• facebook
  • whatsapp
  • telegram

ఏకాకిని కాదంటున్న పుతిన్‌



ఇటీవలి జీ7 సదస్సు, స్విట్జర్లాండ్‌ శాంతి సాధన సభ ఉక్రెయిన్‌ విషయంలో రష్యాను దోషిగా చిత్రీకరించి అంతర్జాతీయ సమాజం నుంచి దాన్ని వెలివేయాలని యత్నించాయి.  భారత్, చైనా సహా పలు దేశాలు అందుకు కలిసిరాలేదు. మరోవైపు పుతిన్‌ తాజాగా ఉత్తరకొరియా, వియత్నామ్‌లలో పర్యటించడం చర్చల్లో నిలిచింది.


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా లోపాయికారీ మద్దతు ఇస్తోందని ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సు తప్పుపట్టింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం అందించడంతోపాటు రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయాలని అది నిశ్చయించింది. రష్యా, చైనాలు జీ7లో సభ్యులు కావు. ఫ్రాన్స్, అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడాలు జీ7 సభ్య దేశాలు. ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్‌ నిర్వహించిన సదస్సు సైతం రష్యాకు వ్యతిరేకంగా సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సభకు రష్యా హాజరుకాలేదు. చైనాను ఆహ్వానించినా డుమ్మా కొట్టింది. భారత్‌ రెండు సభల్లో పాల్గొన్నా రష్యా వైఖరిని ఖండించలేదు. వియత్నాం సైతం స్విస్‌ సభకు హాజరుకాలేదు. ఇంతకుముందు ఉక్రెయిన్‌ సమస్యపై రష్యాను తప్పుపడుతూ ఐరాస చేసిన నాలుగు తీర్మానాలపై వియత్నాం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఉత్తర కొరియా బాహాటంగానే సమర్థిస్తోంది.


భాగస్వామ్య ఒప్పందం

అమెరికా, ఐరోపా దేశాలు తనను ఏకాకిని చేయలేకపోయాయని చాటడానికి రష్యా అధినేత పుతిన్‌ గత నెలలో చైనాను సందర్శించారు. తాజాగా ఉత్తర కొరియా, వియత్నాం పర్యటనలను చేపట్టారు. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధ నేరాలకు పుతిన్‌ బాధ్యుడని, ఆయన తమ గడ్డపై కాలుమోపితే సభ్యదేశాలు అరెస్టు చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) చేసిన తీర్మానం ఆయన పర్యటనలకు అడ్డంకిగా మారలేకపోయింది. ఉత్తర కొరియా, వియత్నామ్‌లతోపాటు భారత్, చైనా సైతం ఐసీసీ తీర్మానంపై సంతకాలు చేయలేదు. పుతిన్‌ పర్యటనలో ఉత్తర కొరియా, రష్యాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదరడం విశేషం. తమ ఇద్దరిలో ఎవరిపైనైనా శత్రుదేశం దాడికి దిగితే రష్యా, ఉత్తర కొరియాలు పరస్పరం సైనిక సహాయం చేసుకోవాలన్నది ఈ ఒప్పంద సారాంశం. దీంతో ఉత్తర కొరియా దాయాది అయిన దక్షిణ కొరియా మండిపడింది. అమెరికా, జపాన్‌లతో సైనిక సహకారాన్ని మరింత బలపరచుకుంటామని, ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం చేసే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. జపాన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేయగా, అమెరికా ఏమీ వ్యాఖ్యానించలేదు. రష్యా, ఉత్తర కొరియా ఒప్పందం ఆ రెండు దేశాల వ్యవహారమని చైనా పేర్కొంది. పుతిన్‌ మాదిరిగానే ఉత్తర కొరియా అధినేత కిమ్‌పైనా అంతర్జాతీయ ఆంక్షలు విధించాలని దక్షిణ కొరియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి అవసరమైన ఫిరంగి గుళ్లు, క్షిపణులను రష్యాకు ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు భావిస్తున్నాయి. గత సెప్టెంబరులో కిమ్‌ రష్యాలో పర్యటించిన తరవాత నుంచి 2.60 లక్షల టన్నుల మందుగుండును మాస్కోకు సరఫరా చేశారని అమెరికా ప్రకటించింది. ఉత్తర కొరియా మొట్టమొదటి సైనిక గూఢచర్య ఉపగ్రహ ప్రయోగానికి పుతిన్‌ లోపాయికారీగా తోడ్పడ్డారని ఆరోపిస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమానికి రష్యా గుట్టుగా సహకరిస్తోందని అంచనా. ఎవరి అనుమానాలు, ఆందోళనలను తాము ఖాతరు చేయబోమని పుతిన్, కిమ్‌లు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.


ఇరు పక్షాలతో దోస్తీ

ఉత్తర కొరియా నుంచి పుతిన్‌ నేరుగా వియత్నాం వెళ్ళారు. చైనా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించే వియత్నాం భారత్‌నూ రక్షణ భాగస్వామిగా పరిగణిస్తోంది. అమెరికా, ఐరోపాలతో ఆర్థిక బంధాన్ని పెంపొందించుకుంది. తాజా పర్యటనలో రష్యా, వియత్నాం ఇంధనంతోపాటు పలు రంగాల్లో సహకార వృద్ధికి 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, రక్షణ సహకారం గురించి వివరాలు వెల్లడించలేదు. అమెరికా, ఐరోపాలతో వ్యాపార సంబంధాలను పెంచుకున్న వియత్నాం- మాస్కోకు ఆయుధ సహాయం చేయకపోవచ్చు. నిరుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధినేత జిన్‌పింగ్‌లు సైతం వియత్నామ్‌ను సందర్శించారు. ఈ క్రమంలో వియత్నాం ఇకపైనా ప్రాచ్య-పాశ్చాత్య దేశాల మధ్య సమతుల పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

Posted Date: 26-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం