• facebook
  • whatsapp
  • telegram

పాక్‌ సైన్యం రాజకీయ చదరంగంప్రజాస్వామ్యం పరిహాసాస్పదమైన పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీకి మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి అక్కడి సైన్యం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఫలితంగా దాయాది దేశంలో ఎలెక్షన్ల నిర్వహణ మరోసారి ప్రహసనంగా మారనుంది. 


పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏదైనా సైన్యం కనుసన్నల్లో నడవాల్సిందే. అసలు అక్కడ ప్రధాని పదవి దక్కాలంటేనే సైన్యం అడుగులకు మడుగులొత్తాలి. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌(పీఎంఎల్‌ఎన్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌కు ఇది బాగా తెలుసు. అయితే, 2018 ఎన్నికలకు ముందే నాటి సైన్యాధ్యక్షుడు బాజ్వాతో ఆయనకు విభేదాలు పొడచూపాయి. దాంతో సైన్యం, పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కలిసి ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ)కు అధికారం కట్టబెట్టాయి. ఆ తరవాత నవాజ్‌ జైలు, ప్రవాస జీవితం అనుభవించాల్సి వచ్చింది. ప్రధాని పదవి చేపట్టాక ఇమ్రాన్‌ స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అమెరికా-పాక్‌ బంధాన్ని బీటలువార్చారు. బాజ్వా పదవీకాలం పొడిగింపునకూ పేచీ పెట్టారు. నయానో భయానో నాడు పదవి కాపాడుకొన్న బాజ్వా- 2022 ఏప్రిల్‌లో పీటీఐ ప్రభుత్వాన్ని కూలదోశారు. రాజకీయ బద్ధశత్రువులైన పీఎంఎల్‌ఎన్‌, పీపీపీ (పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ) సహా ఎనిమిది పక్షాలను కలిపి ప్రభుత్వం ఏర్పడేలా చేశారు. నవాజ్‌ సోదరుడు షెహబాజ్‌కు ప్రధాని పగ్గాలు అప్పగించారు.


కాలయాపనకు యత్నం

విదేశీ అప్పులు, వాటిపై వడ్డీలు భారీగా పెరిగిపోవడం, అమెరికా ముఖం చాటేయడంతో పాక్‌లో కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్లేశాలు పెరిగిపోయాయి. 2022లో వరదల దెబ్బకు దేశం 3,000 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఐఎంఎఫ్‌ను ప్రసన్నం చేసుకొని అప్పు పుట్టించడానికి సర్కారు ఇంధన ధరలను పెంచింది. ఫలితంగా ద్రవ్యోల్బణం భగ్గుమంది. మరోవైపు జనాదరణ కలిగిన ఇమ్రాన్‌ వర్గం వీధిపోరాటాలతో సైన్యం ఆధిపత్యానికే సవాలు విసిరింది. ఆర్థిక శాఖను నిర్వహించిన పీఎంఎల్‌ఎన్‌పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాగ్రహం తప్పించుకోవడానికి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టి ఎన్నికల నిర్వహణకు కాలయాపన చేయాలని సంకీర్ణంలోని పార్టీలు నిర్ణయించాయి. జాతీయ అసెంబ్లీ గడువు ముగిస్తే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు 60 రోజుల వ్యవధే ఉంటుంది. ముందస్తుగా రద్దు చేస్తే 90 రోజుల గడువు లభిస్తుంది. అందుకే గడువుకు 48 గంటల ముందే ఆపద్ధర్మ ప్రభుత్వానికి షెహబాజ్‌ అధికారం అప్పగించారు. దాని ప్రకారం నవంబర్‌లో ఎన్నికలు జరగాలి. అనూహ్యంగా జనగణన వివరాలు ప్రకటించి నియోజకవర్గాల పునర్విభజనను తెరపైకి తెచ్చారు. డిసెంబర్‌ నాటికి దాన్ని పూర్తి చేసి 2024 జనవరిలో పోలింగ్‌ నిర్వహించాలని లక్షించారు. ఇందులోనూ మరో నెల జాప్యం చోటుచేసుకొని ఫిబ్రవరి ఎనిమిదిని ఎన్నికల తేదీగా నిర్ణయించారు. చలిని సాకుగా చూపి మరోసారి వాయిదా వేయాలని దేశ సెనెట్‌ తీర్మానించినా, న్యాయస్థానం జోక్యంతో ఆ పాచిక పారలేదు.


వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్‌ఎన్‌ నేత నవాజ్‌ను గద్దెనెక్కించడానికి సైన్యం ఆసక్తి చూపుతోంది. ఆర్మీ ఆశీస్సులతో ప్రవాసం వీడి ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎన్నికల్లో పోటీపై నిషేధం ఉన్నా నామినేషన్‌ దాఖలు చేయగలిగారు. మరోవైపు పీటీఐని సైన్యం చెల్లాచెదురు చేసింది. కీలక నేతలను జైళ్లలో కుక్కింది. ఇమ్రాన్‌ ఖాన్‌పై 150వరకు కేసులు నమోదయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు కేసుల్లో శిక్షలు పడ్డాయి. వీటికి తోడు బ్యాట్‌ గుర్తుపై ఈసీ నిషేధం, ఇమ్రాన్‌ నామినేషన్‌ తిరస్కరణ వంటివి పీటీఐని కుంగదీశాయి. దీంతో ఆ పార్టీ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరు గెలిచినా సైన్యం వేధింపులు తట్టుకొని ఇమ్రాన్‌ వెంట ఉంటారన్న నమ్మకం లేదు. స్వతంత్రులతో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో ఇప్పటికే పీటీఐ నేతలకు తలుపులు బార్లా తెరిచారు.


నవాజ్‌కే పరిస్థితులు అనుకూలం

క్షేత్రస్థాయిలో ఇమ్రాన్‌పై సానుభూతి ఉంది. అయితే, పంజాబ్‌లో సైన్యం మద్దతు ఉన్నవారే అధిక స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని గత ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పరిస్థితులు పీఎంఎల్‌ఎన్‌కు అనుకూలంగా మారాయి. అయితే, సైన్యంతో సన్నిహితంగా ఉండే పలు పక్షాలతో ఏర్పడ్డ సంకీర్ణానికి నవాజ్‌ నేతృత్వం వహిస్తారా, సొంత బలంతోనే గద్దెనెక్కుతారా అనేది వచ్చే ఎన్నికల్లో తేలాలి. ఆయన పూర్తి మెజారిటీ సాధిస్తే భవిష్యత్తులో సైన్యం-పౌర ప్రభుత్వం మధ్య ఘర్షణ పునరావృతమై మరోసారి రాజకీయ అస్థిరత తలెత్తే అవకాశం ఉంది.


- పి.ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

‣ కాటేస్తున్న కాంతి కాలుష్యం

‣ ముందుచూపుతో తప్పిన ముప్పు

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

Posted Date: 07-02-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని