• facebook
  • whatsapp
  • telegram

ప్రాభవం కోల్పోతున్న జీ7ఇటీవల ఇటలీలో ఎంతో ఆర్భాటంగా గ్రూప్‌ ఆఫ్‌ 7 (జీ7) దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. జీ7 ఏర్పడిన కొత్తల్లో  ప్రపంచంలో ఈ బృందంలోని దేశాలే అత్యంత అభివృద్ధి   చెందినవిగా ఉండేవి. అందువల్ల జీ7 సభల తీర్మానాలకు  ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ కాలంతో పాటు జీ7 ప్రాముఖ్యమూ మారిపోయింది. నేటి ప్రపంచంలో  జీ7కు ఎంత ప్రాధాన్యం ఉందనేది కీలక ప్రశ్న. 


ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాల బృందంగా అభివర్ణించుకొనే జీ7 సమూహం 1975లో ఏర్పాటైంది. ఇందులో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యులుగా ఉన్నాయి. తరవాత రష్యాను కలుపుకొని జీ8గా మారిన ఈ బృందం- 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో ఆ దేశాన్ని సస్పెండ్‌ చేసి మళ్ళీ జీ7గా నిలిచింది. ఇందులో ఐరోపా సమాఖ్య (ఈయూ)ను కూడా పూర్తిస్థాయి సభ్యురాలిగా పరిగణిస్తారు. అయితే ఈయూ ఇతర సభ్యదేశాల మాదిరిగా రొటేషన్‌ పద్ధతిపై జీ7కు అధ్యక్షత వహించే సంప్రదాయం లేదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానితులుగా జీ7 సభలో పాల్గొంటాయి. భారతదేశం కూడా ఆహ్వానిత హోదాలో పాల్గొంటూ వస్తోంది. 


పుతిన్‌ షరతులు

అంతర్జాతీయ ఆర్థిక సమస్యలు, భద్రత, ఇతర కీలక సమస్యలపై చర్చించడానికి జీ7 ఏటా సమావేశమవుతుంది. జీ7 ఒక సాధికార ఒప్పందం ద్వారా నెలకొన్న బృందం కాదు. దానికి శాశ్వత ప్రధాన కార్యాలయం అంటూ ఎక్కడా లేదు. ఏటా ఒక సభ్య దేశంలో శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ ఏడాది ఇటలీ ఆతిథ్యం ఇచ్చింది. వచ్చే ఏడాది సదస్సు కెనడాలో జరుగుతుంది. ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఆహ్వానితుని హోదాలో పాల్గొన్నారు. సహజంగానే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం గురించి జీ7 చర్చించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తగానే పాశ్చాత్య బ్యాంకులు తదితర చోట్ల ఉన్న రష్యా ఆస్తులను స్తంభింపజేశారు. వాటి నుంచి 5,000 కోట్ల డాలర్లను ఉక్రెయిన్‌కు సహాయంగా అందించాలని జీ7 నిశ్చయించింది. ఐరోపాకు అక్రమ వలసలను నిరోధించడం, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం, కృత్రిమ మేధ వంటి అంశాలపైనా జీ7 దేశాలు చర్చించాయి. ఉక్రెయిన్‌ గురించి జీ7 పట్టించుకొంటున్న సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి సంప్రదింపులకు, కాల్పుల విరమణకు కొన్ని షరతులు విధించారు. రష్యా తనవిగా ప్రకటించిన ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సేనలు వైదొలగాలని, నాటోలో ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదని, రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన షరతులు పెట్టారు. జీ7 కూటమికానీ, స్విట్జర్లాండ్‌లో జరిగిన శాంతి సభ కానీ తనపై ఒత్తిడి పెంచలేవని తన షరతుల ద్వారా పుతిన్‌ స్పష్టం చేశారు. 2000 సంవత్సరం నుంచి కొనుగోలు శక్తి పరంగా ప్రపంచ జీడీపీలో జీ7 వాటా తగ్గిపోతోంది. 2000 సంవత్సరంలో 40శాతంగా ఉన్న జీ7 వాటా ఇప్పుడు 30శాతం దిగువకు పడిపోయింది. భారత్, చైనాలు ఆర్థికంగా విజృంభించడం జీ7 వాటా తగ్గడానికి ప్రధాన కారణం. జీ7కు అమెరికా పెద్దన్న వంటిది కాబట్టి రష్యా, చైనాలపై ఈ బృందం విరుచుకుపడుతూ ఉంటుంది. తదనుగుణంగా ఈ ఏడాది జీ7 శిఖరాగ్ర సభ రష్యాకు చైనా ఆయుధాలు, ఇతరత్రా సహాయాలను అందిస్తే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇరుగుపొరుగులపై చైనా కబ్జా ధోరణి మానుకోవాలని పేర్కొంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో బీజింగ్‌ దుందుడుకు పంథాను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని జీ7 సంయుక్త ప్రకటన హెచ్చరించింది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనను జీ7 నిరసించింది. టిబెట్‌ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని బీజింగ్‌ కాలరాసిందని, షింజియాంగ్‌ ప్రజలతో వెట్టి చాకిరీ చేయిస్తోందని విమర్శించింది. 


ప్రజాస్వామ్య సమూహం 

ఇప్పటికీ జీ7 ప్రజాస్వామ్య దేశాల సమూహంగానే ఉంది. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లు ప్రజాస్వామ్య, నియంతృత్వ దేశాల మేళవింపుగా ఉన్నాయి. బ్రిక్స్, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. జీ7 సభ్య దేశాల మధ్యనైతే ఇటువంటి విభేదాలు, సంఘర్షణలు లేవు. అయితే, ఈ ఏడాది పలు జీ7 దేశాల్లో జరగనున్న ఎన్నికలతో పరిస్థితి మారే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో అతిమితవాద పార్టీలకు ఎక్కువ ఓట్లు లభించాయి. ఇది మున్ముందు జీ7 నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే జీ7లోని ఇతర సభ్యదేశాల పట్ల అమెరికా వైఖరి మారవచ్చు. అలాగే బ్రిటన్‌లో రిషీ సునాక్‌ లేబర్‌ పార్టీ నాయకుడు కెయిర్‌ స్టార్మర్‌ చేతిలో ఓడిపోవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో అతిమితవాద నేషనలిస్ట్‌ పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించవచ్చు. జర్మనీలో కూడా అతిమితవాద ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ పార్టీ ముందంజలో ఉంది. కెనడాలో జస్టిన్‌ ట్రూడో విజయావకాశాలు తగ్గిపోతున్నాయి. జపాన్, ఇటలీలలో పరిస్థితులు స్థిరంగానే ఉన్నా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా అతిమితవాది. వచ్చే ఏడాది కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్ర సభకు భారత్‌ను ఆహ్వానించేది లేనిదీ ట్రూడో వెల్లడించకపోయినా, మిగతా సభ్య దేశాల ఒత్తిడి వల్ల ఆహ్వానించక తప్పకపోవచ్చు. ప్రజాస్వామ్య దేశాల బృందంగా నిలుస్తున్న జీ7 సాటి ప్రజాస్వామ్యమైన భారత్‌ను కలుపుకొనిపోక తప్పదు. 


జీ20 నిర్ణయాలే ముఖ్యం?

జీ7కన్నా బ్రిక్స్, ఎస్‌సీఓలు పోనుపోను ఎక్కువ ఆర్థిక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ప్రపంచ జనాభాలో జీ7 దేశాల వాటా పది శాతం. బ్రిక్స్‌ (భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా) వాటా 45శాతం. ప్రపంచ జీడీపీలో జీ7 వాటా 30శాతమైతే, బ్రిక్స్‌ వాటా 32శాతం. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో చైనా, భారత్, రష్యా, కజఖ్‌స్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు ఉన్నాయి. ఇవి ప్రపంచ జనాభాలో 42శాతాన్ని, జీడీపీలో 25 శాతాన్ని ఆక్రమిస్తున్నాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌తో కలిసి జీ21గా మారిన జీ20లో జీ7 దేశాలకూ సభ్యత్వముంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు, ప్రపంచ జీడీపీలో 85 శాతానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి జీ20 మూలం. కాబట్టి జీ7 తీసుకునే నిర్ణయాలకన్నా జీ20 నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

Posted Date: 26-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని