• facebook
  • whatsapp
  • telegram

తైవాన్‌పై డ్రాగన్‌ దూకుడుతైవాన్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లాయ్‌ చింగ్‌ తె ఇటీవల చైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో డ్రాగన్‌ వరసగా రెండు రోజులు తైవాన్‌ జలసంధితో పాటు ఆ దీవి చుట్టూ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామంతో తైవాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.


ఈ ప్రపంచంలో ఒకే చైనా ఉంటుందని, తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని, ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుంటామని బీజింగ్‌ స్పష్టం చేస్తోంది. తైవాన్‌ మాత్రం తాము ప్రజాస్వామ్య పంథాను వీడబోమని, స్వతంత్రంగానే ఉంటామని తెగేసి చెప్పింది. ఇది డ్రాగన్‌కు మింగుడుపడలేదు. తన త్రివిధ దళాలతో తైవాన్‌ చుట్టూ పెద్దయెత్తున విన్యాసాలు నిర్వహించింది. తద్వారా చైనా ప్రత్యక్షంగా తైవాన్‌కు, పరోక్షంగా అమెరికాకు హెచ్చరికలు పంపినట్లయింది.


కొద్దినెలల క్రితం తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) నేత, దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్న లాయ్‌ విజయం సాధించారు. చైనా ఆధిపత్యాన్ని డీపీపీ అంగీకరించడం లేదు. బీజింగ్‌కు అనుకూల పక్షాలైన కొమింగ్‌తాంగ్‌ పార్టీ, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం డ్రాగన్‌కు రుచించలేదు. 1949లో చైనా నుంచి చాంగ్‌ కై షక్‌ సారథ్యంలోని కొమింతాంగ్‌ పార్టీ తైవాన్‌కు చేరుకొని రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాగా ప్రకటించింది. ప్రధాన భూభాగమైన పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా (పీఆర్‌సీ) దాన్ని అంగీకరించలేదు. డీపీపీ కన్నా ముందు అధికారంలో ఉన్న మా యింగ్‌ జ్యి చైనాతో సంబంధాలకు కృషి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన డీపీపీ తైవాన్‌ స్వతంత్ర దేశమని ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ‘ఒకే చైనా’ విధానంలో భాగంగా తైవాన్‌ ద్వీపం పీఆర్‌సీలో భాగమని బీజింగ్‌ స్పష్టం చేస్తోంది. 1992లో కుదిరిన ఒప్పందం మేరకు తైవాన్‌ జలసంధి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు చైనాలో అంతర్భాగమని, ఏకీకరణకు కృషి చేయాలని జిన్‌పింగ్‌ ప్రకటించారు. చైనాకు అనుకూల పక్షమైన కొమింతాంగ్‌- తైవాన్‌ స్వతంత్ర దేశమని ప్రకటించలేదు. హాంకాంగ్‌ తరహాలో ‘ఒకే దేశం- రెండు విధానాలు’ రీతిలో తైవాన్‌ కూడా చైనాలో విలీనమై స్వయం ప్రతిపత్తిని కొనసాగించవచ్చని జిన్‌పింగ్‌ సూచిస్తున్నారు. చైనా పునరేకీకరణలో ఎదురయ్యే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పడమే డ్రాగన్‌ తాజా విన్యాసాల ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ చైనా నిజంగానే దాడులకు దిగితే తమ చిప్‌ తయారీ యంత్రాలు పనిచేయకుండా ఉండేందుకు తైవాన్‌ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అంటే, దాడి జరిగిన పక్షంలో అంతర్జాతీయంగా సెమీ కండక్టర్లకు కొరత ఏర్పడుతుందన్న మాట. బీజింగ్‌కు సైతం ఈ విషయం అవగతమే. అందుకే డ్రాగన్‌ దాడులకు తొందరపడటం లేదు.


తైవాన్‌ను 2027లోగా చైనాలో విలీనం చేయాలని జిన్‌పింగ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, తైవాన్‌పై దండయాత్ర అంత సులభమేమీ కాదు. అది ద్వీపం కాబట్టి సైన్యం కంటే నౌకా దళాలను, వాయుసేనలనే భారీగా రంగంలోకి దించాల్సి ఉంటుంది. తైవాన్‌లో పర్వత ప్రాంతం ఎక్కువ. డ్రాగన్‌ సేనలు వాటిని ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆ క్రమంలో తైవాన్‌ దళాల నుంచి ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉంటుంది. ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, గువాం ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. తైవాన్‌పై ఎలాంటి దాడి జరిగినా తిప్పికొట్టేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ల ఆవశ్యకతను గుర్తించిన డ్రాగన్‌ తైవాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించకపోవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు భావిస్తున్నారు.


విద్యుత్‌ వాహన తయారీలో అందరికంటే ముందుండాలని చైనా ఆశిస్తోంది. వాటి తయారీకి సెమీకండక్టర్లు అత్యంత కీలకం. మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, వాహనాలు... ఇలా అనేక రంగాల్లో సెమీ కండక్టర్ల వినియోగం తప్పనిసరి. వీటి తయారీలో అగ్రగామిగా ఉన్న తైవాన్‌పై దాడులు చేస్తే బీజింగ్‌కు ఇబ్బందులు తప్పవు. ఎలెక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ పరిశ్రమ కుప్పకూలితే కొవిడ్‌ ఉద్ధృతి అనంతరం తేరుకుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థా మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే తిరోగమనంలో ఉన్న చైనా ఆర్థిక రంగాన్ని మరింత నష్టపరచే చర్యలను జిన్‌పింగ్‌ తీసుకోరని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.


- కె.శ్రీధర్‌ 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆరేళ్ల నిబంధన అవసరమా?

‣ ఆహారభద్రతకు విఘాతం

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

‣ కృత్రిమ మేధ ప్రభావమెంత?

‣ పర్యావరణానికి యుద్ధ గాయాలు

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

Posted Date: 03-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం