• facebook
  • whatsapp
  • telegram

నైపుణ్య యుక్తితో యువ‘శక్తి’!

51.25 శాతానికి పెరిగిన ఉద్యోగార్హత- 2024 నివేదిక 



దేశ యువతలో ఉద్యోగార్హత 51.25 శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక- 2024 వెల్లడించింది. కానీ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు మాత్రం ఇప్పటికీ మన యువతకు సరిగ్గా అలవడలేదని వెల్లడించింది. 2047 కల్లా వికసిత భారత్‌ సాకారం కావాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధికి తగిన పెట్టుబడులు, శిక్షణ సౌకర్యాలను పెంపొందించాలి. తద్వారా యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి.


దేశంలో నిరుద్యోగిత రేటును అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) చేపట్టే నియతకాల కార్మికశక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 జులై-సెప్టెంబరు కాలంలో దేశంలో నిరుద్యోగిత 7.2శాతం. 2023లో అదే త్రైమాసికంలో నిరుద్యోగిత 6.6శాతానికి తగ్గినట్లు పీఎల్‌ఎఫ్‌ఎస్‌ వెల్లడించింది. 15-29 ఏళ్ల వయస్కుల్లో గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత 2022-23లో 10శాతానికి దిగివచ్చింది. 2017-18లో అది 17.8శాతంగా ఉండేది. గడచిన ఆరేళ్లలో మహిళా కార్మిక భాగస్వామ్యం 24శాతానికి పెరిగింది. అయినప్పటికీ, పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగిత ఎక్కువగానే ఉంటోంది.


వృత్తివిద్యపై నిర్లక్ష్యం వల్లే...

భారతీయ కార్మికుల్లో 90శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వారికి సరైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండవు. దేశంలో ఉన్నత విద్యార్హతలు కలిగినవారిలోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటోంది. దాంతో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం 2015లో ప్రారంభించిన ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమం ఏం సాధించిందనే ప్రశ్న తలెత్తుతోంది. 2000 సంవత్సరం వరకు వృత్తివిద్య, శిక్షణలపై భారత్‌ అంతగా శ్రద్ధ చూపలేదు. 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో మాత్రమే మొట్టమొదటిసారి నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. ఇప్పటికీ పరిశ్రమలు, సేవా రంగాల్లోని సిబ్బందికి పూర్తిస్థాయిలో వృత్తి విద్యా శిక్షణ లభించడం లేదనేది వాస్తవం. 2022-23లో దేశవ్యాప్తంగా వృత్తివిద్యలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య కేవలం 2.10 కోట్లు. అదే దక్షిణ కొరియాలో 96శాతం కార్మికులకు, జపాన్‌లో 80శాతం, అమెరికాలో 52శాతం కార్మికులకు వృత్తి విద్యా శిక్షణలు లభించాయి. ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాలో 11,300 వృత్తి విద్యా శిక్షణాలయాలు ఉన్నాయి. అవి ఏటా 3.88 కోట్ల మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారిలో ఏడాదికి కోటి మంది పట్టభద్రులవుతున్నారు. భారత్‌లో 2009లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం... 2015లో నరేంద్ర మోదీ హయాములో కౌశల్‌ భారత్‌ (స్కిల్‌ ఇండియా)గా రూపాంతరం చెందింది. 2014లో నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అది జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌(ఎన్‌ఎస్‌డీఎం)ను చేపడుతోంది. ఈ శాఖ ఛత్రం కిందనే జాతీయ నైపుణ్యాభివృద్ధి ఏజెన్సీ (ఎన్‌ఎస్‌డీఏ), జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ (డీజీటీ) పనిచేస్తున్నాయి. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన, జాతీయ అప్రెంటిస్‌ ప్రోత్సాహక పథకాలన్నీ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో అంతర్భాగాలే.


కేంద్రం 2015లో జాతీయ నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు- 2022కల్లా 40 కోట్ల మందికి నైపుణ్యాలు నేర్పించాలని లక్షించారు. వారిలో 30 కోట్ల మందికి ముందస్తు అభ్యసన ధ్రువీకరణ (ఆర్‌పీఎల్‌) పత్రాలు ఇవ్వాలని భావించారు. ఆర్‌పీఎల్‌ అనేది ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనలో ముఖ్యభాగం. దేశంలోని వ్యవసాయేతర కార్మికశక్తిలో 95శాతం అసంఘటిత రంగంలోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆర్‌పీఎల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంవల్ల వారు మెరుగైన జీతభత్యాలను అందుకోగలుగుతారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ శిక్షణ కేంద్రాల్లో స్వల్పకాలిక తర్ఫీదు ఇవ్వడం నైపుణ్య భారత్‌ సాధనకు కొంత ఉపకరిస్తుంది. పాఠశాల, కళాశాల విద్యను మధ్యలోనే విరమించినవారికి, నిరుద్యోగులకు ఈ స్వల్పకాలిక శిక్షణ అక్కరకు వస్తుంది. శిక్షణ కేంద్రాల్లో సాఫ్ట్‌స్కిల్స్, వ్యవస్థాపకత, ఆర్థిక, డిజిటల్‌ పరిజ్ఞానాలను బోధిస్తారు. తర్ఫీదు పూర్తయిన వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 2024 తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్రం ఎన్‌ఎస్‌డీఎం ద్వారా 1.4 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో 54 లక్షల మందికి పునఃశిక్షణ ద్వారా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచినట్లు వివరించింది. కానీ, ఆ లెక్కలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంటున్నాయంటున్నారు.


అనుసంధానమే కీలకం...

భారతదేశ సాంకేతిక, వృత్తివిద్య, శిక్షణ వ్యవస్థలో ప్రధాన లోపం- దానికి పరిశ్రమలతో అనుసంధానత లేకపోవడం. ఉన్నత పాఠశాల దశ నుంచే విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో వృత్తివిద్య, శిక్షణ అందించాలి. శిక్షణ కాంట్రాక్టులు పొందిన సంస్థలు, వ్యక్తుల అర్హతపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) 2015లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది అభ్యర్థులు శిక్షణ పూర్తికాకముందే మధ్యలో మానేస్తున్నారని, ప్లేస్‌మెంట్లు చాలా తక్కువగా ఉంటున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం 2022లో నివేదించింది. దేశ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విషయంలో జర్మనీ అనుభవం నుంచి చాలానే నేర్చుకోవాలి. అక్కడ హైస్కూలు చదువు పూర్తికాగానే రెండు మూడేళ్లపాటు వృత్తివిద్యలో శిక్షణ పొందే వెసులుబాటు ఉంది. సిద్ధాంతం, ఆచరణల మేళవింపుతో కూడిన ‘చేస్తూ నేర్చుకొనే’ పద్ధతిని జర్మనీ విద్యావిధానం అనుసరిస్తోంది. దాదాపు 350 రకాల వృత్తుల్లో శిక్షణ పొందే సౌలభ్యం అక్కడి విద్యార్థులకు లభిస్తోంది. జర్మనీ ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు అందిస్తే... కార్పొరేట్‌ సంస్థలు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన బాధ్యతలను చేపడుతున్నాయి. అటువంటి పద్ధతిని భారతదేశమూ అనుసరించాలి.


అరకొర శిక్షణతో ప్రయోజనమెంత? 

దేశంలో చాలామందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినప్పటికీ, తర్ఫీదుకాలం మరీ తక్కువగా ఉండటం పెద్ద లోపం. కొందరికైతే కేవలం పది రోజులే శిక్షణ ఇచ్చారు. ఆరు నెలలకన్నా తక్కువ కాలం శిక్షణ పొందినవారి సంఖ్య 2017-18లో 22శాతం. అది ఇప్పుడు 37శాతానికి పెరిగింది. రెండేళ్లు, అంతకుమించి తర్ఫీదు పొందినవారి సంఖ్య 14.29 శాతమే. అరకొర తర్ఫీదు వల్ల యువతకు ఉపాధి లభించదు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద శిక్షణ పొందినవారిలో 54 శాతానికి ప్లేస్‌మెంట్లు లభించాయని కేంద్రం చెబుతోంది. వాస్తవంలో అలా శిక్షణ పొందిన 1.24 కోట్ల మందిలో 22శాతానికే ఉపాధి అవకాశాలు లభించాయని ఆర్థికవేత్తలు సంతోష్‌ మెహరోత్రా, హర్షిల్‌ శర్మల తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ప్రధానమంత్రి కౌశల్‌ యోజన నాలుగో దశకు బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించారు. మొదటి దశతో పోలిస్తే ఈ కేటాయింపులు అంతకంతకు తగ్గిపోతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?

‣ చైనా విస్త‘రణం’... శాంతికి అవరోధం

‣ సత్వర న్యాయం సాకారమవుతుందా?

‣ జన విస్ఫోటం... సమస్యలకు మూలం!

‣ ఆయుధ స్వావలంబన కోసం...

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

Posted Date: 08-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని