• facebook
  • whatsapp
  • telegram

విజృంభిస్తున్న ప్లాస్టిక్‌ భూతంప్లాస్టిక్‌ కాలుష్యం భూతంలా విరుచుకుపడుతోంది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా 1.1 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుకుంటున్నాయి! పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040కల్లా 2.9 కోట్ల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు సముద్రాల్లోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు!


ప్లాస్టిక్‌ కాలుష్య కట్టడి కోసం వివిధ దేశాల ప్రతినిధులు ఇటీవల కెనడాలో సమావేశమయ్యారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే ప్రపంచ ఒప్పందం మీద నాలుగోసారి చర్చించారు. సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టడానికి దేశాలన్నీ చట్టబద్ధంగా కట్టుబడేలా చేయాలన్నది ఈ ఒప్పంద ఉద్దేశం. ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగం మూలంగా పుట్టుకొస్తున్న  గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పులకు కారణమవుతున్నప్పటికీ, ప్రపంచదేశాలు వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


నీరుగార్చే ప్రయత్నాలు...

ప్లాస్టిక్‌ అనగానే మనకు ఇంటాబయటా కనిపించే వస్తువులే గుర్తుకువస్తాయి. అయితే ప్లాస్టిక్‌ ఉత్పత్తికి వాడే శిలాజ ఇంధనాలు, రసాయనాల వెలికితీత, శుద్ధి ప్రక్రియలవల్లా పెద్దయెత్తున ఉద్గారాలు వెలువడుతున్నాయి. భూగర్భం నుంచి వెలికితీస్తున్న చమురు, సహజ వాయువుల్లో 10శాతం ప్లాస్టిక్‌ ఉత్పత్తికే సరిపోతోంది. పైగా దీని తయారీకి అవసరమైన విద్యుత్తు కోసం బొగ్గును మండిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) 2019లో వెలువరించిన నివేదిక ప్రకారం, ప్లాస్టిక్‌ మూలంగా 180 కోట్ల టన్నుల గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఉద్గారాల్లో ఇది 3.4శాతం. అంతకంతకు పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలవల్లా పెద్దయెత్తున ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటి నుంచి ప్రధానంగా కార్బన్‌ డైఆక్సైడ్, మీథేన్‌ వంటివి పుట్టుకొస్తాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కట్టడి చేయడానికి ప్రపంచ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.


చమురు, సహజవాయువులను పెద్దయెత్తున ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వాటి పునర్వినియోగానికే పరిమితం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్‌ వంటి చమురు ఉత్పత్తి దేశాలు గత సంవత్సరం జరిగిన చర్చల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తి మీద పరిమితిని వ్యతిరేకించాయి. విధానపరమైన అంశాలను తెరపైకి తెస్తూ ఒప్పందాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్, ఐరోపా దేశాల కూటమి మాత్రం ప్రపంచ వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తిని తగ్గించే నియమాలను చేర్చాలంటోంది. అమెరికా ఈ దేశాలతో కలవనప్పటికీ, ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయాలనే దానిపై ఏకీభవిస్తోంది. ఆయా దేశాలే స్వచ్ఛందంగా ఇందుకు పూనుకోవాలని సూచిస్తోంది. మరోవైపు శిలాజ ఇంధనాలు, రసాయన పరిశ్రమలు ఈ ఒప్పందాన్ని నీరుగార్చడం కోసం పెద్దయెత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి 99శాతం ప్లాస్టిక్‌ తయారవుతోంది. ఈ పరిశ్రమలకు ప్లాస్టిక్, పెట్రోకెమికల్స్‌ జీవధార. ప్లాస్టిక్‌ సంక్షోభం కేవలం వ్యర్థాలకు సంబంధించిన సమస్యేనని ఇవి వాదిస్తున్నాయి. గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలకు మూలమైన ప్లాస్టిక్‌ ఉత్పత్తికి దీన్ని వర్తింపచేయవద్దని పట్టుబడుతున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా పర్యావరణ పరిరక్షణే ప్రధానం కావాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు వ్యర్థాలను పెద్దయెత్తున పునర్వియోగించుకుంటేనే కాలుష్య కట్టడి సాధ్యమవుతుంది.


ప్రపంచవ్యాప్తంగా 1950 నుంచి ప్లాస్టిక్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. నాడు దీని ఉత్పత్తి కేవలం 20లక్షల టన్నులు. 2019లో 45 కోట్ల టన్నులకు ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2060 నాటికి ఈ ఉత్పత్తి మూడింతలు అవుతుందని అంచనా. ప్లాస్టిక్‌ కాలుష్య కట్టడికి అనేక మార్గాలున్నాయి. ఈ వ్యర్థాలను పెద్దయెత్తున పునర్వియోగించుకోవడం ఒక పద్ధతి. ప్రస్తుతం 10శాతం కన్నా తక్కువగానే ప్లాస్టిక్‌ పునర్వినియోగం జరుగుతోంది. దీన్ని భారీగా పెంచాల్సిన అవసరముంది. బయోప్లాస్టిక్‌ వంటి పదార్థాలకు మళ్ళడం, వాతావరణంలో కార్బన్‌ డైఆక్సైడ్‌ను తగ్గించే చర్యలు చేపట్టడం వంటి ప్రత్యామ్నాయాలను అనుసరించాలి. భూమ్మీద 600 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడ్డాయని లాన్సెట్‌ పత్రిక అధ్యయనం లోగడ వెల్లడించింది. ఏటా సుమారు 40 కోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకు జలవనరుల్లో చేరుతుండటం పెద్ద సమస్యగా మారింది. అక్కడ అవి సూక్ష్మ రేణువులుగా విచ్ఛిన్నమవుతున్నాయి. వాటిలోని రసాయనాలు మానవాళికి, జీవజాతులకు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ప్రధానంగా శరీరంలో హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంతో పాటు క్యాన్సర్,       మధుమేహం, సంతానలేమి వంటి సమస్యలకు దారితీస్తున్నాయి.


ముందుకు తీసుకెళ్ళడమే ముఖ్యం...

ప్లాస్టిక్‌ కాలుష్య నిరోధ ఒప్పందంలో చేరడానికి రెండేళ్ల క్రితం 175 దేశాలు అంగీకరించాయి. తుది అంశాలను ఈ సంవత్సరం చివర్లో ఆమోదించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తి మీద పరిమితి విధిస్తే ఈ ఒప్పందం ఆగిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళడంపై దృష్టి సారించాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తి తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో పేద దేశాలకు సంపన్న దేశాలు సహకరించేలా మార్గదర్శకాలు రూపొందించడం ముఖ్యం. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీలో వినియోగించే కొన్ని రసాయనాలను నిషేధించే అవకాశాలను పరిశీలించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగ లక్ష్యాలను నిర్దేశించడమూ కీలకమే!


- పున్న సుదర్శన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కట్టుబడాలిక... సంకీర్ణ ధర్మానికి!

‣ సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

‣ అగ్రరాజ్యం.. మారుతున్న వ్యూహం!

‣ భూగోళానికి వడదెబ్బ!

‣ ఓటరు తీర్పులో ఒదిగిన సందేశం

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

Posted Date: 10-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం