• facebook
  • whatsapp
  • telegram

ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?ప్రాచీన జ్ఞానసంపద, ఆధునిక వైజ్ఞానిక దృక్పథం.. రెండింటి మధ్య సంఘర్షణ ఎప్పటినుంచో ఉన్నదే! ఏ విషయాన్నయినా వైజ్ఞానికంగా నిర్ధారించాలంటే కేవలం వాదనలు సరిపోవు. వైజ్ఞానిక శాస్త్రంలో ఒక సత్యాన్ని నిరూపించేందుకు ప్రయోగమే ప్రామాణికం. సమష్టి కృషితో సునిశిత పరిశీలన చేపట్టడమే కీలకం.


ఇటీవలి కాలంలో ప్రాచీన భారత విజ్ఞానం తరచూ చర్చనీయాంశమవుతోంది. ఇందులో రెండు పరస్పర విరుద్ధమైన దృక్పథాలు వ్యక్తమవుతుంటాయి. మొదటి దృక్పథం ప్రకారం, ప్రాచీన భారతంలో గొప్పదైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఉండేదని చెబుతుంటారు. రామాయణంలో పుష్పక విమానం వైమానిక శాస్త్ర పురోగతికి నిదర్శనం. కుండల్లో పుట్టిన కౌరవులు టెస్ట్‌ట్యూబ్‌ బేబీలు. వినాయకుడి కథలో ఏనుగు తలను, మానవ శరీరానికి అతికించడం ప్లాస్టిక్‌ సర్జరీ నైపుణ్యానికి తార్కాణం. ఇలాంటి ఉదాహరణలు చూపుతూ ప్రాచీన కాలం ఘనతను వివరిస్తుంటారు. ఇక రెండో దృక్పథం దీనికి పూర్తిగా వ్యతిరేకం. అది పురాణేతిహాసాల్లో చెప్పిన కథలన్నీ నిజంగా జరిగాయని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తుంది. అవన్నీ నిజంగా జరిగి ఉన్నట్లయితే అలాంటి మహాత్మ్యాలన్నీ చేసి చూపించాలని నిలదీస్తుంది. నిరూపించే సందర్భాలేమీ లేవు కాబట్టి భారతీయ ప్రాచీన విజ్ఞానంలో పేర్కొనే అద్భుతాలన్నీ నేతి బీరకాయలో నెయ్యిలాంటివంటూ కొట్టిపారేస్తుంది. ఇలా రెండు పరస్పర విరుద్ధ వాదనలు ఉన్నప్పుడు, చిరకాలంగా విషయం ఎటూ తేలక ఇరుపక్షాలు ఘర్షణ పడుతున్నప్పుడు, రెండు పక్కలా కేవలం అర్ధసత్యమే ఉందనిపిస్తుంది. ఆ రెండు అర్ధసత్యాలను కలిపి పూర్ణసత్యాన్ని ఆవిష్కరించాలంటే, రెండు దృక్పథాలను సమన్వయపరచే దృక్పథాన్ని మరింత ఉన్నత స్థాయిలో శోధించి సాధించాలి.


ప్రయోగమే గీటురాయి

ప్రాచీన భారతంలో పైన చెప్పుకొన్న ఉదాహరణలను బట్టి, గొప్ప విజ్ఞానం ఉండేదన్న వాదనను ఖండించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక భౌతిక ఫలితాన్ని వైజ్ఞానిక సత్యంగా అంగీకరించాలంటే అది ‘పునరుత్పాదక శక్యత’ అనే పరీక్షలో నెగ్గాలి. అంటే ఆ ప్రయోగాన్ని ఎన్నిసార్లు చేసినా అదే ఫలితం రావాలి. మనిషికి ఏనుగు తలలు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. మట్టి కుండల్లో పిండాల్ని పెంచలేకపోతున్నాం. కాబట్టి భారతీయ ప్రాచీన విజ్ఞానం అనేది భ్రమ మాత్రమేనంటూ ఆధునిక వైజ్ఞానిక ప్రమాణాలను చూపుతూ కొట్టిపారేయవచ్చు. ప్రాచీన భారత విజ్ఞానం గొప్పదనాన్ని సామాన్య ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కొంతమంది సంచలనాత్మక ప్రకటనలు చేసిన మాట నిజమే. అయితే దానివల్ల మేలుకన్నా కీడే ఎక్కువగా జరిగిందని అనిపిస్తుంది. అలాంటి అశాస్త్రీయ ప్రకటనలు మొత్తం ప్రాచీన భారత విజ్ఞానం చెల్లుబాటునే ప్రశ్నార్థకంగా మార్చేలా చేశాయి. ఫలితంగా ప్రాచీన భారత విజ్ఞానం గురించి ఎవరేం మాట్లాడినా, దాన్ని ఏ శాస్త్ర విచారణా లేకుండా ఖండించడమో, పైపైన విచారణ చేసి ఖండించడమో ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు భరద్వాజ వైమానిక శాస్త్రం అనే సంస్కృత గ్రంథంలో ప్రాచీన భారతంలో విమానాల నిర్మాణం గురించిన వర్ణన ఉంది. 1974లో ఐఐఎస్‌సీకి చెందిన ఎయిరోనాటికల్‌ ఇంజినీర్ల బృందం ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి, అందులోని పరిభాష దగ్గర నుంచి ఎన్నో అంతుతేలని ప్రశ్నలు ఉన్నాయని, అందులో ఇచ్చిన సూచనల ప్రకారం నిర్మించిన వాహనం ఎగిరే అవకాశం లేదని కొట్టిపారేసింది. అయితే 2017లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ట్రావిస్‌ టైలర్‌ అనే ఎయిరోస్పేస్‌ ఇంజినీరు వైమానిక శాస్త్రాన్ని పరీక్షకు పెట్టదలచుకున్నారు. ఐఐఎస్‌సీ బృందం తరహాలో మొత్తం పుస్తకంపై ఏకబిగిన దాడి చెయ్యకుండా, అందులో ఒక చిన్న అంశాన్ని మాత్రం పరిశోధించాలని భావించారు. పుస్తకంలో పేర్కొన్న సూచనల ప్రకారం ఒక విమానం నమూనా తయారు చేసి దానికి పలురకాల పరీక్షలు చేపట్టారు. ఉద్ధృత వాయు ప్రవాహానికి గురిచేసినా ఆ నమూనా తొణకకుండా స్థిరంగా ఉందని, కొద్దిగా మెరుగుదలను కూడా ప్రదర్శించినట్లు ఆ ప్రయోగంలో వెల్లడైంది. ఈ రెండు ఉదంతాలను బట్టి మనకొక విషయం అర్థం కావాలి. ఒక విషయాన్ని వైజ్ఞానికంగా పరిశీలించాలంటే పైపైన చేసే వాదనలు సరిపోవు. వైజ్ఞానిక శాస్త్రంలో ఒక సత్యాన్ని నిర్ధారించాలంటే అందుకు ప్రయోగమే గీటురాయి. ఒక్క సునిశిత ప్రయోగం శతకోటి వాదనలకు సమానం. 


సమష్టి కృషి

ఆధునిక వైజ్ఞానిక మూల భావనలు, ప్రాచీన భారత విజ్ఞానానికి సంబంధించిన మూల భావనలు పూర్తిగా వేర్వేరు అనిపిస్తుంది. ఉదాహరణకు ప్రాచీన భారత విజ్ఞానంలో విశ్వమంతా పంచభూతాత్మకం అంటారు. పంచభూతాలు అంటే మట్టి, నీరు, అగ్ని మొదలైనవి. ఈ ప్రాథమిక అంశాలతోనే విశ్వంలోని ప్రతి వస్తువూ నిర్మితమైందని చెబుతారు. కానీ మట్టి, నీరు, అగ్ని అనేవి ఆధునిక వైజ్ఞానిక దృష్టిలో చాలా సంకీర్ణ పదార్థాలు. మరి వాటిని మౌలిక తత్వాలుగా మన ప్రాచీనులు ఎందుకు పరిగణించారు? బహుశా మట్టి, నీరు అనే పరిభాషను ప్రాచీనులు కేవలం ప్రతీకాత్మకంగా వాడారేమో? మరయితే, వాటి అసలు అర్థం ఏమిటి? పంచభూతాలు అనే భావన అర్థం కాకపోతే, ప్రాచీన భారత విజ్ఞానానికి సంబంధించిన ఇతర శాఖలూ సరిగ్గా అర్థం కావు. ఆయుర్వేదంలో త్రిదోషాలు (వాతం, పిత్తం, కఫం) అనే భావన ఉంటుంది. త్రిదోషాలు పంచభూతాల నుంచి వచ్చాయంటారు. పంచభూతాలంటే ఏమిటో తెలుసుకోకుండా త్రిదోషాలను అర్థం చేసుకునేదెలా? పంచభూతాలు అనే స్థూలాంశాల వెనక, తన్మాత్రలు అనే సూక్ష్మాంశాలు కూడా ఉంటాయంటారు. ఈ సూక్ష్మాంశాలకు మన ఇంద్రియాల క్రియలకు దగ్గరి సంబంధం ఉందని చెబుతారు. ఇది ఇంద్రియాల క్రియలను శోధించే ఆధునిక న్యూరోసైన్స్‌ ప్రకారం పూర్తిగా అర్థరహితం. అయితే ఇలాంటి అంశాలను తేలికగా కొట్టిపారేయకుండా ప్రాచీన భారత విజ్ఞానానికి సంబంధించిన పరిభాషను లోతుగా, ఓపికగా శోధించాలి. సునిశిత ప్రయోగాలతో నిజానిజాలు తేల్చాలి. ఇందుకోసం సంస్కృతం, సైన్స్‌ తెలిసిన నిపుణులు చేతులు కలపాలి. బహుళ శాస్త్రీయ కృషికి తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక పరిశోధన సంస్థలు ఏర్పడాలి. సమష్టి కసరత్తుతో ప్రాచీన భారత విజ్ఞాన గ్రంథాల్లో దాగిన శాస్త్ర సాంకేతిక రహస్యాలు అవగతం కావచ్చు. ఫలితంగా, ఆధునిక విజ్ఞానంలో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశించవచ్చు.


లోతుగా అధ్యయనం

ప్రాచీన భారత విజ్ఞానం ఒక మహాసముద్రం. అందులో ఒక్కొక్క బొట్టునే తీసుకుని, దానికి సంబంధించిన సత్యాన్ని తేల్చుకునే లక్ష్యంతో సునిశితమైన, తెలివైన ప్రయోగాలు చేపట్టాలి. అలాంటి ప్రయోగాలు చెయ్యాలంటే ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చెయ్యాలి. ప్రాచీన విజ్ఞానంలో పరిభాషకు, మౌలిక భావనలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

‣ ద్రవ్యలోటును కట్టడి చేసేదెలా?

‣ ఏఐ శకంలో కొత్త ఒరవడి

‣ డిజిటల్‌ భారత్‌పై హ్యాకింగ్‌ పంజా

Posted Date: 28-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం