• facebook
  • whatsapp
  • telegram

చైనా విస్త‘రణం’... శాంతికి అవరోధం



దక్షిణ చైనా సముద్రంలో రెండో థామస్‌ షోల్‌ దీవి దగ్గర ఫిలిప్పీన్స్‌ నౌకాదళ సిబ్బందిపై చైనా ఇటీవల దాడి చేసింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డ్రాగన్‌ విపరీత విస్తరణ కాంక్ష అంతర్జాతీయ శాంతికి విఘాతకరంగా మారింది. 


దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ, పారాసెల్‌ తదితర దీవుల సమూహాల విషయంలో చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రునై, మలేసియా, తైవాన్‌లకు వివాదముంది. ఆయా దేశాల అభ్యంతరాలను తోసిపుచ్చి 1940ల నుంచి ఆ దీవులన్నీ తనవేనని చైనా వాదిస్తోంది. కాలం చెల్లిన ఆధారాలను పట్టుకొని ఆ సముద్రంలో 90శాతం తనదేనని డ్రాగన్‌ దేశం ప్రకటించింది. ఈ వాదనను తొలిసారి తెరపైకి తెచ్చిన చైనా కొమిన్‌టాంగ్‌ పార్టీ నేతలు 1949లో తైవాన్‌కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో తైవాన్‌ సైతం అవి తమ ప్రాదేశిక జలాల్లో ఉన్నట్లు చెబుతోంది. స్ప్రాట్లీ దీవులు దాదాపు వందకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఫిలిప్పీన్స్‌ తన అధీనంలో ఉంచుకొంది. అవన్నీ తమ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకే వస్తాయని ఫిలిప్పీన్స్‌ ప్రకటించింది. రెండో థామస్‌ షోల్‌ దీవి చైనా, ఫిలిప్పీన్స్‌ మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దానిపై తన సార్వభౌమాధికారం ఉండాలని ఫిలిప్పీన్స్‌ 1999లో అక్కడ ఒక పాత యుద్ధనౌకను నియమించింది. అది పాడుబడిపోవడంతో ఔట్‌ పోస్టు పనిచేస్తోంది. కొంతమంది నావికులు అక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి నిత్యం పడవల ద్వారా ఫిలిప్పీన్స్‌ దళాలు ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేస్తుంటాయి. అలా వస్తున్న బోట్లపైనే చైనా దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఫిలిప్పీన్స్‌ దళాలు సంయమనం పాటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అమెరికా-ఫిలిప్పీన్ల మధ్య రక్షణ ఒప్పందం ఉంది. దీంతో అగ్రరాజ్యం రంగ ప్రవేశం చేస్తే బీజింగ్‌-వాషింగ్టన్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.  


సముద్రమట్టాలు పెరుగుతుండటంతో స్ప్రాట్లీ దీవుల్లో చాలా వరకు కోతకు గురవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చమురు, గ్యాస్‌ నిక్షేపాలు భారీస్థాయిలో ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న చైనా- చమురు నిక్షేపాల ఆచూకీ తెలియడంతో వెంటనే అప్రమత్తమైంది. దాదాపు 90శాతం దక్షిణ చైనా సముద్రం తన పరిధిలోకి వస్తుందని ఏకపక్ష ప్రకటన చేసింది. 1995లో మిస్చిఫ్‌ రీఫ్‌ దీవిని చైనా స్వాధీనం చేసుకుంది. అది ఫిలిప్పీన్స్‌ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోనే ఉంది. డ్రాగన్‌ దుందుడుకు వైఖరిని తీవ్రంగా ఖండించిన అప్పటి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు బెనిగ్నో అకీనో ఐరాస ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. చైనా ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని అది తీర్పిచ్చింది. బీజింగ్‌ ఆ తీర్పును పట్టించుకోలేదు. తన అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కృత్రిమ దీవులను నిర్మించింది. బెనిగ్నో అనంతరం పదవిలోకి వచ్చిన దుతెర్తె బీజింగ్‌తో వాణిజ్యానికే ప్రాధాన్యం ఇచ్చినా, చైనా నావికాదళం ఆగడాలు తగ్గలేదు. 2022లో ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం చైనాను నిలువరించేందుకు యత్నాలు ప్రారంభించడం డ్రాగన్‌ దేశానికి కంటగింపుగా మారింది. జిన్‌పింగ్‌తో మార్కోస్‌ చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చైనా ప్రజా విమోచన దళాలు ఫిలిప్పీన్స్‌పై దాడికి దిగితే అది ఆసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదముందని అమెరికాలోని ఫిలిప్పీన్స్‌ రాయబారి హెచ్చరించారు. 


అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయాల్లో దక్షిణ చైనా సముద్రానికి కీలక ప్రాధాన్యం ఉంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఉండటంతో చమురు రవాణాతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు అది కీలక మార్గంగా నిలుస్తోంది. అందులో మత్స్య సంపద భారీగా లభ్యమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఎలాంటి అలజడులు రేగినా అంతర్జాతీయ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు ఇండియాతో ఫిలిప్పీన్స్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే బ్రహ్మోస్‌ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు భారత్‌ సరఫరా చేసింది. అమెరికాతో ఫిలిప్పీన్స్‌ రక్షణ ఒప్పందం, తన సైన్యాన్ని మనీలా ఆధునికీకరించడం వంటివి దక్షిణ చైనా సముద్రంలోని దీవులను దురాక్రమించకుండా చైనాను నిలువరిస్తున్నాయి. డ్రాగన్‌లో విస్తరణ కాంక్ష రగులుతున్నంతకాలం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉంటాయి.  


- కొలకలూరి శ్రీధర్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సత్వర న్యాయం సాకారమవుతుందా?

‣ జన విస్ఫోటం... సమస్యలకు మూలం!

‣ ఆయుధ స్వావలంబన కోసం...

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

Posted Date: 08-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని