• facebook
  • whatsapp
  • telegram

స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్‌ ఇటీవల నిర్వహించిన సదస్సులో 92 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. 60 దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రులు దానికి హాజరయ్యారు. ఇండియా మాత్రం విదేశాంగ శాఖ ఉన్నతాధికారిని పంపింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్‌ బలంగా కోరుకుంటున్నా, మాస్కోతో ద్వైపాక్షిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి సిద్ధంగా లేదు.


ఇటీవలి స్విట్జర్లాండ్‌ శాంతి సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధ సమాప్తికి 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనితో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం వల్ల అణు యుద్ధం సంభవించకుండా నివారించడం, ఆహార భద్రత సాధించడం, ఉక్రెయిన్‌ ప్రజల కనీస అవసరాలను తీర్చడం గురించీ స్విస్‌ సభలో చర్చించారు. చివరకు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడమెలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరకుండానే సభ ముగిసింది. శాంతి సదస్సులో రష్యా పాల్గొనకపోవడమే దీనికి ప్రధాన కారణం. శాంతి సాధనలో రష్యాను ఎప్పుడు, ఎలా భాగస్వామిని చేయాలనే అంశంపైనా దేశాధినేతల మధ్య అంగీకారం కుదరలేదు. చివరకు స్విస్‌ శాంతి సాధన సదస్సు సంయుక్త ప్రకటనపై 80 దేశాలు, ఐరోపా సమాఖ్య(ఈయూ) అంతర్భాగాలైన యూరోపియన్‌ కమిషన్, యూరోపియన్‌ పార్లమెంట్, యూరోపియన్‌ కౌన్సిల్, కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌లు సంతకాలు చేశాయి. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యూఏఈ, అర్మీనియా, బహ్రెయిన్, ఇండొనేసియా, కొలంబియా, లిబియా, మెక్సికో, థాయ్‌లాండ్, సురినామ్‌ దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు.


సేనల ఉపసంహరణ ఏదీ?

సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రతకు ఐక్యరాజ్య సమితి నిబంధనావళి పూచీ ఇస్తోంది. రష్యా దీన్ని ఉల్లంఘించి ఉక్రెయిన్‌పై దాడి చేయడాన్ని స్విస్‌ శాంతి సభ సంయుక్త ప్రకటన దుయ్యబట్టింది. జపోరీజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించిన రష్యా దాన్ని తిరిగి ఉక్రెయిన్‌కు అప్పగించాలని సంయుక్త ప్రకటన డిమాండ్‌ చేసింది. నల్ల సముద్రం, అజోవ్‌ కడలిలోని రేవుల నుంచి ఉక్రెయిన్‌ ఎగుమతి దిగుమతులు చేసుకొనే వెసులుబాటును కల్పించాలనీ గట్టిగా కోరింది. యుద్ధ ఖైదీలను, ఉక్రెయిన్‌ నుంచి తరలించిన బాలలను రష్యా వెంటనే విడుదల చేయాలని, ఉక్రెయిన్‌లో ఆహార ధాన్యాల సాగు, ఎగుమతులకు ఆటంకం కలిగించకూడదని డిమాండ్‌ చేసింది. అణ్వస్త్రాలను చూపి బెదిరించడాన్ని రష్యా కట్టిపెట్టాలని, రవాణా నౌకలు, రేవులపై దాడులను ఆపాలని సంయుక్త ప్రకటన కోరింది. ఉక్రెయిన్‌ నుంచి సేనలను ఉపసంహరించాలని రష్యాను ఈ ప్రకటన డిమాండ్‌ చేయకపోవడం విచిత్రం. సంయుక్త ప్రకటనలోని ఇతర అంశాల అమలుకు ఒక కార్యాచరణ రూపొందిన తరవాత రెండో శాంతి సభను నిర్వహిస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అప్పుడు ఆ ప్రణాళికను రష్యాకు పంపుతామని చెప్పారు.


స్విస్‌ శాంతి సదస్సులో భారత్‌ పాల్గొని మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుందని ఉక్రెయిన్‌ ఆశపెట్టుకుంది. దీనికి ముందు ఇటలీలో జీ7 సభకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్‌ సభకు రావాలని మోదీకి నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయుధాలు, చమురు దిగుమతుల కోసం రష్యాపై ఆధారపడిన భారత్‌ మాస్కోను దూరం చేసుకోవడానికి సుముఖంగా లేదు. పాశ్చాత్య దేశాలు పుతిన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని చూస్తున్నాయి. దీనికి భారత్‌ తదితర వర్ధమాన దేశాలు కలిసిరావాలని అవి ఆశిస్తున్నాయి. ప్రధాని మోదీ అందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. అందువల్లే ఆయన స్విస్‌ సభకు హాజరు కాలేదు. ఇటలీ జీ7 సభకు మోదీ వెంట హాజరైన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రాలు సైతం పొరుగునే స్విస్‌లో జరిగిన శాంతి సభలో పాల్గొనలేదు. వారికి బదులు కార్యదర్శి స్థాయి అధికారి అయిన పవన్‌ కపూర్‌ వెళ్ళారు. ఇటీవలి వరకు మాస్కోలో భారత రాయబారిగా ఉన్న కపూర్‌- రష్యా నుంచి ఇండియాకు ఆయుధాలు, చమురు సరఫరా అవిచ్ఛిన్నంగా జరిగేలా చూశారు. రెండు దేశాలు ఉమ్మడిగా ఆయుధాలు తయారు చేయడానికీ తోడ్పడ్డారు. ఆయన్ను స్విస్‌ సభకు పంపడం ద్వారా రష్యాను నొప్పించే ఉద్దేశం లేదని భారత్‌ పరోక్షంగా తెలియజెప్పింది. అదే సమయంలో ఇవి యుద్ధానికి రోజులు కావని పుతిన్‌కే మోదీ చెప్పారని గమనించాలి. ఇలా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సమతూకం పాటించడానికి భారత్‌ యత్నిస్తోంది.


భారత్‌ సాయం

రష్యా దండయాత్రను ఖండించకుండా ఉక్రెయిన్, రష్యాలు పరస్పర సంప్రతింపుల ద్వారా శాంతిని సాధించాలని ఇండియా సూచిస్తోంది. ఉక్రెయిన్‌కు 117 టన్నుల మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు, గుడా రాలు, టార్పాలిన్లు, సౌర దీపాలు, డీజిల్‌ జనరేటర్‌ సెట్లను ఇండియా పంపింది. కీవ్‌లో బాంబు దాడి వల్ల దెబ్బతిన్న ఒక పాఠశాలను నిర్మిస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. ఉక్రెయిన్‌ను బలపరుస్తున్న అమెరికా, ఐరోపా సమాఖ్యలతో పాటు రష్యాతోనూ భారత్‌కు స్నేహసాన్నిహిత్యాలు ఉన్నాయి. స్విస్‌ సభకు హాజరు కాకుండా ఒక ఉన్నతాధికారిని పంపడం ద్వారా ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో పుతిన్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలకు దూరంగా ఉంటామని సందేశమిచ్చారు.


సంక్లిష్ట ప్రక్రియ

స్విట్జర్లాండ్‌ సదస్సు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం గట్టిగా డిమాండ్‌ చేసినా రష్యా, చైనాలు అందులో పాల్గొనలేదు. శాంతి సాధనకు అది పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. ఈ రెండు దేశాల గైర్హాజరీ కొన్ని ఇతర దేశాలను సభలో పాల్గొనకుండా చేసింది. దీన్నిబట్టి ఉక్రెయిన్‌లో శాంతి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అని తేలుతోంది. భారత్, బ్రెజిల్, చైనా, రష్యాలతో ఏర్పడిన బ్రిక్స్‌ కూటమి శాంతిసాధనకు కలిసిరాలేదు. బ్రిక్స్‌ సభ్య దేశాల్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు స్విస్‌ సభకు హాజరైనా- సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. ప్రధాన చమురు ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియాదీ అదే దారి. బ్రెజిల్‌ పరిశీలక హోదాలో సభలో పాల్గొంది. దక్షిణాఫ్రికా ఒక ప్రతినిధిని మాత్రం పంపింది. సౌదీ అరేబియా నుంచి విదేశాంగ మంత్రి హాజరయ్యారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

Posted Date: 26-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని