• facebook
  • whatsapp
  • telegram

హిమానీ నదాలు ముంచేస్తాయా?పెచ్చుమీరుతున్న భూతాపం వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కరవు పరిస్థితులు జీవన స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీటికితోడు భౌగోళికంగా ఎంతో కీలకమైన హిమానీ నదాలు వేగంగా కరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


భూమిపై ఉష్ణోగ్రతల నియంత్రణ, మంచినీటి లభ్యత, జీవం మనుగడలో మంచు ఖండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఇవి వేగంగా క్షీణిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మంచినీరు మంచు రూపంలో ప్రధానంగా గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్, అంటార్కిటికాతో పాటు కొన్ని పర్వతాల్లో హిమానీనదాల రూపంలో ఉంది. ఐస్‌లాండ్, ఐరోపా, ఉత్తర-దక్షిణ అమెరికా ఖండాలు, ఆసియాలోని అనేక పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు విస్తరించి ఉన్నాయి. భూతాపం ఇలాగే పెరిగితే 21వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 5.8 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వన్యప్రాణి సంస్థ అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగితే విశ్వవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు పూర్తిగా కనుమరుగవుతాయని హెచ్చరించింది.  


తీరప్రాంతాలకు ముంపు గండం

ప్రపంచవ్యాప్తంగా వివిధ పర్వత ప్రాంతాల్లో రెండు లక్షలకుపైగా హిమానీనదాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో అవి వేగంగా కరిగి కనుమరుగవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వెనెజువెలాలోని ఆండీస్‌ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి అయిదు వేల మీటర్ల ఎత్తున ఆరు హిమానీ నదాలు ఉండేవి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో అందులో అయిదు గతంలోనే కరిగిపోయాయి. చివరిది సైతం తాజాగా పూర్తిగా క్షీణించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటికాలో ఏటా 15,000 కోట్ల టన్నులు, గ్రీన్‌లాండ్‌లో 27,000 కోట్ల టన్నుల మేర హిమం క్షీణిస్తోందని నాసా వెల్లడించింది. అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ పెద్ద మంచుకొండ ఇప్పుడు పలు దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. 1986లో విడిపోయిన ఈ మంచుకొండకు ఏ23ఏ అని పేరు పెట్టారు. దీని విస్తీర్ణం 3,800 చదరపు కిలోమీటర్లు. దాదాపు 30 ఏళ్ల పాటు ఒకే చోట స్థిరంగా ఉండిపోయిన ఈ మంచుకొండ 2020 నుంచి నెమ్మదిగా కదులుతోంది. దక్షిణ మహాసముద్ర జలాల మీదుగా తేలియాడుతూ దక్షిణ జార్జియా వైపు వస్తోంది. ఇది అక్కడి పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భయం స్థానికంగా వెంటాడుతోంది.


భారత ఉపఖండానికి సంబంధించి హిందూకుష్‌-హిమాలయ ప్రాంతంలోని ఎత్తయిన పర్వతాల్లో ఆవరించి ఉన్న హిమానీ నదాలను పర్యావరణవేత్తలు ప్రపంచ మూడో ధ్రువప్రాంతంగా అభివర్ణిస్తారు. ఆసియాలోని 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీరు, జీవనోపాధి కల్పిస్తున్న గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యాంగ్జీ, ఇర్రవాడీ, మీకాంగ్‌ వంటి నదులకు హిమాలయాలే పుట్టినిళ్లు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఈ పర్వతశ్రేణుల్లో హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు వేగంగా క్షీణిస్తోందని ఇస్రో గుర్తించింది. ఈ కరిగిన నీరు దిగువన సరస్సుల్లో కలవడం వల్ల వాటి పరిమాణం పెరుగుతోంది. 1984 నుంచి 2023 వరకు ఉపగ్రహ చిత్రాల్లో తేడాలను గుర్తించి నివేదికను ఇస్రో వెలువరించింది. హిమాలయాలకు దిగువన 10 హెక్టార్లకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న 2,431 హిమానీ సరస్సులపై ఇస్రో అధ్యయనం జరిపింది. వాటిలో 676 సరస్సుల విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు తేలింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఘెపన్‌ ఘాట్‌ సరస్సు 1989 నుంచి 2022 మధ్యకాలంలో 36.49 హెక్టార్ల నుంచి 101.3 హెక్టార్లకు పెరిగింది. ఈ పరిణామం జీవావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అక్కడి ప్రజలను వరదల రూపంలో నిత్య ప్రమాదం వెంటాడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్వతశ్రేణుల మధ్యన ఉన్న సరస్సులు, చెరువులు మంచునీటితో నిండి ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో అనేక విపత్తులు సంభవించాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమానీ నదాలు వేగంగా కరగడం వల్ల సముద్ర మట్టాలు పైకి ఎగబాకుతాయి. ఒక అధ్యయనం ప్రకారం 1880 నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు ఎనిమిది నుంచి తొమ్మిది అంగుళాల(21-24 సెంటీమీటర్ల) మేర పెరిగాయి. అంటార్కిటికాలోని థ్వైట్స్‌ హిమానీనదం ఊహించినదానికంటే నాలుగు రెట్లు వేగంగా కరిగిపోతోందని పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పూర్తిగా కరిగితే సముద్ర మట్టాలు మూడు మీటర్ల మేర పెరుగుతాయని, దానివల్ల అనేక తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టువాలు, సొలొమన్‌ దీవులు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలూ ముప్పు ముంగిట బిక్కుబిక్కుమంటున్నాయి. వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ అధ్యయనం ప్రకారం భారత్‌లోనూ 12 తీర ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది.


అందరి బాధ్యత

భూమిపై హిమానీనదాలు ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. జీవం ఉనికికి, అభివృద్ధికి ఈ మంచు ఎంతో దోహదపడింది. మన భవిష్యత్తు తరాలు భద్రంగా ఉండాలంటే హిమానీ నదాలను కాపాడుకోవాలి. ఇందుకోసం భూతాపాన్ని కట్టడి చేయాలి. అన్ని దేశాలు సమష్టిగా ఈ బాధ్యతను భుజానికెత్తుకోవాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పునరుత్పాదక వనరులవైపు మొగ్గు చూపాలి. సౌరశక్తిపై భారత్‌ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయం. విద్యుత్‌ వాహనాల వినియోగాన్నీ మరింతగా ప్రోత్సహించాలి. పచ్చదనాన్ని పెంచి ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా వాతావరణ మార్పులను నిరోధించాలి.


జీవవైవిధ్యానికి ముప్పు

హిమానీ నదాలు కరిగి మంచినీరు సరస్సులు, నదుల్లో కలుస్తుంది. ఈక్వెడార్, పెరూ, బొలీవియా సహా పలు దేశాలకు ఈ మంచినీరే ఆధారం. భూతాపంతో హిమానీ నదాలు పూర్తిగా కనుమరుగైతే ఆయా దేశాలు తాగునీటి కోసం కటకటలాడాల్సివస్తుంది. మంచు ఖండాలు క్షీణించడం వల్ల వాతావరణంలోనూ విపరీత మార్పులు సంభవించి తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు విజృంభిస్తాయని అధ్యయనాలు తెలియజెబుతున్నాయి. మంచు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు అక్కడి జీవజాతుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే అనేక జాతులు అంతరించిపోయాయి. మరికొన్ని కనుమరుగయ్యే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. హిమానీ నదాలు పూర్తిగా కరిగిపోవడం వల్ల వాటి కింద ఉండే పురాతన కాలంనాటి బ్యాక్టీరియా తిరిగి చైతన్యవంతమై ప్రపంచంపై పంజా విసిరే ముప్పూ పొంచి ఉంది. 
 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తైవాన్‌పై డ్రాగన్‌ దూకుడు

‣ ఆరేళ్ల నిబంధన అవసరమా?

‣ ఆహారభద్రతకు విఘాతం

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

Posted Date: 03-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం