• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్యప్రపంచస్థాయి గుర్తింపు సాధనకు ఉన్నత విద్యాసంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. లండన్‌కు చెందిన విద్యావిశ్లేషణ సంస్థ ‘క్యూఎస్‌ వరల్డ్‌’ ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు తాజాగా ర్యాంకులను ప్రకటించింది. భారత్‌కు చెందిన అనేక విద్యాసంస్థలు ఇందులో తమ స్థానాన్ని మెరుగుపరచుకున్నాయి.


ఇటీవల క్యూఎస్‌ వరల్డ్‌ సంస్థ ప్రకటించిన ‘విశ్వవిద్యాలయాల ర్యాంకుల జాబితా-2025’లో అనేక భారతీయ విద్యాసంస్థలు తమ స్థానాలను మెరుగుపరచుకున్నాయి. 61శాతం విశ్వవిద్యాలయాలు ముందుకువెళ్ళగా, 24శాతం తమ ర్యాంకులను కాపాడుకున్నాయి. ర్యాంకులు దిగజారినవి తొమ్మిది శాతం. తాజా సర్వే ప్రకారం, ప్రపంచంలోని అత్యుత్తమ రెండు వందల వర్సిటీల్లో 13 ఇండియాకు చెందినవే! ఐఐటీ బొంబాయిది 2024 ర్యాంకింగ్స్‌లో 149వ స్థానం. ఇప్పుడు అది 118వ స్థానానికి ఎగబాకింది. దిల్లీ ఐఐటీ 47 పాయింట్లు మెరుగుపడి 150వ స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశ ఉన్నత విద్యావ్యవస్థ ప్రపంచస్థాయి సగటు స్కోరు 23.5శాతాన్ని దాటి 37.8శాతం మార్కులు సాధించినట్లు విశ్లేషిస్తున్నారు. దేశీయ విద్యాసంస్థలు తమ పరిస్థితులను మెరుగుపరచుకుంటున్నా పలుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.


ఆసియాలో రెండో స్థానం...

విశ్వవిద్యాలయాలు సాధించిన ర్యాంకులను బట్టి చూస్తే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. భారత్‌ ఆ తరవాతి స్థానంలో నిలుస్తోంది. ఉన్నత విద్యాసంస్థలను ర్యాంకుల ఆధారంగా వర్గీకరించడమనేది అమెరికాలో ప్రారంభమైంది. డిగ్రీలు పొందిన ప్రముఖ వ్యక్తుల జాబితా ఆధారంగా విశ్వవిద్యాలయాలను 1950 దశకం వరకు వర్గీకరించేవారు. నాణ్యతా ప్రమాణాలు, పేరు ప్రతిష్ఠల ప్రాతిపదికగా వర్గీకరించే పద్ధతి 1958లో ఆరంభమైంది. ప్రపంచీకరణ ఫలితంగా 2000 సంవత్సరం తరవాత విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ప్రకటించే సర్వేలు అధికమయ్యాయి. ఇటువంటి జాబితాల్లో 200 వరకు ర్యాంకులు సాధించిన వాటిని ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలుగా పరిగణిస్తారు. విద్యాసంస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అవి సాధించిన ర్యాంకులను కొలమానంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు నిధులు కేటాయించడానికి, విద్యార్థులు-పరిశోధకుల మార్పిడికి, నాణ్యమైన విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ ఉన్నత విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి కొన్ని దేశాలు ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటాయి. మలేసియాలోని ఒక ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం టైమ్స్‌ ఉన్నత విద్యా ర్యాంకుల్లో 80 స్థానాలు దిగజారడంతో ఆ వర్సిటీ ఉపకులపతిని తొలగించింది! మనదేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలిసి సంయుక్త డిగ్రీ కోర్సును అందించే కళాశాల క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ జాబితాలో 500లోపు ర్యాంకు తెచ్చుకొని ఉండాలి.


నాణ్యమైన విద్య, ఉపాధి కల్పన, విద్యాసంస్థపై అంతర్జాతీయ అభిప్రాయం, విద్యార్థులు-బోధన సిబ్బంది నిష్పత్తి వంటి అంశాల ప్రాతిపదికన ఆయా సంస్థలు విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు కేటాయిస్తాయి. విశ్వవిద్యాలయాల పరిశోధనా సామర్థ్యం, సృజనాత్మకత, నవ్యత, ఆవిష్కరణలు సైతం కీలకమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రపంచస్థాయి విద్యాసంస్థలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం- పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి అవి పెద్దయెత్తున నిధులు ఖర్చు చేయడమే. ఇజ్రాయెల్‌ జీడీపీలో 4.3శాతం, దక్షిణ కొరియా 4.2శాతం, అమెరికా 2.8శాతం ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తున్నాయి. భారత్‌ ఖర్చు చేస్తున్నది ఒక్క శాతం కూడా ఉండటంలేదని నీతి ఆయోగ్‌ అధ్యయనం వెల్లడించింది. భారత్‌తో పోలిస్తే పరిశోధనల కోసం చైనా ఆరు రెట్లు అధికంగా ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా ప్రత్యేకంగా పరిశోధనా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. యూజీసీ అయిదు నూతన ‘రీసెర్చ్‌ గ్రాంట్స్‌ ఫెలోషిప్‌’ పథకాలను అమలు చేస్తోంది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటే లక్ష్యంగా ‘యూనివర్సిటీస్‌ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇవన్నీ విజయవంతమైతే దేశీయ ఉన్నత విద్యాసంస్థలు మరిన్న ప్రపంచ ర్యాంకులను సాధించగలుగుతాయి.


నాణ్యమైన విద్యే ముఖ్యం...

ప్రపంచ ర్యాంకులవల్ల విశ్వవిద్యాలయాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడుతోందని యునెస్కో ఆందోళన వ్యక్తంచేసింది. వర్సిటీలు బోధన, సామాజిక బాధ్యతల నుంచి దృష్టి మరల్చి, ర్యాంకుల సాధనకు అవసరమైన పరిశోధనలు చేపడుతున్నాయని విశ్లేషించింది. ప్రపంచంలోని కేవలం అయిదు శాతంలోపు విశ్వవిద్యాలయాలను సర్వే చేసి ప్రకటించే ర్యాంకులు ఎక్కువగా రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యంతో కూడినవేనన్న విమర్శలున్నాయి. కాబట్టి, మన ఉన్నత విద్యాసంస్థలు దేశీయ పరిస్థితులు, అవసరాలకు తగినట్లు ముందుకు వెళ్ళాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా సమాజానికి మేలుచేసే, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే నాణ్యమైన విద్యను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యం. అప్పుడే ఉన్నత విద్యకు సార్థకత చేకూరుతుంది.


- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ 

(విద్యారంగ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

‣ అన్నదాతకు అండగా కృత్రిమ మేధ

‣ సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!

‣ సాగర గర్భం... అంతర్జాల కేంద్రం

‣ కేంద్రానికి మిగులు సాయం

Posted Date: 14-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని