• facebook
  • whatsapp
  • telegram

భూ సంరక్షణతో కరవుమీద పైచేయిమానవాళి స్వార్థపూరిత చర్యల వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. విపరీతమవుతున్న ఎడారీకరణ, భూ క్షీణత, కరవు కాటకాలు నేడు మానవాళి మనుగడకు అనేక సవాళ్లు విసరుతున్నాయి. ప్రపంచదేశాలు కలిసికట్టుగా వాటిని ఎదుర్కోవాలి.


విచ్చలవిడి మానవ కార్యకలాపాల వల్ల భూసారం అంతకంతకూ తెగ్గోసుకుపోతోంది. అడవుల విధ్వంసం మూలంగా జీవ వైవిధ్య సంపద అంతరించిపోతోంది. వీటివల్ల భూ సహజ స్వభావంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలూ పెచ్చరిల్లుతున్నాయి. పర్యవసానంగా వ్యవసాయం, జీవనోపాధి, ఆహార భద్రతలకు పెరిగిన పెనుముప్పు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఎడారీకరణ, కరవు కట్టడి దినోత్సవం సందర్భంగా నేలలను సుస్థిర యాజమాన్య పద్ధతులతో జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి చాటిచెబుతోంది. ఈ సంవత్సరం ‘భూ సంరక్షణకు, భావితరాల భద్రతకు, మన భవిష్యత్తుకు అందరం ఏకమవుదాం’ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.


ప్రమాదంలో ఆహార భద్రత

వాతావరణ మార్పుల వల్ల తలెత్తే కరవు కాటకాలను ఎదుర్కొనేందుకు సుస్థిర భూ యాజమాన్య పద్ధతులే సరైన మార్గమని రియో ఒప్పందం మూడు దశాబ్దాల కిందటే చాటిచెప్పింది. అయినా, ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఆశించిన స్థాయిలో పాటుపడటం లేదు. ఆహారం, దుస్తులు, ఆవాసంతో పాటు జీవనోపాధులను కల్పించడంలో భూవనరులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అధికమవుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పాదకత, సహజ వనరుల కోసం విచ్చలవిడిగా గనుల తవ్వకాలు మూలంగా నేలపై ఒత్తిడి పెరిగిపోతోంది. భూక్షీణత వల్ల విలువైన భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. వాటి ఉత్పాదకత తగ్గిపోతోంది. ఈ దుస్థితినే ఎడారీకరణగా పిలుస్తారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం మూలంగా నెలకొంటున్న ప్రకృతి విపత్తులు, కట్టుతప్పిన కర్బన ఉద్గారాలు, వనాల విధ్వంసం, సాగు పద్ధతుల్లో మార్పులు వంటివి ఎడారీకరణకు దారితీస్తున్నాయి. ప్రధానంగా, మృత్తికా క్రమక్షయంతో ఎడారీకరణ విస్తరిస్తోంది. నేలపై తేమశాతం తగ్గడంవల్ల సూక్ష్మజీవుల ఉనికి, పంటల దిగుబడి తగ్గి రైతులకు నష్టాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ప్రకారం ఏటా సుమారు మూడు కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూములు ఎడారీకరణ చెందుతున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 కోట్ల ప్రజల జీవన, ఆహార భద్రతపై ప్రభావం పడుతోంది. ఎడారీకరణ, కరవు పరిస్థితులవల్ల కోట్ల మంది నిర్వాసితులుగా మారుతున్నారు. 2030 నాటికి వంద దేశాలు ఈ దుష్ప్రభావాలను ప్రత్యక్షంగా చవిచూస్తాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం ఇండియాలో దాదాపు 30శాతం నేలలు ఎడారీకరణ దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఈ ముప్పు అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భూసారం ఎక్కువగా తెగ్గోసుకుపోతోంది.


పటిష్ఠ చర్యలు

భూగోళంపై ఇప్పటికే 40శాతం భూసారం క్షీణించి, సగం మానవాళి ప్రత్యక్ష నష్ట ప్రభావాన్ని చవిచూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారీకరణ, కరవు కాటకాల కట్టడికి ప్రపంచ దేశాలు సమైక్యంగా పాటుపడాలి. భూవనరుల పునరుజ్జీవానికి సంబంధించిన విధానాల అమలులో ఇండియాకు చిత్తశుద్ధి లోపించిందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వాలు ఈ సమస్య లోతుపాతులను అర్థం చేసుకుని, లోపభూయిష్ఠ విధానాల సమగ్ర ప్రక్షాళనకు నడుంకట్టాలి. ప్రకృతి వనరుల విధ్వంసాన్ని చిత్తశుద్ధితో నియంత్రించి, వాటి సమగ్ర సంరక్షణకు పాటుపడినప్పుడే భవిష్యత్తు తరాల జీవనానికి భద్రత లభిస్తుంది. భూ వనరులు పూర్తిగా నిర్జీవమై, క్షీణతకు గురైతే వాటిని పునరుద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకుని సమగ్ర జల, భూ నిర్వహణ విధానాలు, సేంద్రియ సాగు పద్ధతులను ప్రోత్సహించాలి. వనాలను కాపాడటం, కోల్పోయిన అటవీ భూముల్లో పచ్చదనాన్ని పెంచడమూ కీలకాంశం. భూ వనరుల సంరక్షణకు క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఉపగ్రహాల ద్వారా ఎడారీకరణకు గురవుతున్న భూములు, చిత్తడి నేలలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ వాటి పునరుద్ధరణకు పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలి. భూసార పరిరక్షణ, దాని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడమూ తప్పనిసరి. పర్యావరణ, అటవీ, సహజ వనరుల పరిరక్షణ చట్టాలను అతిక్రమించి ప్రకృతి వనరుల విధ్వంసానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి. అందుకోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

‣ స్విస్‌ సదస్సుకు భారత్‌

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

Posted Date: 19-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని