• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ కోసం... వెదురు పెంపకం!



వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గాలి నుంచి కార్బన్‌ డైఆక్సైడ్‌ను సంగ్రహించడం ఒక ముఖ్యమైన మార్గం. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంవల్ల ఈ ప్రక్రియ సులభమవుతుంది. త్వరితగతిన ఎదిగే వెదురు పెంపకం ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేసే వీలుంది.


కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన ఏటా దేశవ్యాప్తంగా వన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విదేశీ జాతులకు చెందిన మొక్కలను నాటడం, పెంచడం వల్ల స్థానిక జీవవైవిధ్యానికి పెను ముప్పు ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న కోనోకార్పస్, లాంటేనా వంటి విదేశీ జాతులను అదుపు చేయాల్సిన అవసరముంది. అడవుల పెంపకం ద్వారా 2030 నాటికి మూడు గిగా టన్నుల వరకు కార్బన్‌ డైఆక్సైడ్‌ను సంగ్రహించగల ‘కార్బన్‌ సింక్‌’ను సృష్టిస్తామని 2015లో పారిస్‌ వాతావరణ సదస్సు సందర్భంగా భారత్‌ వెల్లడించింది. వెదురు వనాల పెంపకం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని పరిశోధకులు అంటున్నారు.


అనేక దేశాల్లో వెదురును పూర్వకాలం నుంచీ ఆహారం, గృహ నిర్మాణంతో పాటు సంగీత వాయిద్యాలు, పనిముట్లు, వస్తు సామగ్రి తయారీలో వినియోగిస్తున్నారు. ఆధునిక కాలంలో మానవ చర్యల మూలంగా కర్బన ఉద్గారాలు పెద్దయెత్తున వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. పర్యవసానంగా భూతాపం అంతకంతకు అధికమవుతోంది. అయితే, కర్బన ఉద్గారాలను గ్రహించే శక్తి వెదురుకు పుష్కలంగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. భారతదేశంలో సుమారు 136 రకాల వెదురు జాతులున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 1.40 కోట్ల హెక్టార్ల మేర విస్తరించిన వెదురు వనాలు ఏటా 12 కోట్ల టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ను గ్రహిస్తున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.15 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వెదురు అడవులున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్, మయన్మార్‌లలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటోంది. వాతావరణ మార్పులను తగ్గించడంలో వెదురు ప్రాధాన్యాన్ని గుర్తించిన ఇథియోపియా, ఘనా వంటి ఆఫ్రికన్‌ దేశాలు తమ అడవుల పునరుద్ధరణలో భాగంగా వెదురు పెంపకాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తున్నాయి. చైనా, కొలంబియా, ఈక్వెడార్‌ వంటి దేశాలు సైతం వాతావరణ మార్పులను నిలువరించడం కోసం వెదురు పెంపకంపై దృష్టి సారించాయి. మన దేశంలోని వెదురు వనాల్లో సగానికి పైగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయి.


కేంద్ర ప్రభుత్వం జాతీయ వెదురు మిషన్‌ ద్వారా వెదురు పెంపకం, వినియోగాన్ని ప్రోత్సహించాలని లక్షించింది. పర్యావరణ పరిరక్షణకు తోడు గ్రామీణులకు జీవనోపాధి పెంచడం కోసం అటవీయేతర ప్రాంతాల్లోనూ దాని పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. శాస్త్రీయంగా వెదురు గడ్డి జాతికి చెందినది. ఉష్ణమండల, సమశీతోష్ణ వాతావరణంలో అది వేగంగా పెరుగుతుంది. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరమే లేదు. కొన్నిరకాల వెదురు జాతులు చాలా వేగంగా పెరుగుతాయి. వెదురుకున్న మరో ప్రత్యేకత దాని వేళ్లు. అవి నేలకోతను సమర్థంగా అడ్డుకోగలుగుతాయి. కాండాన్ని నరికేసినా మళ్ళీ నాటాల్సిన అవసరం ఉండదు. తిరిగి అది చిగురించడానికి వేళ్లు దోహదపడతాయి. వెదురు వేళ్లు నేల పైపొరను పట్టి ఉంచడంతో పాటు వాననీరు భూమిలోకి ఇంకడానికి తోడ్పడతాయి. నదీ తీరాలు, కొండ చరియలతో పాటు నేల తరచూ కోతకు గురయ్యే చోట్ల వెదురును పెంచడం ఉత్తమం. తద్వారా మృత్తికా క్రమక్షయాన్ని నియంత్రించడంతో పాటు భూమిలో సేంద్రియ పదార్థాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. పెద్దయెత్తున సేంద్రియ పదార్థాలను నిల్వచేసే వెదురును ‘బయోచార్‌’గా మార్చవచ్చు. తక్కువ ఆక్సిజన్‌ స్థాయుల వద్ద సేంద్రియ పదార్థాలను మండించడం ద్వారా బయోచార్‌ తయారవుతుంది. ఈ ప్రక్రియను పైరోలిసిస్‌ అంటారు. దీనివల్ల పర్యావరణంతో పాటు సేద్యానికి సైతం అనేక ప్రయోజనాలు ఒనగూడతాయి. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వెదురు పెంపకం, నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరముంది.


నగరాలు, పట్టణాల్లో రహదారుల పక్కన, డివైడర్ల మధ్య పెంపకానికి వెదురు అనుకూలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చేపట్టే కాలుష్య కట్టడి చర్యల్లో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించాలి. అడవుల పునరుద్ధరణ, నేలకోత నివారణ వ్యూహాల్లోనూ దీన్ని చేర్చడం పర్యావరణ పరిరక్షణలో మేలిమలుపు కాగలదు. వెదురు పెంపకం ద్వారా స్థానిక సంస్థలకు, గ్రామీణులకు ఆర్థిక ప్రయోజనాలు అందివస్తాయి. కాబట్టి, ప్రభుత్వాలు వెదురు వనాల పెంపకం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది.


- గొడవర్తి శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉదారవాదికి ఇరాన్‌ పట్టం

‣ జల వనరులకు నష్టం... దేశార్థికానికి కష్టం

‣ దేశ భద్రత... అగ్నివీరుల భవిత... జంటగా సంస్కరణలు!

‣ సమున్నత ఆశయాల యువభారతం

‣ నైపుణ్య యుక్తితో యువ‘శక్తి’!

‣ జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?

‣ చైనా విస్త‘రణం’... శాంతికి అవరోధం

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని