• facebook
  • whatsapp
  • telegram

ఆయుధ స్వావలంబన కోసం...ఆయుధ రంగంలో భారత్‌ వేగంగా ముందడుగు వేస్తోంది. మన ఆయుధాల నాణ్యతపైన, మన సాంకేతిక సత్తా మీద అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం పెరుగుతోంది. క్షిపణులు, యుద్ధ నౌకలు, విమానాలు, డ్రోన్ల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. విదేశీ కంపెనీల సహకారమూ అందివస్తోంది. ఈ క్రమంలో నాణ్యతే ప్రధానంగా ఎగుమతులపై దృష్టి సారించాలి. 


స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ వలస పాలనలో భారత్‌ తన రక్షణ కోసం ఆయుధ దిగుమతులపై ఆధారపడక తప్పలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరవాతా చాలావరకు ఆ పరిస్థితే కొనసాగింది. అయితే స్వీయరక్షణ కోసం పూర్తిగా విదేశీ ఆయుధాల మీదనే ఆధారపడకూడదని, సొంతంగా ఉత్పత్తి చేపట్టాలని భారత్‌కు తెలుసు. అంతర్జాతీయ రాజకీయాలు, సాంకేతిక మార్పులు రక్షణ రంగంలో స్వావలంబన ఆవశ్యకతను బలంగా ముందుకుతెచ్చాయి. అందుకే స్వతంత్ర భారతం ఆయుధోత్పత్తికి ప్రభుత్వ రంగంలో హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్‌ వంటి సంస్థలతోపాటు యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటుచేసింది. తుపాకులు, మందుగుండు తయారీకి ఫ్యాక్టరీలను స్థాపించింది. క్రమంగా చిన్న ఆయుధాలు, క్షిపణులు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, ఎలెక్ట్రానిక్‌ యుద్ధ యంత్రాంగాలను నిర్మించసాగింది. ఇది చాలదని, అత్యాధునిక ఆయుధాల తయారీ చేపట్టాలని భారత్‌ గ్రహించింది. కార్గిల్‌ యుద్ధం తరవాత కొత్త ఆయుధ కర్మాగారాలను నెలకొల్పారు. ఉన్నవాటిని విస్తరించారు. గడచిన పదేళ్లలో భారత్‌లో తయారీ పథకాన్ని చేపట్టారు. రక్షణ రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఆయుధ రంగంలో స్వావలంబన సాధించడంతోపాటు దేశాన్ని అంతర్జాతీయ ఆయుధోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించారు. విదేశీ రక్షణ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుని భారత్‌లో హెలికాప్టర్‌ విడిభాగాలు, యుద్ధ విమానాలు తదితరాలను తయారు చేస్తున్నారు. 


ప్రైవేటు భాగస్వామ్యం 

ప్రభుత్వం కొత్త రక్షణ సేకరణ విధానాన్ని(డీపీపీ) రూపొందించింది. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రక్షణ రంగంలో ఇంతవరకు ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీఓ మాత్రమే ఆర్‌ అండ్‌ డీ చేపట్టేది. ప్రైవేటు సంస్థలు ఆయుధోత్పత్తితోపాటు కొత్త ఆయుధాల రూపకల్పనకు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికోసం నవకల్పనలతో రక్షణ రంగంలో విశిష్టత (ఐడెక్స్‌) పథకం, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి (టీడీఎఫ్‌)ని ప్రారంభించింది. అయితే, ఈ రంగంలో ఇప్పటికీ కొన్ని సమస్యలను అధిగమించాల్సి ఉంది. అధికారులు, ఉద్యోగుల గణం నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం జరుగుతుండటంతో రక్షణ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మౌలిక వసతుల కొరతనూ అధిగమించాలి. అధునాతన ఆయుధాల తయారీకి సరికొత్త సాంకేతికతలను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవలసి ఉంది. ఈ సాంకేతికతలన్నీ స్వదేశంలో అందుబాటులో ఉండవు. ఇతర దేశాలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకుని సముపార్జించుకోకతప్పదు. భారత రక్షణ పరిశ్రమలు ఈ సవాళ్లను, సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తున్నాయి. భారతీయ పరిశ్రమలు డిజిటల్‌ మార్గంలోనూ రక్షణ ఎగుమతులను పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ ఏరోస్పేస్, రక్షణ మార్కెట్‌ పరిమాణం 2022లో 75,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అది 2030కల్లా 1,38,800 కోట్ల డాలర్లకు పెరగనుంది. అందులో 13,800 కోట్ల డాలర్ల ఆర్డర్లను 2024-2032 మధ్య కాలంలో సంపాదించడానికి భారత్‌ కృషి చేయవచ్చు. నేడు ప్రపంచమంతటా ఆధునిక ఆయుధాలు, పరికరాలు, సాంకేతికతలకు గిరాకీ పెరుగుతోంది. భారత్‌లో ఆయుధోత్పత్తిలో, శక్తిమంతమైన కొత్త ఆయుధాల రూపకల్పనకు ఆర్‌ అండ్‌ డీలో నిమగ్నమైన కంపెనీలకు ఇది వరంగా మారుతుంది. 2030 ఆర్థిక సంవత్సరానికల్లా మొత్తం బడ్జెట్‌లో రక్షణపై పెట్టుబడి వ్యయం 37శాతానికి చేరుతుందని అంచనా. ఇది 2025లో 29శాతంగా ఉండవచ్చు. భారత ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద స్వదేశీ ఆయుధాల ఉత్పత్తికి అమిత ప్రాధాన్యమివ్వడమే దీనికి కారణం. 


వేగంగా అడుగులు

పొరుగున చైనా అంతకంతకు అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటూ పాకిస్థాన్‌నూ భారత్‌కు పోటీగా తయారు చేయాలని చూస్తోంది. డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ దేశానికీ తీసిపోని విధంగా భారత్‌ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకోవాలి. అందుకే ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలతో భారత్‌ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాలను కుదుర్చుకొంటోంది. భారత్‌ ఆయుధోత్పత్తిలో పెద్ద ముందడుగు వేసినా- ప్రధాన దేశాలతో పోలిస్తే సాంకేతిక పరంగా ఇంకా ఎంతో ఎదగాల్సి ఉంది. అందుకే రక్షణ పరిశోధన-అభివృద్ధికి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మిత్ర దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా, ఫ్రెంచి కంపెనీలు యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికితోడు స్వావలంబన సాధన యత్నాలను భారత్‌ పట్టువిడవకుండా కొనసాగిస్తోంది. మనదేశానికి పొరుగున్న ఒక పెద్ద దేశం నాసిరకం ఆయుధాలు, విడిభాగాలను సరఫరా చేస్తోందంటూ ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడం ఇండియాకు వరంలా పరిణమించనుంది. ఇదే అదనుగా నాణ్యమైన ఆయుధాలను రూపొందించి ఎగుమతులను పెంచుకోవడానికి భారత్‌ వేగంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. 


75 దేశాలకు అస్త్రాలు

భారత్‌ ప్రస్తుతం 75 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. ఆర్మీనియాకు క్షిపణులను సరఫరా చేసి వార్తలకెక్కింది. బ్రహ్మోస్‌ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసింది. ఆఫ్రికా దేశాలకు చిన్న ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రక్షణ ఎగుమతుల విలువ రూ.21,083 కోట్లు. 2004-14 మధ్య కాలంతో పోలిస్తే, 2014-24 మధ్య ఆయుధాలు 21 రెట్లు అధికంగా ఎగుమతి అయ్యాయి. సులభతర వాణిజ్యం వంటి విధానపరమైన సంస్కరణలే భారతదేశ రక్షణ ఎగుమతుల వృద్ధికి తోడ్పడ్డాయి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

‣ ఎగుమతుల కలిమి... సేద్యానికి బలిమి!

‣ వేడెక్కుతున్న భూగర్భ జలాలు

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

Posted Date: 29-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని