• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం



వ్యూహాత్మక అవసరాల కోసం భారత్‌, యూకేలు పరస్పరం దగ్గరవుతున్నాయి. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లండన్‌ పర్యటన ఈ దిశగా బలమైన సంకేతాలను ఇచ్చింది. రక్షణ, శాస్త్రసాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.


చారిత్రకంగా చూస్తే భారత్‌-యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)ల మధ్య సంబంధాలు ఎన్నో ఒడుదొడుకులు, రాజకీయ వివాదాలను ఎదుర్కొన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం వేళ న్యూదిల్లీ మొగ్గు మాస్కో వైపు ఉండటం, మరోవైపు బీజింగ్‌, ఇస్లామాబాద్‌లతో లండన్‌ అంటకాగడం వంటివి ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. కశ్మీర్‌, ఖలిస్థానీ వేర్పాటువాదులు, భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి బ్రిటన్‌ చిరునామాగా మారడమూ ఇరు దేశాల సంబంధాలకు విఘాతకరంగా మారింది. భారత్‌-యూకేల మధ్య 2010లో హాక్‌ట్రెయినర్‌ విమానాల కోసం చివరిసారి ఆయుధ ఒప్పందం జరిగింది. భారత రక్షణ మంత్రి 22 ఏళ్లపాటు బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించలేదంటే ఇరు దేశాల మధ్య పెరిగిన దూరాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనతో రక్షణ సంబంధాల పరంగా ముందడుగు పడింది.


బ్రెగ్జిట్‌ తరవాత యూకే ఆర్థికంగా బలహీనపడటం, హాంకాంగ్‌పై చైనా ఉడుంపట్టు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అవసరాలు వంటివి లండన్‌ వైఖరిలో కొంత మార్పు తెచ్చాయి. 2020లో ‘గల్వాన్‌’ ఘటన తరవాత భారత్‌ అమెరికా మిత్రదేశాలతో సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి సారించింది. 2021లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకొనేందుకు ఇరు దేశాల ప్రధానులు (మోదీ-బోరిస్‌ జాన్సన్‌) అంగీకారానికి వచ్చారు. దానికి అనుగుణంగా ‘2030 రోడ్‌మ్యాప్‌’ను నిర్దేశించుకొన్నారు. ఆ తరవాత వరసగా రెండేళ్లు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాలు ద్వైపాక్షిక విశ్వాసాన్ని పెంపొందించాయి. 2023 అక్టోబర్‌లో ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య 2+2 చర్చలు జరగడం ఓ కీలక మైలురాయి. తాజాగా యూకే పర్యటనకు రాజ్‌నాథ్‌ వెంట డీఆర్‌డీఓ సహా రక్షణ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాల సీనియర్‌ అధికారులు వెళ్ళారు. ఈ సందర్భంగా మన డీఆర్‌డీఓ, యూకేకు చెందిన డీఎస్‌టీఎల్‌ (డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీ) మధ్య రక్షణ రంగంలో తరవాతి తరం సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు జరిపేందుకు ఒప్పందం కుదిరింది.


యుద్ధనౌకల ఇంజిన్ల కోసం భారత్‌ ఇప్పటిదాకా రష్యా, ఉక్రెయిన్‌లపై ఆధారపడింది. రెండేళ్లుగా ఆ దేశాలు యుద్ధంలో తలమునకలు కావడం, అక్కడి కర్మాగారాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధ నౌకలకు అవసరమైన ఎలెక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ అభివృద్ధిపై సహకారం కోసం భారత్‌-యూకే జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొన్నాయి. తాజాగా ఈ గ్రూపు భేటీ జరిగింది. యూకే రక్షణ మంత్రి గ్రాంట్‌షాప్స్‌ సమక్షంలో రాజ్‌నాథ్‌ అక్కడి ఆయుధ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైమానిక ఇంజిన్లు, క్షిపణులు, సముద్ర రక్షణ వ్యవస్థలపై సంయుక్త సహకారం కోసం చర్చలు జరిగాయి.


హిందూ మహాసముద్ర వ్యవహారాలపై ఇక నుంచి భారత్‌, యూకేలు కలిసి పనిచేయనున్నాయి. భారత నౌకాదళం గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసిన ‘హిందూ మహాసముద్ర సమాచార సమ్మిళిత కేంద్రం(ఐఎఫ్‌సీ-ఐఓఆర్‌)’లో యూకే ఇప్పటికే చేరింది. వచ్చే ఏడాది రాయల్‌నేవీకి చెందిన ‘క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌’ (సీఎస్‌జీ)తో కలిసి భారత నౌకాదళం యుద్ధ విన్యాసాలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. వేల మైళ్ల దూరం ప్రయాణించి శత్రువులపై దాడిచేయడం సీఎస్‌జీ ప్రత్యేకత. రాజ్‌నాథ్‌ పర్యటన ఫలాలను పొందాలంటే ఇరు దేశాలు కొన్ని అంశాల్లో పట్టువిడుపులతో వ్యవహరించాలి. న్యూదిల్లీ ఇప్పటికే ఆయుధ తయారీ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియాలను బలంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ సంస్థలు ఇక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకొనే విషయంలో మేధా సంపత్తి హక్కులపై యాజమాన్యం, సున్నితమైన సాంకేతికతలు రష్యాకు లీకవుతాయనే భయాలు ఉన్నట్లు ది ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ పేర్కొంది. వీటిని తొలగిస్తూ భారత్‌ తనపై విశ్వాసం నింపాలి. అలాగే, ఖలిస్థాన్‌ వంటి భారత వ్యతిరేక శక్తులకు తమ భూభాగం అడ్డా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూకేపై ఉంది.


- పి.ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చిప్‌ తయారీకి నయా చిరునామా

‣ ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

Posted Date: 27-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం