• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆ దేశంతో కలిసి చైనా, జపాన్‌లు త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో డ్రాగన్‌ ఆధిపత్య ధోరణులు, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరివల్ల ఈ మూడు దేశాల నడుమ ఉద్రిక్తతలు తలెత్తాయి. వాటిని ఉపశమింపజేయడంతో పాటు ఆర్థిక బంధాలను పటిష్ఠం చేసుకోవడానికి త్రైపాక్షిక సమావేశాలు తోడ్పడుతున్నాయి.


చైనా, జపాన్, దక్షిణ కొరియాలు ఇప్పటివరకు తొమ్మిదిసార్లు త్రైపాక్షిక సమావేశాలు నిర్వహించాయి. కొవిడ్‌ వల్ల 2019లో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఇటీవలి సియోల్‌ సమావేశానికి చైనా ప్రధాని లీ కియాంగ్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా విడుదలచేసిన 36 అంశాల సంయుక్త ప్రకటన- ఈశాన్య ఆసియా, కొరియా ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతల కోసం పిలుపిచ్చింది. స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులను విడనాడి, స్వేచ్ఛా వాణిజ్యానికి ఊపునివ్వాలని చైనా ఈ సమావేశంలో జపాన్, దక్షిణ కొరియాలను కోరింది.


తైవాన్‌ తనలో విలీనం కావాలని చైనా పట్టుపట్టడంతోపాటు దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ తీరస్థ దేశాలతో పేచీ పెడుతోంది. తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న సెంకాకు దీవులు కూడా తనవేనంటోంది. ఇక ఉత్తర కొరియా పదేపదే క్షిపణి పరీక్షలు, గూఢచర్యానికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలు, సరిహద్దు విన్యాసాలతో జపాన్, దక్షిణ కొరియాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో చైనా, జపాన్, దక్షిణ కొరియాల త్రైపాక్షిక సమావేశాన్ని అవి తమ ప్రాంతంలో సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి చేసిన ప్రయత్నంగా చూడాలని షిల్లాంగ్‌లోని ఆసియన్‌ కాన్‌ఫ్లుయెన్స్‌ సంస్థకు చెందిన కె.యోమ్‌ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, అమెరికా ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడును అడ్డుకోవడానికి కృతనిశ్చయంతో ముందుకుసాగడాన్ని గమనించాలన్నారు. చైనాకు ముకుతాడు వేసేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి అమెరికా ‘క్వాడ్‌’ కూటమిని ఏర్పాటు చేసింది. ఇటీవల అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌లు కలిసి ‘స్క్వాడ్‌’ కూటమిగా అవతరించాయి. ఈ రెండింటిలో సభ్యురాలైన జపాన్‌- తాను చైనాతో సంప్రతింపులు చేపట్టడానికి సిద్ధమని, డ్రాగన్‌ విషయంలో బద్ధ వ్యతిరేక వైఖరిని అనుసరించలేనని చాటడానికి త్రైపాక్షిక సమావేశాన్ని ఉపయోగించుకుంది. తైవాన్‌ తమ అంతర్భాగమని, తమతో విలీనం కావాలని చైనా పట్టుబడుతుంటే- బలప్రయోగంతో తైవాన్‌ను ఆక్రమించరాదని అమెరికా స్పష్టం చేస్తోంది. చైనా దురాక్రమణను ఎదిరించడంలో తైవాన్‌కు అండగా ఉంటానంటూ ఆయుధ సహాయం చేస్తోంది. చైనా దీన్ని నిరసిస్తూ తైవాన్‌ చుట్టూ సైనిక, నౌకా విన్యాసాలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ పరిణామాలు జపాన్, దక్షిణ కొరియాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ ప్రాంతంలో ఆవేశకావేషాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే దక్షిణ కొరియా త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని భావించవచ్చు. అదే సమయంలో ఉత్తర కొరియా దుందుడుకు చేష్టలను, వాటికి చైనా లోపాయికారీ మద్దతును దక్షిణ కొరియా విస్మరించలేదు.


క్వాడ్‌ పంథాలోనే దక్షిణ కొరియా కూడా ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. ఈ ప్రాంతంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణకు సంబంధిత దేశాలు నియమబద్ధంగా వ్యవహరించాలని కోరుతోంది. అంతర్జాతీయంగా ఆమోదనీయమైన నియమ నిబంధనలను చైనా గౌరవించాలని అమెరికా ఆశిస్తోంది. దక్షిణ కొరియా వైఖరి కూడా అదే! కానీ అమెరికా, భారత్, ఆస్ట్రేలియాల మాదిరిగా చైనాకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశాన్ని మాత్రం ప్రకటించడం లేదు. 1953లో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరినప్పటికీ, చైనాతో సియోల్‌కు బలమైన ఆర్థిక బంధం ఉంది. 2015లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటి నుంచి దక్షిణ కొరియాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కాబట్టి చైనాతో ముఖాముఖి ఘర్షణకు సియోల్‌ సిద్ధంగా లేదు.


భారత్‌ చైనాతో పోటీపడుతూనే, సహకారమూ నెరపుతోంది. అదే సమయంలో జపాన్, దక్షిణ కొరియాలతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తోంది. అమెరికా, జపాన్‌లతో పాటు రష్యా, చైనాలతోనూ త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక ఒప్పందం (ఆర్‌ఐసీ) అమెరికా, జపాన్‌లకు వ్యతిరేకం కాదు. అదే మాదిరిగా అమెరికా, జపాన్, భారత్‌ల త్రైపాక్షిక పొత్తు చైనాకు వ్యతిరేకం కాదు. కాబట్టి చైనా, జపాన్, దక్షిణ కొరియాలు ఎన్ని త్రైపాక్షిక సమావేశాలు నిర్వహించినా అమెరికాతో తమ పొత్తునుగాని, క్వాడ్‌లో భాగస్వామ్యాన్నిగాని భారత్, జపాన్‌లు వదులుకోవు.


- అరూణిమ్‌ భూయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

‣ స్విస్‌ సదస్సుకు భారత్‌

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

Posted Date: 19-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని