• facebook
  • whatsapp
  • telegram

ఇంధన భద్రతకు సానుకూల పవనంప్రపంచ పవన ఇంధన మండలి ఆధ్వర్యాన 2007 నుంచి ఏటా జూన్‌ 15వ తేదీన దీన్ని నిర్వహిస్తున్నారు. వాయుశక్తి వల్ల ఒనగూడే ప్రయోజనాలతో పాటు పర్యావరణానికి అనుకూలమైన రీతిలో విద్యుదుత్పత్తికి గల అవకాశాల గురించి ప్రజలకు చాటిచెప్పాలన్నది ఈ ఏడాది నినాదం. సుదీర్ఘ సముద్ర తీరాలు కలిగిన భారత్‌లో పవన విద్యుదుత్పత్తికి అపార అవకాశాలున్నాయి.


భూభ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో తారతమ్యంవల్ల వాతావరణ పీడనంలో మార్పులు సంభవిస్తాయి. తద్వారా గాలులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మళ్ళుతాయి. ఇలా వీచే గాలికి అనుగుణంగా యంత్రాలకు అమర్చిన రెక్కలు తిరుగుతాయి. దీన్నే గతిశక్తిని భ్రమణశక్తిగా మార్చడమని అంటారు. ఈ శక్తిని ఉపయోగించడం ద్వారా యంత్రాలు నీటిని ఎత్తిపోయడం, ఆహార ధాన్యాలను పిండి చేయడం, విద్యుదుత్పత్తి చేపట్టడం వంటి పనులెన్నో చేయగలవు. పవన విద్యుదుత్పత్తివల్ల ఎటువంటి హానికర కర్బన ఉద్గారాలూ వెలువడవు. పర్యావరణానికి ఎంతో అనుకూలమైనదే కాకుండా, చౌక ధరకే కరెంటును ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడంవల్ల హానికర కర్బన ఉద్గారాలు పెద్దమొత్తంలో వెలువడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యమూ అధికమవుతోంది. వీటిని కట్టడి చేయడంపై దృష్టి సారించిన ప్రపంచ దేశాలు- పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా పెంచాలంటూ 2015లో పారిస్‌ వాతావరణ సదస్సు సందర్భంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి.


చైనాదే అగ్రస్థానం...

దుబాయ్‌లో నిరుడు కాప్‌-28 సదస్సు సందర్భంగా, ప్రపంచ దేశాలన్నీ తమ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 2030కల్లా మూడు రెట్లు పెంచుకోవాలని నిర్ణయించాయి. భారత్‌ మాత్రం అప్పటికల్లా మొత్తం విద్యుదుత్పత్తిలో సగం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సమీకరించాలని లక్షించింది. ఆ దిశగా 2030కల్లా పునరుత్పాదక ఇంధన కేంద్రాల సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచాలని, అందులో పవన విద్యుత్‌ వాటా 140 గిగావాట్ల మేర ఉండాలని లక్షించారు. ప్రస్తుతం భారతదేశ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 45 గిగావాట్లే! నేడు ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం 41శాతం. అందులో పవన విద్యుత్‌ వాటా 7.8శాతం వరకు ఉంటోంది. భారతదేశ మొత్తం విద్యుదుత్పతిలో సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యం 41.4శాతం. అందులో పవన విద్యుత్‌ భాగస్వామ్యం 10.3శాతం. థర్మల్‌ విద్యుత్తుతో పోలిస్తే దీన్ని దాదాపు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 1021 గిగావాట్లు. ఇందులో అత్యధికంగా 25శాతం విద్యుత్‌ చైనాలో ఉత్పత్తి అవుతోంది. ఆ తరవాతి స్థానాలను అమెరికా, జర్మనీ, భారత్‌ ఆక్రమిస్తున్నాయి. అయితే, డెన్మార్క్‌ తన మొత్తం విద్యుత్‌ అవసరాలకు పూర్తిగా పవనశక్తిని వినియోగించే స్థాయికి చేరడం విశేషం.


పవనశక్తి ఎక్కువగా సముద్ర తీరాలు, కొండలు, లోయలు వంటి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళేకొద్దీ గాలి ప్రభావం అధికమవుతుంది. ‘జాతీయ పవనశక్తి అధ్యయన సంస్థ’ దేశవ్యాప్తంగా 800 వాయు సాంద్రత పర్యవేక్షణ కేంద్రాల ద్వారా ఒక అధ్యయనం చేపట్టింది. ప్రాంతాలను బట్టి భూ ఉపరితలానికి వంద మీటర్ల ఎత్తున 302 గిగావాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తిచేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అత్యంత బలమైన గాలులు వీచే గుజరాత్‌ (84.43 గిగావాట్లు), కర్ణాటక (55.85), మహారాష్ట్ర (45.39), ఆంధ్రప్రదేశ్‌ (44.22), తమిళనాడు (33.79), రాజస్థాన్‌ (18.77), మధ్యప్రదేశ్‌ (10.48 గిగావాట్లు) రాష్ట్రాల్లో ఈ విద్యుదుత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ (4.2 గిగావాట్లు) వంటి రాష్ట్రాల్లో ఇందుకు అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. సముద్ర తీరాన 150 మీటర్ల ఎత్తులో వీచే గాలుల ద్వారా 1164 గిగావాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, ఎత్తుకు వెళ్ళేకొద్దీ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కష్టమవుతుంది. ఖర్చూ పెరిగిపోతుంది. అయినప్పటికీ, భారత్‌ ఈ విషయంలో యంత్రాలు, సాంకేతిక సహకారం కోసం డెన్మార్క్‌తో కలిసి ఒక భాగస్వామ్య కేంద్రాన్ని నెలకొల్పింది.


సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్‌ వినియోగం రాత్రి వేళ కూడా ఉంటుంది కాబట్టి గ్రిడ్‌ స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, భారీగా ఖర్చవుతుంది. రాత్రివేళ గాలి ఎక్కువగా వీస్తుంది కాబట్టి సౌర, పవన ఇంధనాలను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్‌ స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈ తరహా ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి కేంద్రం 2018లో జాతీయ సౌర, పవన సమ్మిళిత విద్యుదుత్పత్తి విధానం తీసుకొచ్చింది. దీనికింద విద్యుత్‌ కేంద్రాలను స్థాపించడానికి భారత సౌర ఇంధన సంస్థ ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది.


భారత్‌కు ఎంతో అనుకూలం

ఏడాది పొడవునా గాలులు వేగంగా వీచే సముద్ర తీర ప్రాంతాలు పవన విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు అత్యంత అనుకూలం. భారత్‌కు సుమారు 7,600 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం 2017లో జాతీయ పవనశక్తి విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ, విడిభాగాలపై సుంకం తొలగింపు వంటి చర్యలు చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించడంతో పాటు రాష్ట్రాల మధ్య ఉచితంగానే విద్యుత్‌ సరఫరా చేసుకునే వెసులుబాటు కల్పించింది. విద్యుత్‌ సంస్థలు తప్పనిసరిగా పవన విద్యుత్తును సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించింది. 2023-24లో మొత్తం విద్యుత్తులో ఇది కనీసం 1.6శాతం ఉండేలా చూడాలని ఆదేశించింది. ఏటా ఒక శాతం పెంచుకుంటూ, 2029-30 కల్లా 6.94శాతం మేర పవన విద్యుత్తును కొనుగోలు చేయాలని సూచించింది. పవన విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటువల్ల యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంధన భద్రతకూ అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటి స్థాపనకు అవసరమైన భూ కేటాయింపు, సరఫరా వ్యవస్థల నిర్మాణంపై కేంద్రం, రాష్ట్రాలు మరింతగా శ్రద్ధ వహించాలి.


కొన్ని ఇబ్బందులు...

పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపనకు సముద్ర తీరాలు, కొండలు, కోనల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, అక్కడి వరకు సరఫరా లైన్లను నిర్మించడానికి భారీగా ఖర్చవుతోంది. వాతావరణ పరిస్థితులవల్ల గాలి నిరంతరం ఒకేలా వీయదు. దానివల్ల విద్యుదుత్పత్తి స్థిరంగా ఉండదు. కాబట్టి, పూర్తిగా దీనిపై ఆధారపడలేం. అయితే, అవసరానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి జరిగితే, దాన్ని హైడ్రో ఎలెక్ట్రిక్‌ స్టేషన్లు, బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు. పవన యంత్రాల రెక్కలు తిరుగుతున్నప్పుడు విపరీతమైన శబ్దాలు వెలువడతాయి. అవి సమీపంలో ఉండేవారికి అసౌకర్యం కలిగిస్తాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్విస్‌ సదస్సుకు భారత్‌

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

Posted Date: 19-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని