• facebook
  • whatsapp
  • telegram

కాటేస్తున్న కాంతి కాలుష్యంప్రస్తుతం రాత్రిళ్లు పట్టణాలు, నగరాల్లో ఎక్కడికి వెళ్ళినా కళ్లు మిరుమిట్లుగొలిపేలాగా విద్యుత్‌ దీపాలు కనిపిస్తాయి. వీటివల్ల ఆకాశం తన సహజత్వాన్ని కోల్పోతోంది. ఈ కాంతి కాలుష్యం వల్ల మనుషులతో పాటు వన్యప్రాణులు, ఇతర జీవులకూ పలు సమస్యలు తలెత్తుతున్నాయి.


రాత్రిని విద్యుద్దీపాలతో కాంతిమయం చేసిన మానవ సామర్థ్యం విభిన్న ఫలితాలకు కారణమైంది. కృత్రిమ కాంతి పని వేళలను పెంచి మరింత    అభివృద్ధికి బాటలు వేసింది. అయితే, ప్రస్తుతం మానవాభివృద్ధిలో భాగంగా విద్యుత్‌ దీపాల వాడకం పెరిగింది. రాత్రి వేళల్లో వాహనాల లైట్లు, వీధి దీపాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, కట్టడాలు, ప్రకటనల హోర్డింగుల కోసం ఉపయోగించే విద్యుత్‌ దీపాల వల్ల ఆకాశంలోకి కృత్రిమ కాంతి పరచుకుంటోంది. దీన్ని స్కైగ్లోగా వ్యవహరిస్తారు. ఈ కాంతి కాలుష్యం మనుషుల్లో, వన్యప్రాణుల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దీనివల్ల ఇంధనం, ధనం వృథా అవుతున్నాయి. కాంతి కాలుష్యం వల్ల జీవరాశులకు నిద్రాభంగం కలిగి, వాటి జీవగడియారంలో మార్పులు వస్తున్నాయి.  ముఖ్యంగా నీలిరంగు కాంతి జంతువులు, మనుషుల్లో మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించి నిద్రలేమికి, ఆలసటకు, ఒత్తిడికి, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. మెలటోనిన్‌ స్థాయి తగ్గడానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉందని పరిశోధనలు చాటుతున్నాయి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ పరికరాలు, ఎల్‌ఈడీ బల్బులు నీలిరంగు కాంతినే వెదజల్లుతాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీగా విద్యుత్‌ దీపాలను వాడుతున్నాయి. దీనివల్ల తీవ్ర కాంతి కాలుష్యం వెలువడుతోంది.


వలస సమయంలో చంద్రుడిని, నక్షత్రాలను ఆధారం చేసుకొని ప్రయాణించే పక్షులు, సముద్రపు తాబేళ్లు కృత్రిమ కాంతి వల్ల గందరగోళానికి గురై, దారితప్పి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీన్ని    నివారించేందుకు కొన్ని నగరాల్లో వలస పక్షులు ప్రయాణించే సమయంలో రాత్రిళ్లు విద్యుత్‌ దీపాలు ఆర్పివేస్తున్నారు. పక్షులు, ఇతర ప్రాణులకు ఆహారమైన కీటకాలు, పురుగులు సైతం కృత్రిమ కాంతి ఆకర్షణకు లోనై మరణిస్తున్నాయి. దానివల్ల పక్షులు, ఇతర ప్రాణులకు సరైన ఆహారం లభించడం లేదు. గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కాంతి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. కాంతి కాలుష్యం లేని సహజమైన రాత్రి ఆకాశాన్ని పరిరక్షించడానికి అంతర్జాతీయంగా పలు సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా 2016లో ప్రచురించిన పటం ప్రకారం ఉత్తర అమెరికా, ఐరోపా, మధ్యాసియా, ఆసియాల్లోని చాలా ప్రాంతాలు రాత్రిపూట కృత్రిమ వెలుగులతో నిండిపోయి ఉన్నాయి. అత్యధిక కాంతి కాలుష్యం కలిగిన దేశాల జాబితాలో సింగపూర్‌, ఖతర్‌, కువైట్‌లు నిలిచాయి. ఈ పటం ప్రకారం వన్యప్రాణుల రక్షిత ప్రాంతాలూ కాంతి కాలుష్యం బారిన పడుతున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డార్క్‌ స్కై అసోసియేషన్‌(ఐడీఏ)- నిశీధితో నిండిన ఆకాశం (డార్క్‌ స్కై) పరిరక్షణకు, ఖగోళ అధ్యయనానికి పాటుపడుతోంది. ఐడీఏ 2001 నుంచి ఇప్పటిదాకా దాదాపు రెండు వందల డార్క్‌ స్కై ప్రదేశాలను గుర్తించింది. తాజాగా, ఆసియా ఖండంలో అయిదోదిగా, దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ను డార్క్‌ స్కై వన్యప్రాణి రక్షిత ప్రాంతంగా ఏడీఏ ప్రకటించింది. రాత్రిపూట ఆకాశం తన సహజత్వాన్ని కోల్పోకుండా పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లోని బఫర్‌ ప్రాంత గ్రామాల్లో పలు చర్యలు తీసుకున్నారు. వీధి దీపాల నుంచి వెలువడే కాంతి చుట్టుపక్కలకు, ఆకాశంలోకి విస్తరించకుండా వాటిని నేల వైపు ఏర్పాటు చేశారు. పర్యావరణ పర్యటకంలో పేరొందిన పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రస్తుతం గాఢాంధకార ఆకాశంతో ఉన్న ఉద్యానవనంగా నక్షత్ర వీక్షణం, ఇతర అంశాలకు సంబంధించి కార్యశాలలు, కోర్సులు నిర్వహించనుంది. ఇక్కడ రాత్రిళ్లు నక్షత్ర వీక్షణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంతి కాలుష్యం ఎన్నో ప్రాణులకు ఇబ్బందికరంగా మారినందువల్ల, దేశీయంగా ప్రజలు అవసరం మేరకే విద్యుత్‌ దీపాలు వినియోగించాలి. అనవసరంగా ఆకాశంలోకి వెలుతురు విస్తరించకుండా చూడాలి. కాంతి కాలుష్యం వల్ల రాత్రి సమయంలో నల్లని ఆకాశంలో అబ్బురపరచే నక్షత్రాలను, ఇతర ఖగోళ అద్భుతాలను వీక్షించే అవకాశాన్ని ఎవరూ కోల్పోకూడదు. మానవులు, పక్షులు, జంతువులు, ఇతర జీవులపై కాంతి కాలుష్యం చూపే ప్రభావం, ప్రకృతి సహజ జీవనం గురించి స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలి.


- ఎం.రామ్‌మోహన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముందుచూపుతో తప్పిన ముప్పు

‣ డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

‣ రాజ్యాంగమే రక్షణ ఛత్రం

‣ అడుగంటుతున్న జలాశయాలు

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

Posted Date: 07-02-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని