశించుకోగా, 8.53 లక్షలు పూర్తయ్యాయి. గంగా ప్రక్షాళన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, ఫిన్లాండ్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలూ ఆసక్తి కనబరిచాయి. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఝార్ఖండ్‌లో రూ.127 కోట్ల వ్యయంతో పలురకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలి కాలంలో గంగానదితో పాటు దాని ప్రధాన ఉపనదులైన భాగీరథి, అలకనందలలోనూ వరదల ముప్పు పెరిగింది. అలకనంద పరీవాహక ప్రాంతంలో 1995 తరవాత వర్షపాతం గణనీయంగా అధికమైంది. వర్షాకాలంతోపాటు ఇతర కాలాల్లోనూ దిగువ ప్రాంతాలకు నదీ ప్రవాహాలు భారీగా పెరిగాయి. 1995 తరవాత గంగానదితో పాటు రెండు ఉపనదులకూ వరదలు అధికం అయ్యేందుకు ప్రధాన కారణం- వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అధిక ప్రవాహాలకు కారణమవుతున్నాయి. భాగీరథిపై మనేరి, తేహ్రి, కోటేశ్వర్‌ ఆనకట్టల నిర్మాణం కొంతవరకు వరదలను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నియంత్రణకు అవకాశం అలకనంద నదీ ప్రవాహం 1995-2005 మధ్య కాలంలో దాదాపు రెట్టింపయ్యింది. ఆనకట్టలు, రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ప్రవాహంతో పాటు ఇసుక, మట్టి, రాళ్లు వంటివి దిగువకు కొట్టుకు రాకుండా అడ్డుకోవడం కొంతమేర సాధ్యమవుతుంది. ఆనకట్టలు లేకపోతే, నీటి ప్రవాహగతులు మారడం వల్ల అవి దిగువకు కొట్టుకొచ్చి, అక్కడ నీటిమట్టం పెరగడానికి కారణమవుతాయి. ప్రస్తుతం భాగీరథిపై కొత్తగా 11 ఆనకట్టల నిర్మాణ ప్రణాళికలున్నాయి. అలకనంద బేసిన్‌లో కొత్తగా 26 రానున్నాయి. వాటినుంచి ఆయా రాష్ట్రాలకు అవసరమైన జలవిద్యుత్‌ అందుబాటులోకి రావడంతో పాటు నీటి ప్రవాహ ఉద్ధృతిని అడ్డుకోవచ్చని, ఫలితంగా వరదల ప్రభావమూ తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. భారీస్థాయిలో సంభవించే వరదలను నిరోధించడం, నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి విపత్తులను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. రిషీకేశ్‌ ప్రాంతంలోని పశులోక్‌ బ్యారేజి కారణంగా అక్కడి దిగువ ప్రాంతాల్లో వరదలు గణనీయంగా తగ్గాయి. హైడ్రోలాజికల్‌ నమూనాలతో వరద ప్రవాహాలను ముందుగా అంచనా వేయవచ్చని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మానవ కార్యకలాపాల కారణంగా నదీ ప్రవాహగతులు మారిపోకుండా జాగ్రత్త పడేందుకు అందరూ తమవంతు కృషి చేయాల్సి ఉంది. అప్పుడే, వరదల నుంచి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు. - కామేశ్వరరావు

తాజా కథనాలు

మరిన్ని