• facebook
  • whatsapp
  • telegram

వేడెక్కుతున్న భూగర్భ జలాలుభూతాపం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దాని ప్రభావానికి భూగర్భ జలాలు సైతం క్రమంగా వేడెక్కుతున్నాయంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతకంతకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను నియంత్రిస్తేనే మానవాళి మనుగడ సురక్షితమవుతుంది.


భూగర్భ జలాలు నేల లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఉపరితలంపై సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం వాటిపై అంతగా ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు సైతం క్రమంగా వేడెక్కుతున్నాయి. అంతకంతకు అధికమవుతున్న ఉష్ణోగ్రతలు భూగర్భంలోకి చొచ్చుకుపోతున్నాయి. దాంతో వాటి ప్రభావం అక్కడి జలాలపైనా ఉంటోంది. ఈ శతాబ్ది చివరి నాటికల్లా అవి రెండు నుంచి 3.5 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కుతాయని అంచనా. 2000 సంవత్సరంతో పోలిస్తే 2100 నాటికి భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు 2.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జర్మనీ, బ్రిటన్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. తాగునీటి ఉష్ణోగ్రతలకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లోనే మార్గదర్శకాలు ఉన్నాయి.


ఎన్నో అనర్థాలు...

శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మధ్య రష్యా, ఉత్తర చైనా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలతోపాటు దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ వర్షాధార అడవుల్లోనూ భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగవచ్చని భావిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలకు భూగర్భ జలాలే ప్రధాన తాగునీటి వనరులు. వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు సైతం అత్యధికంగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భూమి లోపలి నీరు వేడెక్కితే దానిపై ఆధారపడిన వ్యవస్థలు ప్రభావితమవుతాయి. భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల లోహాలు, వాటి మిశ్రమాలు నీటిలో కలుస్తాయి. వ్యాధికారక సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. వేడెక్కిన నీటిలో ఆక్సిజన్‌ శాతం కనీస స్థాయికి పడిపోతుంది. నీటి నాణ్యత తగ్గుతుంది. భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల వాటిపై ఆధారపడిన పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. నీటి ఆవరణ వ్యవస్థపై ఆధారపడిన చేపలు, ఇతర జీవజాతులు ఇప్పటికే నదులు, సరస్సుల్లో ఆక్సిజన్‌ తగినంతగా లేకపోవడంవల్ల పెద్దయెత్తున మృత్యువాత పడుతున్నాయి. వేడెక్కిన భూగర్భ జలాలు ఉపరితల నీటి వనరుల్లో కలవడంవల్ల సూర్యుడి నుంచి వచ్చే వేడిమిని కూడా గ్రహిస్తాయి. దాంతో అవి మరింతగా ప్రభావితమవుతాయి. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలోని ముర్రే-డార్లింగ్‌ నదీ పరీవాహక ప్రాంతంలో సామూహికంగా చేపలు మరణించడం పెరుగుతున్న ఉష్ణోగ్రతల దుష్పరిణామాలకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి నిర్దేశిత ప్రమాణాలకన్నా ఎక్కువగా వేడెక్కిన భూగర్భ జలాలకు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రభావితమవుతారని అంచనా. స్విట్జర్లాండ్‌లోనూ ఈ దిశగా కొన్ని పరిశోధనలు జరిగాయి. భూతాపం ప్రభావం నేరుగా భూమిలోపలి నీటివనరులపైనా ప్రతిబింబిస్తుందని స్విట్జర్లాండ్‌లోని జియోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గత నలభై ఏళ్లలో భూ ఉపరితలం నుంచి దాదాపు 60 మీటర్ల లోతువరకు ఉన్న భూగర్భ జలాలు గణనీయంగా వేడెక్కినట్లు తేలింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమిలోని నీటి ప్రవాహాలు సహజంగానే వేడెక్కుతున్నట్లు స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు విశ్లేషించారు.


లోతైన అధ్యయనం

భూగర్భ జలాలు వేడెక్కుతున్న తీరు, స్థానికంగా వాటి ప్రభావం తదితర అంశాలపై లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయో తెలిస్తే దీని తాలూకు భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేయవచ్చు. తద్వారా అలాంటి ప్రభావాలను తగ్గించుకునే వీలుంటుంది. భూగర్భ జలాలు వేడెక్కే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, పారిశ్రామిక, ప్రజారోగ్య, తాగునీటి వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. భారత్‌లోనూ ఈ దిశగా సమగ్ర అధ్యయనం చేపట్టడం ముఖ్యం. పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న భూతాపాన్ని కట్టడి చేయడం ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా, వేడెక్కకుండా నివారించడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించాల్సిందే. అప్పుడే కోట్లమంది ప్రజలకు ప్రధాన వనరైన భూగర్భ జలాల సంరక్షణ సాధ్యమవుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

‣ ఏకాకిని కాదంటున్న పుతిన్‌

‣ స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

Posted Date: 26-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని