• facebook
  • whatsapp
  • telegram

మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!



మడ అడవులు.. పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు. సముద్ర తీర జీవవైవిధ్యంలో వీటిదే కీలక పాత్ర. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని, వన్యప్రాణుల్ని కాపాడుతున్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి. వీటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. నేడు అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా..


ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే భూభాగాలు, నదులు సముద్రంలో కలిసే తీర ప్రాంతాల్లో మడ అడవులు ఏర్పడతాయి. అత్యధిక ఉప్పు సాంద్రత, నీటి నిల్వ ఉండి, తరచూ తుపానులు సంభవించే ప్రాంతాల్లో అలలు, ఉప్పెనల ప్రభావంతో నెలకొంటాయి. మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుపానుల తీవ్రత, వాటి వల్ల కలిగే నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలు సందర్భాల్లో తేలింది. ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. చేపలు, రొయ్యలకు ఆహారంగా మత్స్య సంపదను పెంపొందించడంలోనూ తోడ్పడుతున్నాయి. పర్యాటక పరంగానూ వేలమందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సముద్ర తీరప్రాంతంలో నీటి నాణ్యతను పెంచేందుకు దోహదపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్యానికి అండగా నిలుస్తున్నాయి. తీరప్రాంతాల్లో పలురకాల గ్రామీణ జీవనోపాధి అవకాశాలు కల్పించడంలో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి. తుపానులు, ఉప్పెనల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడుతున్నాయి. బలమైన వేళ్లతో అల్లుకుపోయిన మడ అడవులు ఆటుపోట్లకు అడ్డుగా నిలిచి భూమి కోతకు గురికాకుండా పరిరక్షిస్తున్నాయి.


నిర్లక్ష్యంతో తీరని నష్టం

తీరప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ, వన్యప్రాణుల వేట తదితర అంశాలు మడ అడవులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగంలో ఉదాసీనత పెరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ చర్యలు దుష్ప్రభావం చూపుతున్నాయి. మడ అడవులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకూ అధికమవుతోంది. తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు శాపాలుగా పరిణమిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో భూమి కోసం పెరుగుతున్న డిమాండ్‌తో పాటు మానవ ఆవాసాలు, కలప, వంట చెరకు, పశుగ్రాసం, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి అశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరిట నదుల వెంబడి జరుగుతున్న పలురకాల కార్యకలాపాలు, నదీ ప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్నిచోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. వాతావరణ సమస్యలు, ఉష్ణోగ్రతల్లో తేడాలు, నదీప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టి మేట వేయడం, కాలువల పూడిక, నీటి నిల్వతో ఉప్పుశాతం పెరిగి మొక్కలు నశించడం, మొలకలెత్తక పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు, మడ అడవులు నరికివేత ముప్పునూ ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అనేక సమస్యలపై ఎన్నో అధ్యయనాలు ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో 1.4 కోట్ల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి. ఇందులో 50 లక్షల హెక్టార్లకుపైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్స్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మడ అడవులు కావడం విశేషం. ఇవి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపును సొంతం చేసుకున్నాయి. గంగ, బ్రహ్మపుత్ర నదుల నడుమ వందకుపైగా దీవులుగా విస్తరించిన సుందర్‌బన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా గుర్తింపు పొందింది. ఇక్కడ 55 రకాల జంతువులు, 54 రకాల సరీసృపాలు, 248 రకాల పక్షులు జీవిస్తున్నాయి. వృక్ష జాతుల్లోనూ ఎంతో వైవిధ్యం కొనసాగుతోంది. రాయల్‌ బెంగాల్‌ పులులకు సుందర్‌బన్‌లే ఆవాసం. వీటితోపాటు మనదేశంలో భితర్‌కనికా, కోరింగ, పిచావరం, గుజరాత్‌ మడ అడవులూ కీలకమైనవిగా పేరొందాయి.


బహుముఖ వ్యూహాలు

మడ అడవుల సంరక్షణలో, విస్తీర్ణం పెంపుదలలో ఒడిశా రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. నదీ తీరప్రాంతాలతో పాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది. మడ అడవులు పెంచేందుకు అనువైన ప్రాంతాలన్నింటినీ సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మడ అడవులను సంరక్షించాలి. ఈ అడవుల్ని పెంచేందుకు ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఒడిశా తరహాలో విస్తరించేందుకూ కృషిచేయాలి. మడ అడవుల నిర్వహణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం కీలకం. మడ అడవుల వైవిధ్యం, ప్రత్యేకతలపై మరింత లోతుగా పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. వీటి సంరక్షణలో బహుముఖ వ్యూహాల కార్యాచరణ ఎంతో అవసరం. మడ అడవుల్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాలతోపాటు- విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, స్థానిక సంస్థలూ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.


ఏపీలో తగ్గిన విస్తీర్ణం

పలు రాష్ట్రాల్లో మడ అడవుల విస్తీర్ణం ఎంతోకొంత పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గుతుండటం ఆందోళనకరం. ఏపీలో 1987లో మడ అడవుల విస్తీర్ణం 495 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు అది 405 చదరపు కి.మీ. ఇందులో 70శాతం అంతకంటే ఎక్కువ సాంద్రత కలిగిన దట్టమైన మడ అడవుల జాడే లేదు. 213 చదరపు కి.మీ. ఒక మోస్తరు (40-70శాతం సాంద్రత) ఉన్నవి. మరో 192 చదరపు కి.మీ. 40శాతం కంటే తక్కువ సాంద్రత కలిగినవి కావడం గమనార్హం. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలోనూ మడ అడవులు విస్తరించాయి. ఏపీలోని ప్రధానమైన కోరింగ మడ అడవుల్లో 34రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా. నీటి పిల్లి (మరకపిల్లి/ ఏటిపిల్లి) అనే వన్యప్రాణితో పాటు అనేక జంతువులు, పక్షులకు ఆవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షులకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి.


- బి.ఎన్‌.జ్యోతిప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ న్యాయ దీపికలు.. నారీ అదాలత్‌లు!

‣ ప్లాస్టిక్‌ కట్టడికి సమష్టి భాగస్వామ్యం

‣ అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యం

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

Posted Date: 31-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం