• facebook
  • whatsapp
  • telegram

సేద్య సంక్షోభానికి ఎరువు



కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి  కోత పెట్టడం అన్నదాతలకు పిడుగుపాటే! అనేక సమస్యలతో సతమతమవుతున్న వ్యవసాయానికి బడ్జెట్లో ఊరట కలిగించే వరాలు ఇస్తారని రైతులంతా ఎదురుచూశారు. ప్రభుత్వం మాత్రం తమకు మరిన్ని ఇక్కట్లను తెచ్చిపెట్టే నిర్ణయమే తీసుకుందంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దేశ జనాభాలో 60శాతానికి వ్యవసాయమే జీవనాధారం. భారత్‌లో సుమారు 15.4 కోట్ల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. మొత్తం సాగు భూమిలో 60శాతం వర్షాధారితమే. వానలు సమృద్ధిగా కురిస్తేనే ప్రాజెక్టుల్లోకి నీరు చేరి సేద్యానికి భరోసా దక్కుతుంది. దీనికితోడు విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరగడం, కూలీల కొరత, చీడపీడలు, నేల కోత, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వంటి సమస్యలవల్ల వ్యవసాయం గాలిలో దీపంలా మారింది.


రైతులపై భారం

దేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి పురాతన పద్ధతులే ప్రధాన కారణం. ఇతర దేశాలు పరిశోధనలు, ఆవిష్కరణల ఊతంతో ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాయి. భూసారం పెంపుదలకు, నేల సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్నాయి. భారత్‌లో ఆ దిశగా సరైన చర్యలు కొరవడుతున్నాయి. 1960 దశకంలో హరిత విప్లవం తరవాత రసాయన ఎరువుల వాడకం పెరిగింది. దాంతో ప్రయోజనకరమైన కీటకాలు బాగా తగ్గిపోయాయి. భూసారం క్షీణించడం, చీడపీడలు అధికం కావడం ఉత్పాదకత కుంచించుకుపోవడానికి దారితీశాయి.


దేశంలో 2022-23 సీజన్‌తో పోలిస్తే 2023-24 సీజన్‌లో ఎరువుల వినియోగం 14శాతం మేర పెరిగింది. అందులో యూరియా వాటానే అధికం. కేంద్రం మొత్తం ఎరువుల సబ్సిడీలో 65శాతాన్ని యూరియాకు, 35శాతాన్ని డీఏపీ, ఎన్‌పీకే తదితర ఎరువులకు ఇస్తోంది. భారత ఎరువుల మార్కెట్‌ విలువ 2020లోనే సుమారు 73లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. 2021-23 మధ్య దేశీయ ఎరువుల మార్కెట్‌ 11.9శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. దేశీయ ఎరువుల ఉత్పత్తి అంతంతమాత్రమే కావడంతో రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సరఫరా సమస్యల కారణంగా రైతులను ఏటా ఎరువుల కొరత వేధిస్తోంది. దాంతో సాగు జాప్యమవుతోంది. సీజన్‌ మధ్యలోనూ ఎరువులు పూర్తిస్థాయిలో లభ్యం కావడంలేదు. అన్నదాతలకు సరసమైన ధరలకు ఎరువులు అందించడానికి ‘ఒన్‌ నేషన్‌-ఒన్‌ ఫెర్టిలైజర్‌’ పథకాన్ని ఎన్డీఏ సర్కారు 2022లో ప్రారంభించింది. దీని ద్వారా సబ్సిడీ ఎరువులన్నింటినీ కంపెనీలు ‘భారత్‌’ బ్రాండ్‌తో పంపిణీ చేస్తున్నాయి. ఒకే రకమైన ఎరువును వేర్వేరు కంపెనీలు తయారుచేసినా వాటిలోని పోషక విలువలు మాత్రం ఒకేలా ఉండాలని కేంద్రం నిర్దేశించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు దుకాణాలు ఎరువులను విక్రయిస్తున్నాయి. అయినాసరే, రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు! సబ్సిడీ ధర కింద ఒక రైతుకు ఒక బస్తా ఎరువే లభిస్తుంది. దాంతో అన్నదాతలు బ్లాక్‌మార్కెట్లో వ్యాపారుల నుంచి ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం ఎరువులను పంపిణీ చేయలేకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 పద్దులో ఎరువుల సబ్సిడీని రూ.1,75,148.48 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించింది. దేశీయ యూరియా ఉత్పత్తుల పెంపుదల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నానో యూరియా, డీఏపీ ఎరువులను ప్రోత్సహిస్తామని ప్రకటించింది. ఎరువుల ఉత్పత్తులను పెంచడానికిగాని, వాటి వాడకాన్ని తగ్గించడానికిగాని ఇది సరైన పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల ఎరువుల ధరలు పెరిగి రైతులపై భారం మరింత అధికమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి దిగుమతులు నిలిచిపోయి, ఎరువుల ధరలు అధికమవుతున్నాయి. ఇప్పుడు సబ్సిడీల కోతవల్ల వాటి కొరత మరింత పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులకు కొరత ఏర్పడినా, వాటి ధరలు పెరిగినా- పెట్టుబడులు అధికమై సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదముంది.


భారత్‌లో ఉత్పత్తి పెంచేలా..

ఎరువుల రంగం ఎంతో కీలకమైంది. వ్యవసాయంతో పాటు రైతుల జీవితాలతో అది ముడివడి ఉంటుంది. కాబట్టి కేంద్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయాలు చూపకుండా, రైతులను సన్నద్ధం చేయకుండా ఎరువుల సబ్సిడీని ఎత్తివేయడం అనర్థాలకు దారితీస్తుంది. రాయితీలో కోతల్లేకుండా దేశీయ ఎరువుల ఉత్పత్తి పెంపుదలకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ప్రకృతి అనుకూల సేద్య విధానాల విస్తృతికి పెద్దయెత్తున చర్యలు చేపట్టాలి. మిశ్రమ వ్యవసాయం, పంట మార్పిడిని ప్రోత్సహించాలి. జన్యు పరిశోధనలకు ఊతమివ్వడం ద్వారా చీడపీడలను తట్టుకోగల వంగడాలను సృష్టించాలి.


- ఆకారపు మల్లేశం
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశంలో పేదరికం లెక్కలేనంత!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

Posted Date: 07-02-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం