• facebook
  • whatsapp
  • telegram

దక్షిణాఫ్రికాలో గాలి మార్పుదక్షిణాఫ్రికా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఏఎన్‌సీ) ఆధిక్యం సాధించలేకపోయింది. అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా నేతృత్వంలోని ఏఎన్‌సీ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. డెమొక్రటిక్‌ అలయన్స్‌(డీఏ) తదితర పక్షాల మద్దతుతో రామఫోసా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.


మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే క్రిమినల్‌ కేసులో అరెస్టు కావడంతో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధించింది. అయినాసరే, ఆయన పార్టీ 58 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. ఏఎన్‌సీ తొలిసారిగా మెజారిటీ కోల్పోవడానికి పలు కారణాలు తోడయ్యాయి. జుమా కొత్త పార్టీ కొంతమేర ఓట్లను చీల్చడం, దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, పేదరికం, కరెంటు కోతలు... తదితర అంశాల కారణంగా పార్టీకి విధేయులుగా ఉన్న అనేకమంది ఓటర్లు ఇతర పక్షాల వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు అధ్యక్షుడు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న విమర్శలున్నాయి.


జాతి దుర్విచక్షణ కబంధహస్తాల నుంచి విముక్తి పొందిన దక్షిణాఫ్రికా 1994లో నూతన రాజ్యాంగం రూపొందించుకుంది. పార్లమెంటులోని నేషనల్‌ అసెంబ్లీలో 400 సీట్లు, ఎగువసభ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ప్రావిన్సెస్‌లో 90 స్థానాలు ఉంటాయి.  దక్షిణాఫ్రికాలో పార్లమెంటరీ విధానం అమలులో ఉంది. దిగువ సభలో మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీ నేత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ ఇక్కడ ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను నేరుగా ఎన్నుకోరు. బరిలో ఉన్న రాజకీయ పక్షాలకు ఓటు వేస్తారు. పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి ఆయా పక్షాలకు చెందిన సభ్యులను ప్రజాప్రతినిధులుగా నియమిస్తారు. జాతి దుర్విచక్షణకు అంతం పలికిన 1994 నాటి తొలి ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) నేత నెల్సన్‌ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి 2019 వరకు ఆ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. గత ఎన్నికల్లో రామఫోసా 57.50 శాతం ఓట్లతో ఏకంగా 230 సీట్లు సాధించారు. తాజా ఎన్నికల్లో 159 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. రామఫోసా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీ లేకపోవడంతో రెండో అతిపెద్ద పక్షమైన డెమొక్రటిక్‌ అలయన్స్‌ (డీఏ)తో చివరి నిమిషంలో కుదిరిన ఒప్పందంతో ఏఎన్‌సీకి అధ్యక్ష పీఠం దక్కింది. డెమొక్రటిక్‌ అలయన్స్‌ శ్వేతజాతీయుల హక్కుల పరిరక్షణకు ఏర్పడిన పార్టీ కావడం విశేషం. సిద్ధాంత రీత్యా భిన్నధ్రువాలుగా ఉన్న రెండు పక్షాలతో పాటు మరికొన్ని చిన్న పక్షాలు కూటమిగా ఏర్పడటం అందరినీ ఆశ్చర్యపరచింది. రెండుపక్షాల సభ్యుల సంఖ్య అవసరమైన మెజారిటీకన్నా ఎక్కువగానే ఉండటంతో ఇప్పట్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండబోవని అధ్యక్షుడు విశ్వసిస్తున్నారు. అయితే, రెండు పక్షాల మధ్య అనేక అంశాల్లో సయోధ్య లేకపోవడంతో రానున్న కాలంలో ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను అధ్యక్షుడు ఖండించడంతో పాటు అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేశారు. మరోవైపు, టెల్‌ అవీవ్‌ విధానాలను డీఏ సమర్థిస్తోంది. దేశ రాజకీయాల్లో సంకీర్ణయుగం ప్రారంభమైందని... ప్రధాన విపక్షమైన డీఏతో ఒప్పందం దేశాభివృద్ధికి దోహదపడుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజాతీర్పును గౌరవించకుండా డీఏతో కలవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.


విపక్షాలతోనూ స్నేహసంబంధాలను మెరుగుపరచుకోవాలన్న సదాశయంతో మండేలా గతంలో విపక్షాలను సైతం ప్రభుత్వం, మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షమైన నేషనల్‌ పార్టీ, ఇంకాథ ఫ్రీడం పార్టీలు ప్రభుత్వంలో చేరాయి. కొన్ని చిన్న పార్టీలు విపక్షంలోనే ఉండిపోయాయి. నేషనల్‌ పార్టీ నేత డి క్లార్క్‌కు రెండో డిప్యూటీ ప్రధాని పదవి సైతం లభించింది. అప్పటి జాతీయ ప్రభుత్వ ఏర్పాటులో రామఫోసా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన సారథ్యంలో దక్షిణాఫ్రికాలో రెండోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకావడం గమనార్హం. అప్పట్లో మెజారిటీ ఉన్నా దేశాన్ని ఏకతాటిపై నడిపేందుకు జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కాగా, తాజాగా మెజారిటీ కరవై డీఏ తదితర పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో భారత్‌కు సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరుదేశాలు బ్రిక్స్‌ కూటమిలో సభ్యులే. వాణిజ్య, సైనికపరంగానూ స్నేహసంబంధాలున్నాయి. నూతన సంకీర్ణ ప్రభుత్వ హయాములోనూ ఇదే ఒరవడి కొనసాగాల్సిన అవసరం ఉంది.


- కొలకలూరి శ్రీధర్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

Posted Date: 19-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని