• facebook
  • whatsapp
  • telegram

బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకతప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపే లక్ష్యంగా ఓట్లను ఒడిసిపట్టడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడతాయి. ముఖ్యంగా భావోద్వేగాలను రగిలించే నినాదాలిస్తాయి. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్‌లలో విపక్షాలు మాత్రం భారత వ్యతిరేక ప్రచారాన్నే నమ్ముకున్నాయి.


‘ఇండియా అవుట్‌’ నినాదంతో గత సెప్టెంబరులో ఎన్నికల గోదాలో దిగిన మాల్దీవుల విపక్షనేత మొహమ్మద్‌ ముయిజ్జు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌లో మాత్రం ఆ పాచిక పారలేదు. ప్రజల మనసుల్లో భారత వ్యతిరేక భావోద్వేగాలను రగిలించడం ద్వారా షేక్‌ హసీనా సర్కారును కూలదోయాలనుకున్న ప్రధాన విపక్షం బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ)- జనవరి ఎన్నికల్లో మట్టికరచింది. అక్కడ ఇండియా అనుకూల హసీనాయే అయిదోసారి ప్రధాని పీఠం దక్కించుకున్నారు. ఆ తరవాత కూడా బీఎన్‌పీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతోంది. ఇండియా దీన్ని అంతర్జాతీయంగా తన పలుకుబడికి, ప్రతిష్ఠకు, వాణిజ్యానికి, సంబంధాలకు ఎదురవుతున్న సవాలుగానే చూడాలి. మాల్దీవుల్లో మాదిరిగా బంగ్లాదేశ్‌లోనూ ‘ఇండియా అవుట్‌’ ప్రచారం వెనక చైనా ప్రోద్బలం ఉందన్న విశ్లేషణలు- భారత్‌కు హెచ్చరికలు!


కార్పొరేట్‌ వ్యక్తుల ప్రమేయంతో..

చైనా, పాకిస్థాన్‌లకు అనుకూలమని ముద్రపడిన బీఎన్‌పీ- ‘ఇండియా అవుట్‌’ నినాదంతో ఇటీవలి పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంది. ఓటమిపాలైన తరవాత, భారతీయ వస్తువులను బహిష్కరించండని వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పారిస్‌లో ఉంటున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకి భట్టాచార్య ఓటర్లను ప్రభావితం చేసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించడంలో దిట్ట. ఆయన సూచన మేరకే బీఎన్‌పీ నేతలు ఇండియా అవుట్‌ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకొంటోందని, హసీనా నెగ్గేలా అప్రజాస్వామిక చర్యలకు దిగిందని భట్టాచార్య తన మద్దతుదారులకు నూరిపోస్తున్నారు. భారతీయ వస్తువులను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో బంగ్లాదేశీయులకు పిలుపిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు కొందరు ఆయనకు వంతపాడుతున్నారు. ఆ క్రమంలోనే బీఎన్‌పీ సీని యర్‌ నేత రుహుల్‌ కబీర్‌ రిజ్వీ ఇటీవల తన మెడలోని కశ్మీరీ శాలువాను విసిరికొట్టారు. ఇతర విపక్ష నేతలు సైతం భారతీయ వస్తువులను ధ్వంసంచేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. వాటికి స్పందించిన ప్రధాని హసీనా- విపక్ష నేతలు ముందుగా తమ భార్యల వద్దనున్న భారతీయ చీరలను తగలబెట్టాలంటూ చురక అంటించారు. భారతీయ చీరలకు బంగ్లాదేశ్‌లో భారీ డిమాండ్‌ ఉంది. విపక్ష నేతల బంధువులు చాలామంది ఇండియా నుంచి వాటిని తీసుకెళ్ళి విక్రయిస్తుంటారు. భారత్‌ నుంచి వచ్చే ఉల్లిపాయలు, మసాలాలు, వెల్లుల్లి అల్లం పేస్టులను కూడా వాడటం మానేయండంటూ విపక్ష నేతలను ఉద్దేశించి హసీనా వ్యాఖ్యానించారు. మన దేశం నుంచి కాఫీ, తేయాకు, చక్కెర, మిరియాలు, కారం, అల్లం, పసుపు, మసాలా దినుసులు, ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, ప్లాస్టిక్‌ వస్తువులు బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతాయి. అక్కడి నుంచి నాణ్యమైన వస్త్రాలు, దుస్తులతో పాటు తోలు, రసాయనాలు, పాదరక్షలు, ఇనుము వంటివి మనకు వస్తాయి. దక్షిణాసియాలో భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఢాకాయే. ఆసియా ప్రాంతంలో బంగ్లాదేశ్‌ నుంచి అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నది ఇండియాయే. 2022-23లో ఉభయ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ.1,33,443 కోట్లు!


డ్రాగన్‌ పన్నాగం

ఒకప్పుడు విశాల భారత ఉపఖండంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్‌- సంస్కృతీ సంప్రదాయాలపరంగా భారత్‌కు ఎంతో దగ్గరైన దేశం. చారిత్రకంగా, భాషాపరంగా రెండు దేశాల మధ్య పురాతనకాలం నుంచీ దృఢమైన సంబంధాలున్నాయి. 1971లో బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిందే భారత్‌ సహకారంతో. కొత్త తరానికి ఈ విషయం అంతగా తెలియదు కాబట్టి, భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయడం ద్వారా యువ ఓటర్లను ఆకర్షించవచ్చన్నది బీఎన్‌పీ ఎజెండాగా కనిపిస్తోంది. కానీ, అదేమంత సులభం కాదు. చైనా బంగ్లాదేశ్‌లో షిప్పింగ్‌, రైల్వే, జాతీయ రహదారులు, విద్యుత్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తోంది. 27 ప్రాజెక్టులకు రుణాలిచ్చింది. భవిష్యత్తులో బీఎన్‌పీ అధికారంలోకి వస్తే- చైనా ఆ ప్రభుత్వం ద్వారా భారత వ్యతిరేక విధానాలను అమలుపరచే ప్రమాదముంది. అదే జరిగితే ఇండియా వాణిజ్యపరంగా, భౌగోళికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. భారత్‌లో చదువుతున్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా బంగ్లాదేశీ విద్యార్థులు మూడో స్థానంలో ఉన్నారు. వారికి అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను పెంచాలి. ఆ దేశంతో వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. బంగ్లాదేశీయుల మనసుల్లో బలమైన సానుకూల ముద్ర ఉన్నంతవరకు- భారత వ్యతిరేక ప్రచారంతో విపక్షాలకు నికరంగా ఒనగూడేది ఏమీ ఉండదు!


- తమ్మిశెట్టి రఘుబాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?

‣ అయోమయంలో అమెరికా ఓటరు

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

Posted Date: 15-04-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని