• facebook
  • whatsapp
  • telegram

AP JOBS: ఆరోగ్య శాఖలో ఇంకా 25 వేల ఉద్యోగాలు ఖాళీ

* ‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే

* వైకాపా పాలనలో ప్రహసనంగా నియామకాలు
 

ఈనాడు అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులను పూర్తిస్థాయిలో నియమించకుండానే ‘జీరో వేకెన్సీ’ అని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి సరిపడా వైద్య సిబ్బంది లేక, ఆసుపత్రుల్లో రోగులకు చికిత్సపై ప్రభావం చూపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశాలతో.. విభాగాల వారీగా మంజూరైన పోస్టులు, భర్తీ, ఖాళీల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ తాజాగా సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం సుమారు 40 వేల మంది ఆశాలతో పాటు కేంద్రం కొత్తగా మంజూరు చేసిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఇతరత్రా ఉద్యోగాలతో కలిపి లక్ష వరకు శాంక్షన్డ్‌ పోస్టులున్నాయి. ఇందులో 25 వేల పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. నియమించిన ఉద్యోగుల్లోనూ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పోస్టుల్లో ఎక్కువ మందిని పొరుగు సేవలు, ఒప్పంద విధానంలోనే తీసుకున్నారు. వైద్యులను కూడా కొన్నిచోట్ల ఒప్పంద పద్ధతిలో భర్తీ చేశారు. మరికొందరు డిప్యుటేషన్‌లపై పని చేస్తున్నారు. తాము 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, వైద్యారోగ్య శాఖను ‘జీరో వేకెన్సీ’ దశకు తెచ్చామని వైకాపా ప్రభుత్వం చేసిందంతా డొల్ల ప్రచారమేనని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా నియామకాల ప్రక్రియ వాస్తవ అవసరాలకు తగ్గట్లు చేపట్టలేదని, ఉద్యోగాల్లో చేరిన వైద్యులు, సిబ్బంది కొందరు అప్పుడే మానేశారని తేలింది.

విభాగాల వారీగా పరిశీలిస్తే.. 
స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలందించే బోధనాసుపత్రుల్లో 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌ నర్స్‌- 2,873, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌- 590, సీనియర్‌ రెసిడెంట్స్‌- 924, అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌- 286, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌- 39, జనరల్‌ డ్యూటీ అటెండర్స్‌- 639, గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్స్‌- 113, హెడ్‌ నర్స్‌ పోస్టులు 184 వరకు ఖాళీగా ఉన్నాయి. మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులు కూడా భారీగా ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 13,127 పోస్టులు మంజూరుకాగా, 1,722 ఖాళీగా ఉన్నాయి. సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌- 148, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌- 234, స్టాఫ్‌ నర్స్‌- 197, గ్రేడ్‌-1 ఫార్మసిస్ట్‌- 115, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌- 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

10 శాతం కంటే తక్కువే...
ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, మందుల కొనుగోళ్లు అన్నీ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధీనంలో జరుగుతుంటాయి. ఈ సంస్థ కార్యాలయ అవసరాలకు 187 పోస్టులు మంజూరు కాగా, అక్కడున్న శాశ్వత ఉద్యోగులు 10 శాతం కంటే తక్కువే. ఎక్కువ మంది ఒప్పంద, పొరుగు సేవలు, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. 

1,512 పోస్టులే భర్తీ 
ఆయుష్‌ పరిధిలో ఆయుర్వేద, హోమియో, ఇతర వైద్య సేవలందించేందుకు 2,565 పోస్టులు మంజూరై ఉండగా, 1,512 పోస్టులే భర్తీ చేశారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలోని ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల్లో అధిక శాతం ఖాళీగా ఉన్నాయి. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ, ప్రజారోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి.

Updated Date : 26-07-2024 15:28:13

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం