• facebook
  • whatsapp
  • telegram

మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు



ఈ సంవత్సరం భారత్‌, అమెరికా సహా 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో విభజన తేవడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి విదేశీ శక్తులు ఇప్పటికే కృత్రిమ మేధను (ఏఐ) ప్రయోగిస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చైనా కుతంత్రాలు పన్నే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


ఇటీవల ముగిసిన తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో చైనా మద్దతుగల స్టార్మ్‌ 1376 అనే గ్రూపు కృత్రిమ మేధతో తప్పుడు, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాపింపజేసింది. తద్వారా కొందరు అభ్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికి, ఓటర్లను తికమకపెట్టడానికి ప్రయత్నించింది. భారతదేశ లోక్‌సభ ఎన్నికల్లోనూ చైనా ఇదేవిధంగా జోక్యం చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు హెచ్చరించారు. ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యాతోపాటు చైనా సైతం ప్రయత్నిస్తుందని అక్కడి గూఢచారి సంస్థలు భావిస్తున్నాయి.


విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీసి..

అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికలోనే హిల్లరీ క్లింటన్‌ను ఓడించడానికి సామాజిక మాధ్యమాల్లో రష్యా ప్రభుత్వ ఏజెంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2024 ఎన్నికలోనూ రష్యా ఏఐ సాంకేతికతలతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని అమెరికా సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీకి ఇటీవల సమర్పించిన నివేదికలో గూఢచార సంస్థలు హెచ్చరించాయి. అగ్రరాజ్యంలో కొందరు రాజకీయ నాయకులపై గురిపెట్టడానికి చైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని ఉపయోగించవచ్చని అక్కడి నేరపరిశోధక శాఖ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ రే సెనెట్‌కు తెలిపారు. అందుకే టిక్‌టాక్‌ను ఏదైనా పాశ్చాత్య కంపెనీకి విక్రయించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. రష్యా, చైనాలకు ఇరాన్‌ సైదోడుగా నిలవవచ్చని అమెరికా అనుమానిస్తోంది. ఏఐ సృష్టించిన న్యూస్‌ యాంకర్ల సాయంతో తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇరాన్‌ ఆరితేరింది. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సహాయాన్ని పెంచాలని బైడెన్‌ సర్కారు ప్రయత్నిస్తుంటే, అసలు మద్దతునే నిలిపివేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు పట్టుపడుతున్నారు. నవంబరు నాటి అధ్యక్ష ఎన్నికలో బైడెన్‌ ఓడిపోతే, అది రష్యాకు ఆనందదాయకమవుతుంది. అందుకే ఏఐ సాధనాలతో అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారుచేయడానికి క్రెమ్లిన్‌ ప్రయత్నిస్తుందని గూఢచార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు, దాని నాటో మిత్రులకు మధ్య పొరపొచ్చాలు తేవడానికి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రష్యా ఏఐని వినియోగించవచ్చు.


తైవాన్‌ విషయంలో అమెరికాతో విభేదాలు పెరిగిన నేపథ్యంలో చైనా హ్యాకర్లు ఇప్పటికే అమెరికాలో కుటిల పన్నాగాలు పన్నుతున్నారని మైక్రోసాఫ్ట్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ బృందం వెల్లడించింది. ఓటర్లలో విభేదాలను రెచ్చగొట్టే ప్రశ్నలతో సామాజిక మాధ్యమాలలో సర్వేలు జరపడం, వివిధ వయోవర్గాలవారి మనోభావాలను ప్రభావితం చేయడం వంటి చర్యలకు చైనా హ్యాకర్లు పాల్పడుతున్నారు. అమెరికాతోపాటు బ్రిటన్‌లోనూ రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్లు బురదజల్లుతున్నారు.


ఏఐ సాయంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయడం సులువైపోతోంది. దీన్ని డీప్‌ఫేక్‌ అంటారు. యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల్లో ఏఐ కల్పిత వీడియోలు, ఫొటోలు, సమాచారాలను ప్రచారం చేయడం ద్వారా ఓటర్ల విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీసి, సరైన ఎంపిక చేయలేని స్థితిలోకి వారిని నెట్టడమే హ్యాకర్ల లక్ష్యం. అల్లర్లు జరిగాయనో, పోలింగ్‌ వాయిదా పడిందనో చెప్పి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా నిరోధించడానికి లేదా పోలింగ్‌ శాతం బాగా తక్కువగా ఉండేలా చూడటానికి ఏఐ సాంకేతికతలను ఉపయోగించవచ్చు. ఇటీవల న్యూ హ్యాంప్‌షైర్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఇలాంటి ఎత్తుగడను ఉపయోగించారు. డెమోక్రటిక్‌ పార్టీ ఓటర్లు ప్రైమరీలో ఓటు వేయవద్దని, తమ ఓటును నవంబరు అధ్యక్ష ఎన్నికలో ఉపయోగించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించినట్లు భ్రమింపజేసే ఏఐ కల్పిత ఫోన్‌కాల్‌ను హ్యాకర్లు ప్రచారంలోకి తెచ్చారు. దీనివెనక చైనా లేదా రష్యా హస్తం ఉన్నట్లు నిర్ధారణ కాకపోయినా ఏఐతో ఎలాంటి వక్ర ప్రయోగాలు చేయవచ్చో అర్థమవుతోంది. ఎన్నికలు ముగిశాక ఫలితాలను తప్పుపట్టడానికీ ఏఐని ఉపయోగించవచ్చు.


అవగాహన కీలకం

ప్రస్తుతానికి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంలో చైనా, రష్యాలు విజయం సాధించలేకపోయినా, పోనుపోను ఏఐ సాయంతో పెద్ద ముందంజ వేయవచ్చని ఎఫ్‌బీఐ, మైక్రోసాఫ్ట్‌ భావిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో డీప్‌ఫేక్స్‌, ఇతర కుయుక్తులను కనిపెట్టి తొలగించడానికి కృషి చేస్తామని ఇటీవల గూగుల్‌, మెటా, ఎక్స్‌, ఓపెన్‌ ఏఐ వంటి 20 బడా టెక్‌ సంస్థలు వాగ్దానం చేశాయి. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. ఏఐ తదితర సాంకేతికతల దుర్వినియోగం గురించి ప్రజలకు అవగాహన పెంచాలి.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?

‣ అయోమయంలో అమెరికా ఓటరు

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

Posted Date: 15-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం