• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ మేధ ప్రభావమెంత?



ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) బాగా చర్చల్లో నిలుస్తోంది. దీనివల్ల ఉద్యోగాలు ఊడిపోతాయని, మనిషి సృజనాత్మకతకు ఇది ఒక ముగింపు అని  ప్రచారం సాగుతోంది. ఇది నిజమేనా? సాఫ్ట్‌వేర్‌ మొదలు పారిశ్రామిక రంగం వరకు ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది?


మానవుడి ఆలోచనాసరళికి అనుగుణంగా కంప్యూటర్‌ ప్రోగ్రాములు రాయడం, మనం అందించిన సమాచారాన్ని విశ్లేషించి, తద్వారా యంత్రాల పనితీరును మెరుగుపరచడమే కృత్రిమమేధ(ఏఐ). మనిషి ఎనిమిది గంటలే విధులు నిర్వర్తిస్తే, ఏఐ యంత్రాలు నిర్విరామంగా పనిచేయగలవు. వాటివల్ల సంస్థల ఉత్పాదకత పెరిగి వినియోగదారులకు ఉత్తమసేవలు అందే అవకాశం ఉంటుంది. ఒకే రకమైన ఉత్పత్తులను తయారుచేసే యంత్రాలలో ఏఐ ఉపయోగం అపారంగా ఉంటుంది. చాట్‌ జీపీటీ, అలెక్సా, సింథీసియా, గిట్‌హబ్‌ కాపిలాట్‌ వంటి ఏఐ సాఫ్ట్‌వేర్లను మొబైళ్లు, కంప్యూటర్లలో వాడటం వల్ల మనిషి తనకు కావాల్సిన సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో రాబడుతున్నాడు. ఈ సమాచారాన్ని తనకు అవసరమైన విధంగా మలచుకొని, ఉత్పాదకతను పెంచగలుగుతున్నాడు.


కృత్రిమ మేధ ప్రస్తుతం ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, సంస్థల్లో ఆసక్తిని, అదే సమయంలో గందరగోళాన్నీ పెంచుతోంది. దీని మూలంగా ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఊడిపోతాయని కొందరు చెబుతుంటే, కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే, ఈ సాంకేతికత వినియోగం వివిధ రంగాల్లో ఎలా ఉంటుంది, ఫలితాలు ఏ మేరకు ఉంటాయన్నదానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిజానికి వీటికి సమాధానాలు ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యపడదు. కృత్రిమ మేధను ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో విరివిగా వాడటం ఇప్పటికే మొదలైంది. రాబోయే అయిదేళ్లలో కృత్రిమ మేధలో పరిశోధనల కోసం భారత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో రెండు వేల కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధి కోసం సంస్థలకు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఏఐలో పరిశోధనల కోసం శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), నీతి ఆయోగ్‌లు అంకుర సంస్థలకు, విద్యాలయాలకు నిధులు అందిస్తున్నాయి. అయితే, కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్రవిజ్ఞానం, కంప్యూటర్‌ ప్రోగ్రాములు రాయగల సామర్థ్యాలను నేటి విద్యార్థులు పెంపొందించుకోవాలి. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌లలో కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధనలు పెద్దయెత్తున సాగుతున్నాయి. ఏఐను యంత్రాలకు అనుసంధానం చేయగల పరిజ్ఞానం ఉన్న యువత ఆ దేశాలకు వలస వెళ్ళకుండా మన దగ్గరే వారికి ఉపాధి కల్పించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. 


ఒక యంత్రానికి మనం అందించే సమాచారం ఎంత ఎక్కువగా ఉంటే, అంత కచ్చితమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా ఏఐ నమూనాలను సిద్ధం చేయాలి. లేకపోతే యంత్రాల తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో డేటాసైన్స్‌ ఇటీవల ఒక ప్రధానమైన అంశంగా మారింది. రక్షణ రంగంలో కృత్రిమ మేధను ఉపయోగించి రోబోలు, డ్రోన్లు, డ్రైవర్‌ రహిత వాహనాల తయారీలో చాలా దేశాలు ముందంజలో ఉన్నాయి. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాల్లో మనుషుల కన్నా యంత్రాలే ఎక్కువగా పాల్గొని జయాపజయాలను నిర్ణయించే అవకాశం ఉంది.


కృత్రిమ మేధను ఉపయోగించి మొదటిసారిగా వార్తావ్యాఖ్యాతను ఇజ్రాయెల్‌ సృష్టించింది. అయితే, మనిషి తన మేధను పెడదారి పట్టించడం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందించి ఇటీవల చాలామంది ప్రముఖులను ఇబ్బందులకు గురిచేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటివల్ల ఏది నిజమో, ఏది కల్పనో తెలియక సామాన్య జనం తికమక పడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి దశాబ్ద కాలంలో నానో టెక్నాలజీపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిమీద భారీగా ధనం వెచ్చించినా, కొన్ని దేశాలు నామమాత్రంగా ఫలితాలు రాబట్టగలిగాయి. నానో సాంకేతికతతో ఎలాంటి ఆవిష్కరణలు, వస్తువులను తయారు చేయలేకపోయాయి. ఇలాంటి పరిస్థితి ఏఐకి రాకూడదని విశ్వసిద్దాం. మనిషి తన మేధను సరైన దారిలో నడిపి కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించాలి. ఈ విజ్ఞానం పెడదారి పడితే ప్రపంచానికి పెను సవాళ్లు తప్పవని గుర్తించాలి. 


- డాక్టర్‌ కె.వీరబ్రహ్మం

(డీఆర్‌డీఓ శాస్త్రవేత్త)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణానికి యుద్ధ గాయాలు

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

‣ పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

‣ ద్రవ్యలోటును కట్టడి చేసేదెలా?

‣ ఏఐ శకంలో కొత్త ఒరవడి

‣ డిజిటల్‌ భారత్‌పై హ్యాకింగ్‌ పంజా

Posted Date: 01-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం