• facebook
  • whatsapp
  • telegram

భూగోళానికి వడదెబ్బ!



భానుడి భగభగలు భారతదేశంలో తారస్థాయికి చేరాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత వేసవిలో వడదెబ్బ కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు.


దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఎర్రటి ఎండలు, వడగాడ్పుల ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు ఒక్క మే నెలలోనే దేశవ్యాప్తంగా సుమారు 80 మంది మృతి చెందారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా గుండె సంబంధ సమస్యలు తలెత్తడంతో మరో 605 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 5,204 వడగాడ్పు కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌(4,357), ఏపీ (2,183) ఆ తరవాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. రాజస్థాన్‌ నుంచి వీస్తున్న వేడి గాలులవల్ల దిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.


భారతదేశ భౌగోళిక స్థితిగతులు ఉష్ణోగ్రతలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరాన ఉన్న ఎత్తయిన హిమాలయ పర్వత శ్రేణులు టిబెట్‌ పీఠభూమి, ఉత్తర మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లని గాలులను నిరోధిస్తాయి. దాంతో ఉత్తరాది ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. చలికాలంలో మాత్రం అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. ఇక దక్షిణ భారతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటంవల్ల సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. పైగా తీర ప్రాంతాలు హిందూ మహాసముద్రంలోని వెచ్చని జలాలకు ప్రభావితమవుతాయి. దాంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి తీరప్రాంతాలు తేమగా, కొండ ప్రాంతాలు చల్లగా ఉంటాయి. ఊటీ, అరకు వంటి కొన్ని ఎత్తయిన కొండ ప్రదేశాలు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. కర్బన ఉద్గారాలు అధికం కావడంవల్లా ఉష్ణోగ్రతలు అంతకంతకు ఎగబాకుతున్నాయి.


ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండాకాలంలా మారిపోతున్నట్లు అమెరికా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంటే, అక్కడ వసంత కాలం తగ్గిపోతోందన్న మాట. రాజస్థాన్‌లో ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి కన్నా 2.6 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైంది. దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌ వంటి చోట్లా జనవరి, ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రతల మధ్య రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వ్యత్యాసం కనిపిస్తోంది. మణిపుర్, సిక్కిమ్‌లలోనూ చలికాలం (డిసెంబరు-ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అధికంగా కనిపించింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి-మే మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. అధిక వేడిమివల్ల అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. దాంతో ఆహార భద్రతకు విఘాతం కలుగుతోంది.


భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడమనేది 1850 నుంచి మొదలైంది. అప్పటితో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల నిరుడు గరిష్ఠంగా 1.56 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది పారిస్‌ వాతావరణ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల కంటే అధికం! అందువల్లే, అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకు ఎక్కింది. నిరుడు భూగోళం ఎన్నడూ లేనంతగా పొగలు కక్కింది. భూమిపైన, నీటి ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. హిమానీనదాలు, సముద్రాల్లోని మంచు ఫలకాలు వేగంగా కరిగిపోతున్నాయి. 2024లోనూ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతాయన్నది ఐక్యరాజ్య సమితి అంచనా.


భూతాపం పెరగడమనేది యావత్‌ ప్రపంచానికీ అతిపెద్ద ప్రమాద హెచ్చరిక! హిమానీనదాల్లో 1950 నాటికే ఘనీభవించిన మంచు ఇప్పుడు చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిమాణం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు సుమారు మూడు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదలను పారిస్‌ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే దిగువకు కట్టడి చేసేందుకు దేశాలన్నీ చిత్తశుద్ధి కనబరచాలి. 2030నాటికి కర్బన ఉద్గారాలను 43శాతం మేర తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పవన, సౌర విద్యుదుత్పత్తిని ఇతోధికంగా పెంచాలి. పెట్రోలు, డీజిల్‌ వాడకాన్ని తగ్గించాలి. ఇటువంటి చర్యలతోనే పర్యావరణ పరిరక్షణ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడుతుంది.


- ఆచార్య నందిపాటి సుబ్బారావు 

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు) 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఓటరు తీర్పులో ఒదిగిన సందేశం

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

‣ తైవాన్‌పై డ్రాగన్‌ దూకుడు

‣ ఆరేళ్ల నిబంధన అవసరమా?

‣ ఆహారభద్రతకు విఘాతం

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

Posted Date: 04-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం