• facebook
  • whatsapp
  • telegram

ఓటరు తీర్పులో ఒదిగిన సందేశంవర్తమానంలో ఎదుర్కొంటున్న బాధల నుంచి బయటపడి భవిష్యత్తులో తమ బతుకుబాట మెరుగ్గా ఉండాలన్న కోట్లాది ప్రజానీకం అభిలాష ఎన్నికల ఫలితాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తమ బతుకులను కళకళలాడించి, తమ పిల్లలకు మంచి జీవితం ప్రసాదించాలన్న సందేశానికి ప్రజాతీర్పు అద్దంపడుతుంది. దాన్ని అర్థం చేసుకొని పాలకులు వాస్తవ ప్రజాకాంక్షలకు పట్టంకట్టినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుంది. 


సంఖ్యాబలమే ప్రజాస్వామ్యంలో శిరోధార్యమైనా- ప్రజాతీర్పు వెనక నిరుపేదల ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహాలు కనిపిస్తాయి. భవిష్యత్తుపై ఆశ అందులో ప్రతిధ్వనిస్తుంది. 1951-52లో ఇప్పటిలాగానే మొదటి లోక్‌సభ ఎన్నికలు సుదీర్ఘంగా జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 1951 అక్టోబర్‌ నుంచి 1952 ఫిబ్రవరి వరకు 489 లోక్‌సభ స్థానాలకు, 25 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భవిష్యత్‌ భారతావని కోసం ప్రజలు ఓట్లు వేశారు. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన ఒక ఉద్విగ్న స్థితిలో 45శాతం ఓటర్ల తీర్పుతో జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో తొలి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. శైశవ ప్రాయ భారతావనిలో నాటి తీర్పు దేశభక్తి, నిస్వార్థం, కృతజ్ఞతాభావాలకు అద్దంపట్టింది. ఆ తరవాత 1951-2024 మధ్య మొత్తం 17 సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ఎన్నికల ద్వారా 97 కోట్లకు పైగా ఓటర్ల ఆకాంక్షలకు ప్రతిబింబంగా 18వ లోక్‌సభ కొలువుదీరబోతోంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం మూడు, నాలుగు దశాబ్దాల పాటు జరిగిన ఎన్నికలను నవభారత నిర్మాణానికి ప్రతీకలుగా భావించి, అదే స్ఫూర్తిని ప్రజలు తమ తీర్పుల్లో వెలువరించారు. అప్పటి ఎన్నికల్లో సమూహ ఆకాంక్షలే తప్ప వ్యక్తిగత ఆశలు పెద్దగా లేవు. దేశ నిర్మాణం జరిగి, వ్యవస్థలు పాదుకుంటే అందరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయన్న విశాల భావమే నాడు వ్యాప్తిలో ఉండేది.


ప్రపంచీకరణ వైపుగా దేశం అడుగులు వేయడం ప్రారంభించినప్పటి నుంచి ఓటరు మనోగతంలో మార్పు మొదలైంది. అప్పటి వరకు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ప్రభుత్వాలకు ఉన్న దృక్పథం మారింది. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న ప్రైవేటీకరణ క్రమంగా అన్ని రంగాలకూ విస్తరించింది. అనిశ్చిత వ్యవసాయ రంగం, అస్తవ్యస్త ప్రజారోగ్యం, అవిద్యలకు పూర్తిగా చికిత్స జరగకముందే ఉదార ఆర్థిక విధానాల గాలులు బలంగా వీచాయి. సేవారంగం ఉవ్వెత్తున ఎగసినా, మిగిలిన మౌలిక రంగాలు మసకబారాయి. టెలికమ్యూనికేషన్, పౌర విమానయానం, రిటైల్‌ వ్యాపార విస్తృతితో దేశం వెలిగిపోతున్నా- తమ బతుకులు ఏమీ మారలేదన్న భావన సాధారణ ప్రజల్లో పెరిగిపోయింది. ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెచ్చరిల్లుతుండటంతో జీవనశైలిలో అగాధాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఫలితంగా ఓటరు అంతరంగంలో ఆలోచనా సుడిగుండాలు మొదలయ్యాయి.


ఓడిపోతున్న వ్యవసాయం

ఈ 75 ఏళ్లలో తమ జీవితాలను మెరుగుపరచాలని కేంద్రంలో 17 ప్రభుత్వాలకు ప్రజలు పగ్గాలు అప్పగించారు. అయితే, సామాన్యుల బతుకు బండి గతుకుల బాట మీదనే ఆటుపోట్లకు గురవుతోంది. ముఖ్యంగా, దేశంలో అత్యధిక జనాభాకు జీవనాధారమైన వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. దుక్కిదున్నడం నుంచి పంట చేతికొచ్చి డబ్బు రూపంలో మారేంత వరకు సవాలక్ష సమస్యలు రైతులను నిలువునా కుంగదీస్తున్నాయి. ఏ ప్రభుత్వ పథకాలూ వీటికి సరైన పరిష్కారాలు చూపడంలేదు. రైతులకు కావలసింది ప్రాజెక్టుల ద్వారా పంటనీరు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, గిట్టుబాటు ధరలు. కొత్త ప్రభుత్వం వీటిపై సరైన దృష్టి సారించాలి. కొవిడ్‌ తరవాత దేశీయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య పెరిగింది. ఉన్నత విద్యను దాదాపు ప్రైవేటు రంగానికి అప్పగించిన ప్రభుత్వాలు కనీసం పాఠశాల విద్యనైనా సరిగ్గా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఉపాధ్యాయుల కొరత, నాసిరకం బోధన, మరుగుదొడ్ల లేమితో పాఠశాల విద్య కునారిల్లుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఆ ఒక్క టీచరూ లేకపోవడం, విద్యార్థులు లేరనే నెపంతో మూడు నాలుగు ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులను విలీనం చేయడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ మేధస్సుతో ఏదో ఒక రంగంలో రాణించే ప్రతిభగల గ్రామీణ చిన్నారులు ప్రభుత్వాల వివేకశూన్య నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక మీదట అయినా, విద్యారంగంలో అసలైన కాంతులు నింపడానికి పాలకులు పాటుపడాలి. 


మౌన ఆకాంక్షలు

దేశీయంగా విద్యావంతులైన నిరుద్యోగులు 35శాతం ఉన్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్‌ బసు విశ్లేషణ ప్రకారం- గత రెండు దశాబ్దాల్లో చదువుకున్న నిరుద్యోగులు క్రమేపీ పెరుగుతున్నారు. వీరికి ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరోవైపు రెక్కలకష్టం మీద ఆధారపడిన కార్మికుల జీవితాలూ దినదినగండమవుతున్నాయి. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయని అభివృద్ధి విధానాల కారణంగా ఆకలి మంటలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు జోరందుకొంటున్నాయని బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయి. అయితే, సర్కారీ ఆసుపత్రుల్లో సామాన్యుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో చాలినన్ని పడకలు లేక, చివరికి సెలైన్‌ బాటిల్‌ పెట్టే స్టాండ్లు సైతం కొరవడి నిరుపేదలు నరకం అనుభవిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఇంకా పురుడు కోసం అయిదారు మైళ్ల దూరం డోలీలో మోసుకెళ్ళే దుస్థితి నెలకొనడమేమిటి? అందరికీ వైద్య సేవలను చేరువ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, సమర్థులైన వైద్యుల నియామకాలు అత్యవసరం. పాలకులెవరైనా సరే- వీటిమీద చూపించే శ్రద్ధాసక్తులే వికసిత భారతావని ఆవిష్కరణకు ఆలంబనగా నిలుస్తాయి.


నమ్మకం పెరిగేదప్పుడే..

సాధారణంగా ఎన్నికల అనంతరం ప్రజాతీర్పు వెలువడ్డాక గెలిచిన పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రజలు ఇష్టపడ్డారనో, తమ పాలనకు జనం జేజేలు పలికారనో విజయగర్వంతో చెబుతాయి. నిజానికి, ప్రజాతీర్పులో ఏ ఒక్క విషయమో విజయకారణమై ఉండదు. భవిష్యత్తు విషయంలో ప్రజల కళ్లలో ఎప్పుడూ ఆశాజ్యోతులు వెలుగుతుంటాయి. వర్తమానంలోని నిరాశా జీవితం ముగింపునకు, సుందర భవిష్యత్తు ఆవిష్కరణకు ప్రజలు ఏర్పరచుకునే వారధులే కొత్త ప్రభుత్వాలు. ఓటరు మనసులో నుంచి వచ్చిన వ్యక్తిగత నిర్ణయం సమూహశక్తిలో లీనమై ప్రజాతీర్పుగా బహిర్గతమవుతుంది. అందులోంచే నూతన ప్రభుత్వాలు కొలువుతీరతాయి. చేసిన వాగ్దానాలకు, ప్రజాసమస్యల పరిష్కారానికి అవి కట్టుబడినప్పుడే ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

‣ తైవాన్‌పై డ్రాగన్‌ దూకుడు

‣ ఆరేళ్ల నిబంధన అవసరమా?

‣ ఆహారభద్రతకు విఘాతం

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

Posted Date: 04-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం