• facebook
  • whatsapp
  • telegram

సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కారు కొలువుతీరింది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. మోదీ ప్రభుత్వం త్వరలో ‘125 రోజుల అభివృద్ధి కార్యక్రమం’ చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని, తద్వారా పెద్దయెత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చన్నది ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా సేద్యాన్ని బలోపేతం చేయడం అవసరం.


కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం త్వరలో 125 రోజుల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి పెద్దపీట వేస్తామంటున్నారు. ‘అగ్రి-ష్యూర్‌ ఫండ్‌’ ఏర్పాటు ద్వారా దీనికి బాటలు పరుస్తామంటున్నారు. ఒక్కొక్కటి పాతిక కోట్ల రూపాయల వరకు టర్నోవర్‌ కలిగిన 85 అంకుర సంస్థలను ఎంపిక చేసి, వచ్చే అయిదేళ్లలో వాటి కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నిధులను ఉపయోగిస్తారని అంటున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) మార్గదర్శకాలను అనుసరించి ఈ నిధిని ‘సెబీ’లో నమోదు చేయనున్నారు. ఇందుకోసమని ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.


కార్యాచరణ ఎలా ఉండాలి?

పంట కోతల అనంతరం వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన వసతులను మెరుగుపరచడంపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకు వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే ఏర్పాట్లు చేస్తే రైతులు తమ ఉత్పత్తులను మెరుగ్గా నిర్వహించడంతో పాటు అధిక ఆదాయం పొందే వీలుంటుందని భావిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సామర్థ్యాల పెంపుదలపైనా మోదీ సర్కారు దృష్టి సారించే అవకాశముంది. ఆ దిశగా వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్‌) ఏర్పాటుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ వసతులను మెరుగుపరచేందుకు కేంద్రం ప్రత్యేకంగా రూ.750 కోట్లను కేటాయించే వీలుంది. వ్యవసాయ సాంకేతికత, ఫుడ్‌ ప్రాసెసింగ్, పశువుల పెంపకం, మత్స్య పరిశ్రమ, సరఫరా గొలుసుల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, బయోటెక్నాలజీ రంగాలతో ముడివడిన అంకుర సంస్థలకు ఈ నిధులను అందజేస్తారంటున్నారు.


మోదీ సర్కారు 125 రోజుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వాటిలో ముఖ్యమైనవి: 1) వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రతినిధులను ఎన్నుకొనే అవకాశం కల్పించాలి. వ్యవస్థాపరంగా ఇటువంటి సంస్కరణలు మరిన్ని తీసుకురావాలి. 2) వ్యవసాయ మౌలిక వసతుల ఆధునికీకరణకు పెద్దయెత్తున పెట్టుబడులు సమకూర్చాలి. ముఖ్యంగా పొలాలు, గోదాములు, మార్కెట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితరాలను అనుసంధానించే రహదారులను మెరుగుపరచాలి. 3) పంట కాలనీలను (క్రాప్‌ క్లస్టర్లు) ఏర్పాటు చేయాలి. 4) చిన్న రైతులను ప్రోత్సహించడం ద్వారా వారు వ్యవసాయ ఉత్పత్తి సంస్థ (ఎఫ్‌పీఓ)లను ప్రారంభించేలా తోడ్పాటు అందించాలి. అటువంటి కంపెనీలకు పెట్టుబడులు సమకూర్చడంతో పాటు వడ్డీ తగ్గింపు, పన్ను రాయితీ వంటి సదుపాయాలు కల్పించాలి. 5) రైతు అనుకూల బీమా పథకాలను విస్తృతస్థాయిలో అమలుపరచాలి. వారి ఆదాయాన్ని పెంచేలా సూపర్‌ బజార్లు, మాల్స్‌తో ఒప్పందాలు చేసుకోవడం ముఖ్యం. 6) రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు అధిక విలువను జోడించేందుకు అవసరమైన ప్రాసెసింగ్‌ వసతులు సమకూర్చుకోవడం కీలకం. ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి.
తాజా ఎన్నికల్లో సానుకూలమైన ప్రజాతీర్పు, జీఎస్టీ ఆదాయం అధికంగా సమకూరుతుండటం కేంద్రంలోని కొత్త ప్రభుత్వానికి కలిసివచ్చే అంశం. కాబట్టి, రాష్ట్రాలు తమ పాత్రను మరింత సమర్థంగా పోషించేలా కేంద్రం ఒప్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు తమ వాటా నిధులను సమకూర్చడం ముఖ్యం. కోత అనంతర వసతుల కల్పనకు తోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎఫ్‌పీఓలు, అంకురాల కోసం కేంద్రం పెద్దయెత్తున ఏఐఎఫ్‌ నిధులను వెచ్చించే అవకాశముంది. దీని కింద సమకూర్చే అన్ని రుణాలపై ఏటా మూడు శాతం (గరిష్ఠంగా రెండు కోట్ల రూపాయల వరకు) వడ్డీ రాయితీ అందిస్తారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్‌) కింద ఇప్పటివరకు 48,352 ప్రాజెక్టులకు రూ.35,000 కోట్లు మంజూరయ్యాయి. దీని కింద మంజూరైన ప్రధాన ప్రాజెక్టుల్లో సాధారణ గోదాములు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, సార్టింగ్‌-గ్రేడింగ్‌ కేంద్రాలు, శీతల గిడ్డంగులు వంటివి ఉన్నాయి.


ముందుగా అనుకున్న ప్రణాళికను బట్టి చూస్తే, వ్యవసాయ మౌలిక వసతుల నిధిని 2021-26 ఆర్థిక సంవత్సరాల మధ్య పంపిణీ చేయాలని, 2033 వరకు మద్దతు కొనసాగించాలని భావించారు. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సి ఉంది. రైతులకు అధిక ఆదాయం సమకూరాలంటే వ్యవసాయ మార్కెటింగ్‌ను పరిపుష్టం చేయాలి. ఇందుకోసం ఇప్పటికే అమలవుతున్న సమీకృత పథకం కింద మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్రాలకు తోడ్పాటు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఎలెక్ట్రానిక్‌- జాతీయ వ్యవసాయ విపణి (ఇ-నామ్‌) కింద 1,361 మండీలను తీసుకువచ్చారు. వీటి ద్వారా సుమారు 1.80 కోట్ల మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు.


ఏపీ, తెలంగాణలకు పెద్దపీట...

నిర్దిష్టమైన పంటలకు సంబంధించి ఉత్పత్తి సమూహాలను (క్లస్టర్లను) ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ విధానంవల్ల ప్రాసెసింగ్‌ యూనిట్లతో రైతులను అనుసంధానించడం సులభమవుతుంది. రవాణా వ్యయమూ తగ్గుతుంది. అయితే, దీన్ని అమలుచేసే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు కేంద్రం ప్రాధాన్యమివ్వాలి. ఈ రాష్ట్రాలన్నీ వ్యవసాయ ప్రధానమైనవే. అయినప్పటికీ, సేద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడంలో ఇప్పటివరకు విఫలమవుతూ వచ్చాయి. ఎందుకంటే, ఈ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు, ఉచితాలకు పెద్దమొత్తంలో ఖర్చవుతోంది. దాంతో వసతుల కల్పనకు తగినన్ని నిధులు వెచ్చించలేకపోతున్నాయి. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకొని, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం సముచితంగా ఉంటుంది.


వేధిస్తున్న గిడ్డంగుల కొరత

వాతావరణ, మార్కెట్‌ పరిస్థితులను బట్టి వ్యవసాయ రంగానికి ఒక్కోసారి అత్యవసర సాయం అవసరమవుతుంది. నూర్పిడి కళ్లాలతో పాటు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చేపలు వంటి ఉత్పత్తులకు నిల్వ సదుపాయం చాలా అవసరం. ఇవి లేకపోవడంవల్లే ఇటీవల అరటి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు తదితర ప్రాంతాల్లో కొద్దిరోజుల క్రితం తీవ్రమైన వేడిగాలుల కారణంగా చేపల చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయులు దారుణంగా పడిపోయాయి. దాంతో రైతులు చేపలు, రొయ్యలను అత్యవసరంగా పట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, శీతల గిడ్డంగులు లేకపోవడంవల్ల వారు భారీగా నష్టపోయారు. సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడంవల్ల ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్రానికి మిగులు సాయం

‣ కేంద్రానికి మిగులు సాయం

‣ విజృంభిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

‣ కట్టుబడాలిక... సంకీర్ణ ధర్మానికి!

‣ సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

Posted Date: 10-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం