• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణానికి యుద్ధ గాయాలు



యుద్ధాలు, సాయుధ ఘర్షణలు పర్యావరణానికి హానికరంగా పరిణమిస్తున్నాయి. యుద్ధాల వల్ల కలిగే ప్రాణనష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న ఉపాధులు తదితర అంశాలపైనే అందరి దృష్టి పడుతోంది. కానీ జల వనరుల కలుషితం, పంటల దహనం, అటవీ నిర్మూలన, నేలలు విషపూరితం కావడం, జంతు వధ వంటి పర్యావరణ నష్టాలను పట్టించుకోకపోవడం విచారకరం.


యుద్ధ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రకృతి వనరుల పరిరక్షణలో విఫలం కావడంతో పర్యావరణ నష్టం తీవ్రంగా ఉంటోంది. వియత్నాం యుద్ధంలో ఆ దేశ సైనికులు దాక్కోవడానికి తోడ్పడిన వర్షారణ్యాలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఆహారం అందకుండా చేయడానికి పంటపొలాలను దెబ్బతీశారు. మడ అడవులు సగందాకా నాశనమయ్యాయి. జంతువుల సహజ ఆవాసాలు కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నాయి. నేలలు నిస్సారమయ్యాయి. ప్రజలు, వన్యప్రాణుల జీవనానికి అవసరమైన ఆవరణ వ్యవస్థ సేవలు తరిగిపోయాయి. భారీయెత్తున, సుదీర్ఘకాలంపాటు సాగిన నాటి యుద్ధం కారణంగా సంభవించిన దుష్పరిణామాలను వియత్నాం నేటికీ అనుభవిస్తోంది. 


ప్రజలకు ముప్పు 

అంతర్యుద్ధం వంటి సంఘర్షణల కారణంగా తలెత్తే పర్యావరణ నష్టం కూడా తక్కువేమీ కాదు. 1990-94 మధ్య జరిగిన రువాండా అంతర్యుద్ధం ఫలితంగా జాతీయ పార్కుపై ఆధారపడిన కాందిశీకుల వల్ల భారీయెత్తున అడవులు దెబ్బతిన్నాయి. కాంగోలో రెండు దశాబ్దాలపాటు కొనసాగిన అంతర్యుద్ధంతో అంతరించే ముప్పు ఎదుర్కొంటున్న గొరిల్లాల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. యుద్ధాలు, ఘర్షణల్లో బాంబు దాడులు వన్యప్రాణులకు, జీవ వైవిధ్యానికి తీవ్ర హాని కలుగజేస్తున్నాయి. సాయుధ సంఘర్షణ మానవ, ఆస్తి నష్టాలకే కాకుండా ఆ ప్రాంతంలోని 90శాతం దాకా పెద్ద జంతువుల మరణానికి దారి తీస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. యుద్ధం వల్ల కలిగే కాలుష్యం నీరు, గాలి, నేలను కలుషితం చేస్తుంది. మనుషులు ఇతర జీవజాతుల ఆవాసాలు నివాసయోగ్యతను కోల్పోతాయి. మరోవైపు, శాంతి సమయంలో ఆయా దేశాల సైన్యాలు పెద్ద మొత్తంలో వినియోగించే శిలాజ ఇంధనాలు భూతాపానికి ప్రత్యక్షంగా కారణమవుతున్నాయి. అమెరికా సైన్యాన్ని ఒక దేశం కింద లెక్కిస్తే, ప్రపంచంలో అత్యధికంగా ఉద్గారాలను వెలువరించే దేశాల్లో 47వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అమెరికా రక్షణ విభాగం ఆ దేశ శిలాజ ఇంధనాల్లో    నలభై శాతాన్ని వాడుతుంది. చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల సైన్యాల వల్ల కలిగే ఉద్గారాల పరిమాణం భారీగానే ఉంటోంది. యుద్ధాల సమయంలో శిలాజ ఇంధన వినియోగం గరిష్ఠ స్థాయిని చేరుతుంది. బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన వాట్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం ప్రకారం, అమెరికా ఉగ్రవాదంపై చేపట్టిన యుద్ధం ఫలితంగా వాతావరణంలోకి 120 కోట్ల మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలైనట్లు అంచనా. ఇది 25.7కోట్ల కార్లు ఏటా వెలువరించే ఉద్గారాలవల్ల కలిగే భూతాపం కంటే అధికం. ఇరాక్‌పై అమెరికా బాంబుదాడితో వెలువడిన రేడియో ధార్మికత కారణంగా నేల, జల వనరులు కలుషితమయ్యాయి. 1999లో కొసావో సంఘర్షణల్లో పరిశ్రమలు బాంబుదాడులకు గురవడంతో వెలువడిన విషపూరిత రసాయనాలతో ఎన్నో ప్రాంతాలు కలుషితమయ్యాయి. రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌ నగరాల్లో భవనాలు, రోడ్లు, మౌలిక సౌకర్యాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అక్కడి గాలి కలుషితమై పీల్చడానికి కూడా పనికిరాకుండా తయారైంది. పంట పొలాలు నాశనమయ్యాయి. అడవులు దహనయ్యాయి. ఉపరితల, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. రసాయన కర్మాగారాలపై జరుగుతున్న దాడులతో ప్రమాదకర వాయువులు వెలువడి ప్రజలకు ముప్పు వాటిల్లుతోంది. 


గాజాలో నిరంతరం జరుగుతున్న బాంబుదాడులతో వాతావరణంలో ఏర్పడిన దుమ్ము పొర స్థానికులకు అనారోగ్య కారకంగా మారింది. దీనివల్ల పంటలు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. నీటి లభ్యత, వినియోగం మరింతగా తగ్గిపోయే ముప్పు నెలకొంది. ఇజ్రాయెల్, పాలస్తీనా శీతోష్ణస్థితి పరంగా ప్రపంచంలోనే అతి దుర్బల ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామికీకరణకు ముందురోజులతో పోలిస్తే, 1950-2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగాయి. అదే సమయంలో ఇజ్రాయెల్‌ పరిసర ప్రాంతాల సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలుగా ఉందని, ఈ శతాబ్దం చివరినాటికి నాలుగు డిగ్రీలకు చేరుతుందని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2050 నాటికి సముద్ర మట్టాలు పెరిగి భూప్రాంతాలు మునిగిపోతాయని ఇజ్రాయెల్‌ పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వాతావరణ మార్పుల నిరోధానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం. కానీ, ఇప్పుడక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటం విచారకరం. అఫ్గానిస్థాన్‌లో బాంబు    దాడుల కారణంగా తలెత్తిన కాలుష్యానికి తోడు... యుద్ధ వ్యర్థాలను దహనం చేయడంవల్ల ఏర్పడిన విషవాయువులు స్థానికుల్లో క్యాన్సర్లకు కారణమయ్యాయి. భారీ యుద్ధ యంత్రాలతో వాయుకాలుష్యం పెచ్చరిల్లింది. యుద్ధంతో అఫ్గాన్‌ 95శాతం మేర అడవులను కోల్పోయింది. కువైట్‌ను ఇరాక్‌ ఆక్రమించినప్పుడు, వెనుదిరిగే సమయంలో ఇరాకీ సేనలు ఆరు వందలకుపైగా చమురు బావులను తగులబెట్టడంతో పర్యావరణానికి అపార నష్టం వాటిల్లింది. 


నివారణే మార్గం 

ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ న్యాయ సంఘం 2022 మే నెలలో అంతర్జాతీయ, అంతర్గత సాయుధ సంఘర్షణలకు సంబంధించి పర్యావరణ పరిరక్షణకు 27 ముసాయిదా సూత్రాలను సిఫారసు చేసింది. వాటిపై సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారించాలని సాధారణ సభ కోరింది. యుద్ధ సమయంలో జరిగే ప్రకృతి నష్టాన్ని యుద్ధనేరంగా పరిగణిస్తేనే పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆధునిక యుద్ధ రీతులను నిషేధించవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. యుద్ధ సమయంలో పాటించాల్సిన అంతర్జాతీయ మానవీయ న్యాయ సూత్రాలైన నాలుగు జెనీవా ఒప్పందాలతో పాటు యుద్ధంవేళ పర్యావరణ రక్షణకు అయిదో జెనీవా ఒప్పందాన్నీ జోడించాలని కోరుతున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రకృతిపై జరిపే యుద్ధం ఆత్మహత్యా సదృశమని అన్ని వర్గాలూ గ్రహించాలి. మానవాళికి, పర్యావణానికి మేలు కలగాలంటే యుద్ధ నివారణే మెరుగైన పరిష్కారం.


వనరుల దోపిడి

యుద్ధాల సందర్భంగా నెలకొనే అధికార శూన్యత కారణంగా సహజ వనరులు అక్రమ దోపిడికి గురవుతాయి. అడవుల విధ్వంసం, ఆక్రమణ, కలప అక్రమ రవాణా, గనుల తవ్వకం, వన్యప్రాణుల వేట వంటివి పెచ్చరిల్లుతాయి. యుద్ధ నౌకల నుంచి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా సముద్ర ఆవాసాలు, తీర ప్రాంతాలు క్షీణిస్తాయి. మందుపాతరలతో యుద్ధం తరవాత కూడా వన్యప్రాణుల మరణాలు కొనసాగుతాయి. సహజ వనరులు, ఆవరణ వ్యవస్థలు దెబ్బతినడంతో పేదల సమస్యలు పెచ్చరిల్లుతాయి. వనరుల క్షీణతతో మహిళలు, బాలికలకు కష్టాలు పెరుగుతాయి. 


- ఎం.రామ్‌మోహన్‌ 

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

‣ పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

‣ ద్రవ్యలోటును కట్టడి చేసేదెలా?

‣ ఏఐ శకంలో కొత్త ఒరవడి

‣ డిజిటల్‌ భారత్‌పై హ్యాకింగ్‌ పంజా

Posted Date: 01-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం